Mayor: కొలిక్కి వచ్చిన కార్పొరేషన్ మేయర్ల ఎంపిక.. వరంగల్‌లో గుండు సుధారాణి, ఖమ్మంలో పునుకొల్లు నీరజ..?
తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాటీల్లో గులాబీ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇప్పుడు ఇక్కడ మేయర్, చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల7వ తేదీ శుక్రవారం ఈ ఎన్నిక జరగనుంది.
Municipal Corporation Mayor: తెలంగాణలో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాటీల్లో గులాబీ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇప్పుడు ఇక్కడ మేయర్, చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల7వ తేదీ శుక్రవారం ఈ ఎన్నిక జరగనుంది. కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్.. మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్లను కొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ఎన్నుకోనున్నారు. అయితే, రెండు కార్పొరేషన్లకు మహిళలే మేయర్లు. మరో మూడు మున్సిపాల్టీల్లోనూ చైర్మన్ పదవులు మహిళలకే దక్కబోతున్నాయి. పేర్లు సీల్డ్ కవర్‌లో సీక్రెట్‌గా ఉన్నాయి. రేపే వారి ఎన్నిక జరగబోతోంది. ఆ ప్రక్రియ సజావుగా సాగేలా మంత్రులు, కీలక నేతలకు బాధ్యతలను అప్పగించారు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.
ఇద్దరు మేయర్లు, ఐదుగురు చైర్మన్ల పేర్లను ఇప్పటికే ఫైనల్ చేశారు. వారి పేర్లతో సీల్డ్ కవర్లను సిద్ధం చేసి ఎన్నికల పరిశీలకులకు అప్పగించారు. వరంగల్ మేయర్ ఎవరనే దానిపై ముందు నుంచి క్లారిటీతో ఉంది తెలంగాణ రాష్ట్ర సమితి. రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి పేరును సీఎం కేసీఆర్ ఎప్పుడో ఫైనల్ చేసినట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఆమె మేయర్ పదవిని చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అటు, ఖమ్మం మేయర్‌పైనా క్లారిటీ వచ్చింది. 26వ డివిజన్‌లో గెలిచిన పునుకొల్లు నీరజ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు పోటీ పడినా… నీరజ వైపు రాష్ట్ర అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. కమ్మ సామాజికవర్గానికి చెందిన నీరజకు మంత్రి పువ్వాడ ఆజయ్ అండదండలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇక, ఐదు మున్సిపాలిటీల్లోనూ చైర్మన్లు ఖరారైనట్లు తెలుస్తోంది. సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, అచ్చంపేట చైర్మన్‌గా నరసింహ గౌడ్ ఖరారయ్యారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. జడ్చర్ల లక్ష్మీ రవీందర్, కోనేటి పుష్పలత, చైతన్యల్లో ఒకరికి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. కొత్తూరు మున్సిపల్ చైర్మన్ రేసులో లావణ్య దేవేందర్, కరుణా సుదర్శన్ గౌడ్ ఉన్నారు. నకిరేకల్‌లో రాచకొండ శ్రీను పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ ఏడు చోట్లలో ఐదు పదవులు మహిళలకే దక్కబోతున్నాయి.
మరోవైపు మేయర్లు, చైర్మన్ల ఎన్నిక బాధ్యతలను కీలక నేతలకు, మంత్రులకు అప్పగించారు సీఎం కేసీఆర్. గురువారం పార్టీ పరిశీలకు అయా మున్సిపాలిటీల్లో పార్టీ నేతలతో భేటీ అవుతారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారు. వారిని అభిప్రాయాలను సేకరించిన రాష్ట్ర పార్టీతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.