BAPS: మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదిన వేడుకలు.. హాజరైన 2 రాష్ట్రాల సీఎంలు
వడోదరలో బి ఏ పి ఎస్ స్వామినారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదిన మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ‘హిందూ గ్రంథంలోని అతిపెద్ద సమూహ పఠనం’ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి మహంత్ స్వామి మహారాజ్ గౌరవ ధృవపత్రం అందుకున్నారు. రెండు లక్షల మంది భక్తులతో జరిగిన సామూహిక ఆరతి వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

బిఏపిఎస్ స్వామినారాయణ్ సంస్థ ప్రస్తుత ఆధ్యాత్మిక అధిపతి పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదిన మహోత్సవం 2026 ఫిబ్రవరి 2న గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో అత్యంత ఘనంగా, ఆధ్యాత్మిక వైభవంతో నిర్వహించబడింది. గత ఐదు నెలలుగా కొనసాగిన జన్మదినోత్సవ కార్యక్రమాల ముంగిపు వేడుకగా వడోదరలో అద్భుతంగా ఆవిష్కృతమైంది. వందలాది కళాకారులతో నిర్వహించిన విశేష ప్రదర్శనలు, ఆధ్యాత్మిక భావాన్ని ప్రతిబింబించే వీడియోలు, సీనియర్ స్వాములు ఇచ్చిన ప్రేరణాత్మక ఉపన్యాసాలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహంత్ స్వామి మహారాజ్ యొక్క వినయం, అహంకారరహిత జీవనం, ఆధ్యాత్మిక ఉన్నతి, సేవాభావాన్ని ప్రతిబింబించే అంశాలు భక్తులను ఎంతో భావోద్వేగానికి గురిచేశాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా గుజరాత్ గౌరవ భూపేంద్రభాయి పటేల్, మధ్యప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. వారిని బిఏపిఎస్ సీనియర్ స్వాములు సాదరంగా స్వాగతించారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డు ఘనత
ఈ మహోత్సవంలో మరో విశేష ఘట్టంగా, ‘హిందూ గ్రంథంలోని అతిపెద్ద సమూహ పఠనం’ విభాగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన గిన్నిస్ వరల్డ్ రికార్డు అధికారులు పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్‌కు అధికారికంగా గౌరవ ధృవపత్రాన్ని అందజేశారు. మహంత్ స్వామి మహారాజ్ ప్రేరణతో, బి ఏ పి ఎస్‌కు చెందిన 3 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న 15,666 మంది పిల్లలు ఒకే ఏడాదిలో 315 శ్లోకాలతో కూడిన ‘సత్సంగ దీక్ష’ గ్రంథాన్ని సంపూర్ణంగా సంస్కృతంలో పఠించడం ఈ రికార్డుకు కారణమైంది. ఈ పిల్లలలో 12,723 మంది ప్రత్యక్షంగా వేదికపై హాజరై, గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు ప్రక్రియలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల కోసం రూపొందించిన ‘మొబైల్ స్కూల్’ కార్యక్రమాన్ని మహంత్ స్వామి మహారాజ్ ప్రారంభించారు. అలాగే పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘BAPS Kids’ యూట్యూబ్ ఛానల్‌ను కూడా ఆవిష్కరించారు. అంతేకాకుండా, పరమ పూజ్య మహంత్ స్వామి మహారాజ్ రచించిన ‘ఇన్‌సైట్స్ ఫ్రం ది సత్సంగ దీక్ష’ అనే గ్రంథాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. “మహంత్ స్వామి మహారాజ్ పిల్లల్లో విలువలను నాటే మహత్తర కార్యాన్ని చేస్తున్నారు. దీని ద్వారా సద్గుణాలతో కూడిన సమాజం రూపుదిద్దుకుంటోంది. సనాతన సంస్కృతి పరిరక్షణ కోసం బిఏపిఎస్ సంస్థ ఆలయాలు, స్వాముల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది” అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా పంపిన శుభాకాంక్షల లేఖను కూడా వేదికపై చదివి వినిపించారు.
కార్యక్రమం చివర్లో, ఆకాశం క్రింద సుమారు రెండు లక్షల మంది భక్తులు కలిసి నిర్వహించిన సామూహిక ఆరతి భక్తుల హృదయాలను కదిలించింది. లక్షలాది దీపాల వెలుగులో నిర్వహించిన ఈ ఆరతి దివ్య వాతావరణాన్ని సృష్టించింది. అంతకు ముందు భక్తులు మహంత్ స్వామి మహారాజ్‌కు మంత్రపుష్పాంజలి సమర్పించారు. అనంతరం ఆయన ఆశీర్వచనంలో మాట్లాడుతూ.. “ఇతరుల ఆనందంలోనే మన ఆనందం ఉంది అన్నది ప్రభు ప్రముఖ్ స్వామి మహారాజ్ సందేశం. ఈ గిన్నిస్ గౌరవం పిల్లల శ్రమ ఫలితం. ఇది గురువులందరికీ అంకితం. సాధువులు, వాలంటీర్లు, తల్లిదండ్రుల కృషి వల్లే ఇది సాధ్యమైంది” అని పేర్కొన్నారు.
ఈ వేడుకకు సుమారు 800 మంది బిఏపిఎస్ స్వాములు, రెండు లక్షల మంది భక్తులు హాజరయ్యారు. మూడు నెలల పాటు సాగిన ఏర్పాట్లలో 14,000 మంది వాలంటీర్లు, 34 విభాగాల్లో సేవలందించారు. వడోదర మున్సిపల్ కార్పొరేషన్ భద్రత, సేవల విషయంలో పూర్తి సహకారం అందించింది. ఈ వేడుకను live.baps.org, ఆస్తా భజన్ ఛానల్ ద్వారా భారత్‌తో పాటు విదేశాల్లోని భక్తులు ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. వినయం, విశ్వాసం, నిస్వార్థ సేవా భావాన్ని స్మరింపజేసే ఈ మహోత్సవం అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచింది.

