Kapaleshwar Mandir: శివుడు బ్రహ్మహత్యా దోషాన్ని స్నానమాచరించి పోగొట్టుకున్న పవిత్ర క్షేత్రం ఎక్కడో తెలుసా
Kapaleshwar Mandir: స్మశాన వాసి భోళాశంకరుడి దేశ వ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. కొన్ని స్వయంభువుగా వెలసిన ఆలయాలు అయితే మరికొన్ని నిర్మితాలు. భక్తులు కోరిన కోరికలు తీర్చే శంకరుడు నివసించిన ప్రాంతం మహారాష్ట్రలోని పంచవటి.
Updated on: Jun 10, 2021 | 5:45 PM

మహారాష్ట్రలోని నాశిక్ పట్టణంలోని పంచవటి అనే ప్రాంతంలో కొలువైన ఆలయం కపలేశ్వర్మహదేవ్ ఆలయం. ఇక్కడ పరమశివుడు నివశించినట్టు స్థానికు చెబుతారు. సాధారణంగా.. శివాలయంలో శివుని విగ్రహానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. అయితే.. ఈ ఆలయంలో మాత్రం నందీశ్వరుడు ఉండడు.

కపలేశ్వర్ మహదేవ్ ఆలయంలో నంది విగ్రహం లేకపోవడం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి ఉంది. ఇంద్రసభలో ఒక రోజు బ్రహ్మ, శివుని మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఆ సమయంలో బ్రహ్మ తన ఐదు శిరస్సులను ప్రదర్శించగా, వీటిలో నాలుగు వేదాలను పఠించగా, ఒక తల మాత్రం శివుడుని తథేకంగా చూసింది. దీంతో శివుడు ఆ తలను ఖండించాడు. ఇది బ్రాహ్మణ హత్యగా.. దోషంగా మారింది. ఈ దోషాన్ని నివృత్తి చేసుకునేందుకు పరమశివుడు ప్రపంచ పర్యటన చేపట్టారు.

శివుడు దోష పరిహారం కోసం భూలోకం మొత్తం పర్యటించినప్పటికీ దోష నివృత్తి పొందలేక పోయారు.అలా పర్యటిస్తున్న శివుడు సోమేశ్వరం అనే స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఓ గోవు... బ్రాహ్మణుడిని తన కొమ్ములతో పొడిచి బ్రహ్మహత్యకు గురి చేసిన తన దూడకు పరిహార నివృత్తిని చెప్పడాన్ని పరమేశ్వరుడు గమనించాడు.

బ్రహ్మహత్య దోషానికి గురైన ఆ గోవు పరిహారం కోసం వెళ్లే మార్గాన్ని పరమేశ్వరుడు అనుకరించారు. పంచవటి సమీపానికి చేరుకున్న వెంటెనే గోదావరి నదిలో ఆ గోవులు స్నానమాచరించి. తమ బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకున్నాయి. అదే ప్రాంతంలో పరమేశ్వరుడునూ స్నానమాచరించి తన బ్రహ్మహత్యను పోగొట్టుకున్నారని శాస్త్రాలు చెబుతున్నాయి.

అనంతరం శివుడు సమీపంలో ఉన్న కొండపై ఆసీనులయ్యారు. గోవు ఆయన ముందు మోకాలితో కూర్చొంది. అయితే తన బ్రహ్మహత్య దోష నివారణకు గురువుగా దోహదం చేసిన గోవు తన ముందు మోకాటి దండ వేసి ఆశీనులైంది. దీన్ని పరమేశ్వరుడు అంగీకరించకపోవడంతో ఈ ఆలయంలో నంది విగ్రహాన్ని ప్రతిష్టించబడలేదని పెద్దలు చెబుతున్నారు.

ఈ ఆలయ సమీపంలో ఉన్న గోదావరి నదిలో "శ్రీరాముడు" ఆయన తండ్రి దశరథ మహారాజును స్మరించి పితృపూజను గావించినట్లు ప్రతీతి ఉండటంతో... వేలకొలది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి పితృదేవతలకు పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంతో సహా, ప్రతి సోమవారం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఈ ప్రాంతానికి చేరుకోవడానికి రోడ్ , రైలు మార్గాలున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి 160 కిలోమీటర్ల దూరంలో నాశిక్ ఉంది. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి నాశిక్‌కు రైలు, బస్సు సర్వీసులు ఉన్నాయి.




