మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ భవితవ్యం రేపు తేలేనా ? సీఎందే నిర్ణయం, శరద్ పవార్
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన (అనిల్) భవితవ్యం రేపు తేలనుంది.
మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన (అనిల్) భవితవ్యం రేపు తేలనుంది. సీఎం ఉద్ధవ్ థాక్రే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. అయితే పరమ్ బీర్ సింగ్ ఈ సమయంలో ఆరోపణలు చేయడాన్ని పవార్ ప్రశ్నించారు. అసలు ఇప్పుడు ఎందుకు వీటిని చేస్తున్నారని అన్నారు. తను బదిలీ అయిన తరువాతే సింగ్ ఈ లేఖను బయట పెట్టారన్నారు. నెలకు 100 కోట్లను వసూలు చేయాలని మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేని అనిల్ ఆదేశించినట్టు చెబుతున్నారని, అయితే వాస్తవంగా డబ్బు లావాదేవీలుజరిగాయా అన్న దానిపై సమాచారం లేదని పవార్ చెప్పారు. హోం మంత్రికి గానీ, ఆయన స్టాఫ్ కి గానీ మనీ బదిలీ అయిందా అన్న సమాచారం లేదన్నారు. ఏమైనా ఈ ఆరోపణలపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని తను ఉధ్దవ్ థాక్రేని కోరినట్టు ఆయన చెప్పారు. ముంబై మాజీ పోలీస్ చీఫ్ జూలియో రిబీరో ఆధ్వర్యాన ఇన్వెస్టిగేట్ చేయించాలని, ఆయన దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోజాలరని, ఆయన దర్యాప్తును ప్రభావితం చేయజాలరని పవార్ వ్యాఖ్యానించారు.
అటు- అనిల్ దేశ్ ముఖ్ వ్యవహారం పాలక కూటమిలో విభేదాలు సృష్టించింది. అనిల్ ను రాజీనామా చేయాలని కోరే విషయమై సీఎం ఉద్దవ్ ఆలోచిస్తున్నారని ఈ కూటమిలోని సీనియర్ నేత ఒకరు చెప్పగా.. అనిల్ ని మార్చే ప్రసక్తే లేదని ఎన్సీపీ నేత, మంత్రి జయంత్ పాటిల్ వెల్లడించారు. (అనిల్ దేశ్ ముఖ్ కూడా ఎన్సీపీకి చెందినవారు).అసలు సచిన్ వాజేకి పోస్టింగ్ ఇచ్చింది మాజీ సీపీ సింగ్ అని శరద్ పవార్ పేర్కొన్నారు. ఏమైనా… సోమవారం ఢిల్లీలో శివసేన, ఎన్సీపీ నేతలు సమావేశమై అనిల్ దేశ్ ముఖ్ వ్యవహారంపై చర్చించి ఓ నిర్ణయాన్ని తీసుకుని ఉధ్ధవ్ కి నివేదించవచ్చు.
మరిన్ని ఇక్కడ చదవండి: go maha gharjana : ఏప్రిల్ 1న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో “గో మహా గర్జన” : యుగతులసి ఫౌండేషన్ చైర్మన్