AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్తీక పౌర్ణమి రోజునే థాయ్‌లాండ్‌లో లోయ్‌ క్రతోంగ్‌ వేడుక, సరస్సులలో దీపాల కాంతులు

ఆధ్యాత్మికపరంగా కార్తీకమాసానికి ఎన్ని విశిష్టతలు ఉన్నా, సంబరాలకు, వేడుకలకు, ఉత్సవాలకు కూడా కార్తీకం అనువైన మాసం. కార్తీక పౌర్ణమిని అయితే చాలా దేశాలు శుభప్రదంగా భావిస్తాయి.

కార్తీక పౌర్ణమి రోజునే థాయ్‌లాండ్‌లో లోయ్‌ క్రతోంగ్‌ వేడుక, సరస్సులలో దీపాల కాంతులు
Balu
|

Updated on: Nov 30, 2020 | 11:33 AM

Share

ఆధ్యాత్మికపరంగా కార్తీకమాసానికి ఎన్ని విశిష్టతలు ఉన్నా, సంబరాలకు, వేడుకలకు, ఉత్సవాలకు కూడా కార్తీకం అనువైన మాసం. కార్తీక పౌర్ణమిని అయితే చాలా దేశాలు శుభప్రదంగా భావిస్తాయి. శరదృతువును, ఈ రతువులో కాచే వెన్నెలను మనమే కాదు, ఇతర దేశాల ప్రజలు కూడా మురిపంగా చూస్తారు. మనం జరుపుకున్నట్టుగానే పున్నమిలో దీపాల పండుగ చేసుకుంటారు. సంధ్యవేళ దీపారాధన చేస్తారు. ఆ రోజున ఉత్సవాలు చేసుకుంటారు. ఆ మాటకొస్తే కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే దీపం మన కోసం కాదు. లోకానికి మేలు చేసే ప్రతి ఒక్కరి బాగు కోసం! మనలోని చీకట్లను తొలగించడానికి పెట్టిన దీపం. మనో వికాసానికి, ఆనందానికి, సుఖశాంతులకు, సద్గుణానికి దీపం ప్రతీక. ప్రపంచంలో చాలామంది కార్తీక పున్నమి రోజున దీపాలు వెలిగించేది అందుకే!

మనదేశంలోనే కాదు, బౌద్ధాన్ని ఆచరించే దేశాల్లో కూడా దీపారాధన ఉంది.. శారదరాత్రుల పూజ ఉంది. శరత్‌చంద్రజ్యోత్న్సలలో వేడుకలు జరుపుకునే ఆచారం ఉంది. కార్తీక పున్నమిలో దీపాలు వెలిగించి, ఆ దీపాలను ఆరాధించి, నదిలో వదిలే సంప్రదాయమూ ఉంది. థాయ్‌లాండ్‌లో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సంధ్య చీకట్లు ముసురుకున్నాక నదీనదాలను, సరస్సులను,తటాకాలలో దీపాలను వదులుతారు. ఆకాశంలోని తారల ప్రతిబింబాలేమో అన్నట్టుగా ఉంటుందా దృశ్యం. ఈ వేడుకను లోయ్‌ క్రతోంగ్‌ అంటారు. సరిగ్గా కార్తీకమాసపు పున్నమి రాత్రే ఈ ఉత్సవం జరుగుతుంది. థాయ్‌లాండ్‌ వాసులకు ఇది ప్రధానపండుగ. నదులను.. సరస్సులను పూజిస్తారు. యువతులు దీపాలను నీళ్లలో వదులుతారు. కొన్ని చోట్ల పురుషులు కూడా దీపాలను వదులుతారు. లోయ్‌ అంటే తెప్ప. తేలే వస్తువు. క్రతోంగ్‌ అంటే దీపం. తెప్పను అరటికాండం, ఆకులను ఉపయోగించి తయారుచేస్తారు. అచ్చంగా మనలాగే! రంగురంగుల పూలతో తెప్పను అలంకరిస్తారు. అందులో దీపాన్ని లేదా క్యాండిల్‌ను ఉంచుతారు. అగరొత్తులు వెలిగించి అందులో పెడతారు. అందరికంటే భిన్నంగా, అందరిని ఆకట్టుకునే రీతిలో లోయ్‌ క్రతోంగ్‌ను తీర్చిదిద్దిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయి. యువకులేమో తన కష్టాలు తీరిపోవాలని, సుఖశాంతులతో జీవితం సాగిపోవాలని మొక్కుకుంటూ లాంతర్లను ఎగరేస్తారు. పున్నమి వెలుగులతో పాటు ఈ లాంతర్ల కాంతులూ నిర్మలాకాశానికి నిగారింపు తెస్తాయి. పాఠశాలలో క్రతోంగ్‌ పోటీలు జరుగుతాయి. అందమైన అలంకరణలతో ఆకట్టుకునే క్రతోంగ్‌కు నజరానాలుంటాయి. అసలు కార్తీకపున్నమి రోజున థాయ్‌లాండ్‌లో అంతటా వెలుగులే! బాణాసంచా మిరుమిట్లు ప్రత్యేక ఆకర్షణ. అసలు కార్తీకపౌర్ణమిని మనం కూడా ఇంత గొప్పగా జరుపుకోమేమో! ఈ వేడుక ఇప్పటిది కాదు.. కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.. బుద్ధభగవానుడిని. నదీనదాలను పూజించడమే ఈ పండుగ పరమార్థం. ఈ రోజున ప్రతి ఇల్లూ దీపకాంతులతో వెలిగిపోతుంది. ప్రతి ఆలయమూ దేదీప్యమానంగా శోభిల్లుతుంటుంది. రహదారులు, తోటలు, కార్యాలయాల భవనాలు, ఒక్కటేమిటి సమస్తమూ విద్యుద్దీపాలతో కాంతులీనుతుంటాయి. వెన్నెల కాంతులతో లాంతర్ల వెలుగులు పోటీపడతాయి. అన్నింటికంటే ఆకట్టుకునే అంశం మరోటి ఉంది. అది క్రతోంగ్‌ పరేడ్‌. దీపాలతోనూ, రంగురంగుల పూలతో, రకరకాల దీపాలతో అలంకరించిన శకటాల ఊరేగింపే క్రతోంగ్‌ పరేడ్‌. శకటాల ముందు సంప్రదాయ నృత్యాలు, జనపదాల ఆలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అదనపు ఆకర్షణలు. కొన్ని చోట్ల అందాల పోటీలు జరుగుతాయి. థాయ్‌లాండ్‌లో సుప్రసిద్ధమైన వాట్‌ఫానతావో ఆలయం రంగురంగుల లాంతర్లతో అందంగా ముస్తాబవుతుంది.. అక్కడ జరిగే వేడుకలను తిలకించడానికి దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇదీ థాయ్‌లాండ్‌ కార్తీకపున్నమి వైభవం!