Corona Effect on Temples: కరోనా ప్రభావంతో దేశంలోని ప్రధాన ఆలయాలకు తప్పిన భక్తుల కళ.. బాగా తగ్గిన విరాళాలు
Corona Effect on Temples: కరోనా మహమ్మారి రెండోసారి ప్రజల ప్రాణాలతో ఆడుకుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా శాంతిస్తూ వస్తోంది. పరిస్థితులు క్రమేపీ సాధారణ స్థితికి వస్తున్నాయి.
Corona Effect on Temples: కరోనా మహమ్మారి రెండోసారి ప్రజల ప్రాణాలతో ఆడుకుంది. ఇప్పుడిప్పుడే కొద్దిగా శాంతిస్తూ వస్తోంది. పరిస్థితులు క్రమేపీ సాధారణ స్థితికి వస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో, రోజుకు మూడు నుండి నాలుగు లక్షల పాజిటివ్ కేసులు నమోదు అయ్యేవి. ఇప్పుడు అవి 80 నుండి 90 వేల వరకు వచ్చాయి. దేశంలోని 3 అతిపెద్ద దేవాలయాలు తిరుపతి బాలాజీ, షిర్డీ సాయినాధుడు, వైష్ణో దేవి కూడా రెండవ వేవ్ ప్రభావానికి గురయ్యాయి. కరోనా యొక్క రెండవ వేవ్ ఈ మూడు దేవాలయాలకు వచ్చే భక్తులను, విరాళాలను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తిరుపతి ఆలయం: దర్శనం ఆగలేదు
2021 మార్చి నుండి మే వరకు రోజువారీ లక్షల విరాళాలు వచ్చాయి. ఈ మూడు నెలల్లో దేశం కరోనా మహమ్మారి ప్రభావంతో భయానక స్థితిని చూసింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దేశం మళ్లీ లాక్‌డౌన్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. అయితే వీటన్నిటి మధ్య, ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి బాలాజీ ఆలయంలో దర్శనం, విరాళం ఇచ్చే ప్రక్రియ కొనసాగింది. అయితే, సందర్శకుల సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. 2021 ఏప్రిల్-మే నెలల్లో ప్రతిరోజూ సగటున 5000 మంది తిరుపతి వెంకన్నను దర్శించుకున్నారు. 50 లక్షలకు పైగా విరాళాలు స్వామివారికి అందాయి. దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో తిరుపతి ఆలయం మొదటిది. కరోనా మొదటి తరంగంలో, ఈ ఆలయం 2020 మార్చి 20 నుంచి 2020 జూన్ 7 వరకు పూర్తిగా మూసివేశారు. ఈ రోజుల్లో ఆలయానికి అందిన విరాళాలు చరిత్రలో మొదటిసారిగా జీరోకు పడిపోయాయి. గతేడాది మొత్తం స్వామివారికి వచ్చిన విరాళం సుమారు 731 కోట్లు. ఇది 2019-20 సంవత్సరంతో పోలిస్తే సుమారు 500 కోట్లు తక్కువ.
2021 మే 3 – 22 మధ్య అతి తక్కువగా..
మే 2021 లో, రెండవ వేవ్ కరోనా గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు కూడా ప్రతిరోజూ రెండు నుండి నాలుగు వేల మంది తిరుపతి ఆలయానికి దర్శనం కోసం వచ్చారు. ఏప్రిల్ 2021 లో రోజువారీ విరాళాల సగటు ఒక కోటి. కానీ, మే 3 నుండి పెరుగుతున్న కరోనా కేసుల తరువాత, ఇక్కడ భక్తుల సంఖ్య పరిమితం చేశారు. మే 3 – మే 22 మధ్య, రోజువారీ విరాళాల సంఖ్య 30 లక్షలకు పడిపోయింది. మే 13 న అతి తక్కువగా రూ .10 లక్షలు విరాళాలు వచ్చాయి. ఆ రోజు 4651 మంది ఆలయాన్ని సందర్శించారు. మే 23 నుండి, విరాళం మొత్తం మళ్లీ పెరగడం ప్రారంభం అయింది. అలాగే సగటు 40 లక్షలకు మించిపోయింది.
జనవరి – మార్చి మధ్య సగటున 3 కోట్లు..
