West Bengal Politics: వెస్ట్ బెంగాల్ లో గవర్నర్ తో భేటీకి బీజేపీ ఎమ్మెల్యేల డుమ్మా..తృణమూల్ వైపు చూస్తున్నారని ఊహాగానాలు!
West Bengal Politics: పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి జంప్ అయిన నాయకులు ఇప్పుడు తిరిగి టీఎంసీ తీర్థం తీసుకోవడానికి క్యూ కడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
West Bengal Politics: పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి జంప్ అయిన నాయకులు ఇప్పుడు తిరిగి టీఎంసీ తీర్థం తీసుకోవడానికి క్యూ కడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇలా టీఎంసీ నుంచి బీజేపీ లో చేరి ఆ పార్టీలో జాతీయ కార్యవర్గంలో ఉన్న ముకుల్ రాయ్ మొన్న టీఎంసీ గూటికి చేరారు. ఈ నేపధ్యంలో బీజేపీ నుంచి పలువురు తృణమూల్ లోకి తిరిగి వచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. అదేవిధంగా తమ పార్టీ అధినాయకత్వంతో బీజేపీ ఎమ్మెల్యేలు 30 మంది టచ్ లో ఉన్నారని, వారు ఎప్పుడైనా టీఎంసీలోకి వచ్చే చాన్స్ ఉందని తృణమూల్ వర్గాలు చెబుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలో సోమవారం సాయంత్రం జరిగిన ఒక సంఘటన వారి మాటలకు బలం చేకూర్చేదిగా కనిపించింది. బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు శుభేందు అధికారి గవర్నర్ జగదీప్ ధంఖర్‌తో పాటు పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందంతో రాజ్ భవన్‌లో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సమయంలో సుమారు 24 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి దూరంగా ఉన్నారు. దీంతో వెస్ట్ బెంగాల్ లో రాజకీయాల్లో తీవ్ర చర్చ ప్రారంభం అయింది. తృణమూల్ బెంగాల్ లో బీజేపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు జరగవచ్చని.. దీనికి ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసే కార్యక్రమానికి డుమ్మా కొట్టడమే నిదర్శనం అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఎందుకిలా జరుగుతోంది..
బీజేపీ నుంచి వలసలు జరగవచ్చనే వాదనలు ఎన్నికల ఫలితాలు వచ్చి.. మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే మొదలయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ తృణమూల్ వర్గాలు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు శుభేందు అధికారి గవర్నర్ ను కలిసిన సందర్భంలో ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో ఈ ప్రచారం నిజమనే ఊహాగానాలు మొదలయ్యాయి. శుభేందు అధికారి పట్ల బీజేపీ ఎమ్మెల్యేల లో ఉన్న వ్యతిరేకతే ఇప్పుడు ఈ పరిస్థితికి దారి తీసిందని అంటున్నారు. శుభేందు నాయకత్వంలో పనిచేసేందుకు ఈ ఎమ్మెల్యేలు ఇష్టపడటం లేదు. ఇక బీజేపీకి అధికారం దక్కకపోవాటమూ ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఆలోచనలకూ కారణంగా చెబుతున్నారు. పార్టీ ఎంపీ శంతనుడు ఠాకూర్, ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఏర్పాటు చేసిన సమావేశంలో హాజరు కాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బెంగాల్‌లో సిఎఎ చట్టాన్ని అమలు చేయాలన్న బీజేపీ వైఖరిపై ప్రభావవంతమైన మాటువా సమాజంలోని ప్రముఖ సభ్యుడు ఎంపి శాంతను ఠాకూర్ అసంతృప్తితో ఉన్నారు. వీరితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు బిస్వాజిత్ దాస్ (బాగ్డా), అశోక్ కీర్తానియా (బొంగావ్ నార్త్), సుబ్రతా ఠాకూర్ (గే ఘాటా) కూడా ఇదే విషయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపధ్యంలో పార్టీ నుంచి టీఎంసి లోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం విషయంలో తీవ్రమైన ప్రచారం ప్రస్తుతం బెంగాల్ లో నడుస్తోంది.
బెంగాల్‌లోని 294 సీట్లలో 213 టీఎంసీ గెలిచింది. 77 స్థానాలను బీజేపీ దక్కించుకుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు 50 మందికి పైగా తృణమూల్ నాయకులు బిజెపిలో చేరారు. ఇందులో 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఈసారి బీజేపీ మాత్రమే గెలుస్తుందని వారికి పూర్తి ఆశ ఉండేది. ఈ నాయకులు టిఎంసి నుండి దూరం కావడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం, వారికి టీఎంసీ టికెట్ దక్కకపోవడం లేదా స్థానాన్ని మార్చడం. రెండవది, పార్టీ వెళ్తున్న తీరు పట్ల వారు సంతృప్తిగా లేకపోవడం. మూడవది, బిజెపి విజయంపై వారికి నమ్మకం ఉండడం అదేవిధంగా బీజేపీ నుంచి టికెట్ ఆశించడం. కానీ ఫలితాలతో ఫిరాయింపుదారులకు పెద్ద దెబ్బ తగిలింది. అందుకే ఇప్పుడు ఈ నాయకులు సొంత గూటికి రావాలని కోరుకుంటున్నారు.
మొత్తమ్మీద రాబోయే రోజుల్లో వెస్ట్ బెంగాల్ లో రాజకీయంగా సంచలనం చోటుచేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.