ఆలయంలో దర్శనం, విరాళం ఇచ్చే ప్రక్రియ 2020 అక్టోబర్ నుండి పాత స్థాయికి తిరిగి వచ్చింది. జనవరి, మార్చి 2021 మధ్య, రోజువారీ సందర్శకుల సంఖ్య 60 వేలు కాగా, సగటు విరాళం కూడా రోజుకు సుమారు 3 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ 2021 ప్రారంభం కూడా అలాగే ఉంది. అయితే, ఆ తరువాత కరోనా రెండవ వేవ్ ప్రారంభమైంది. ఈ కారణంగా, భక్తుల సంఖ్య, విరాళం మొత్తం తగ్గడం ప్రారంభమైంది.
షిర్డీ సాయి ఆలయం:
దేశంలో భక్తుల కోసం రెండవ అతిపెద్ద దర్బార్ షిర్డీకి చెందిన సాయి బాబా ఆలయం. షిర్డీ సాయి ఆలయానికి భక్తులు ఏడాది పొడవునా వస్తారు. విరాళాలు స్వీకరించే దేవాలయాలలో ఇది మొదటి వరుసలో ఉంటుంది. కరోనా మొదటి వేవ్ లో ఈ ఆలయం మార్చి నుండి నవంబర్ వరకు మూసివేశారు. రెండవ వేవ్ సమయంలో కూడా, ఏప్రిల్ 6 న భక్తుల కోసం ఆలయం మూసివేశారు. ఈ కాలంలో ఆలయానికి వచ్చే విరాళాలు బాగా తగ్గాయి.
ఆలయ పరిపాలన అధికారుల లెక్కల ప్రకారం, 2019 లో 1.5 కోట్లకు పైగా భక్తులు ఈ ఆలయానికి రూ .357 కోట్లు విరాళంగా ఇచ్చారు. అదే సమయంలో, ఏప్రిల్ 2020 నుండి 2021 మే 25 వరకు మొత్తం విరాళం సుమారు 62 కోట్లు. ఈ విరాళాల్లో చాలావరకు ఆన్‌లైన్‌లో కూడా వచ్చాయి. ఎందుకంటే ఈ ఆలయం ఏప్రిల్ 2020, 2021 మే మధ్య 4 నుండి 5 నెలలు మాత్రమే తెరిచి ఉంది. ఈ సమయంలో కూడా భక్తుల సంఖ్య పరిమితంగా ఉండేలా చూశారు.
వైష్ణో దేవి ఆలయం:
కరోనా రెండవ వేవ్, జమ్మూలోని వైష్ణో దేవి ఆలయంలో భక్తుల సంఖ్య చారిత్రాత్మకంగా క్షీణించింది. అయితే, ఆలయంలోని దర్శనం మాత్రం ఆపలేదు. సాధారణ రోజుల్లో రోజూ 20 నుంచి 25 వేల మంది భక్తులు వచ్చేవారు. కరోనా రెండవ వేవ్ సమయంలో, ఈ సంఖ్య రోజుకు 15 నుండి 50 మంది భక్తులకు పడిపోయింది. అయితే, ఇప్పుడు పరిస్థితి మెల్లగా మెరుగుపడుతోంది. కరోనా కేసులు తగ్గుతున్న కొద్దీ, వైష్ణో దేవి కొండలపై భక్తుల సందడి పెరుగుతోంది. ప్రస్తుతం రోజూ ఒకటి నుంచి రెండు వేల మంది భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు.
వైష్ణో దేవి మాతా ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగనిస్తారు. ఈ ఆలయంలో మొత్తం 1800 కిలోల బంగారం, 2000 కోట్ల రూపాయల విలువైన డిపాజిట్లు, 4700 కిలోల వెండి ఉన్నాయి. లాక్ డౌన్ ముందు, తరువాత ఎంత విరాళాలు వచ్చాయో గణాంకాలు ఇంకా వెల్లడి కాలేదు.
Also Read: Jatmai Temple: కొండకోనల్లో నీటి సెలయేళ్ళు నడుమ సుందరమైన జాట్మై మాత ఆలయం..
TV9 Respect All: సర్వమత సామరస్యానికి టీవీ 9 కట్టుబడి ఉంది.. కక్షపూరిత ప్రచారం మానుకోవాలని విజ్ఞప్తి