UP Panchayat Results: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో అనుహ్య ఫలితాలు.. వారణాసి, అయోధ్యలో బీజేపీకి ఎదురుదెబ్బ
యూపీలో యోగి ఆదిత్యానాథ్ బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ మంచి పట్టున్న వారణాసి, అయోధ్యలో ఆ పార్టీ ప్రభవాన్ని కోల్పోయింది.
BJP Faces Setback in UP: ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతాపార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. యూపీలో యోగి ఆదిత్యానాథ్ బీజేపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ మంచి పట్టున్న వారణాసి, అయోధ్యలో ఆ పార్టీ ప్రభవాన్ని కోల్పోయింది. రాజకీయంగా చాలా కీలకమైన రెండు ప్రదేశాలు. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోదీ లోక్ సభకు రెండుసార్లు ఎంపికయ్యారు. అయోధ్య గురించి చెప్పాల్సిన పనేలేదు. అయోధ్య పేరు వల్లే భారతీయ జనతా పార్టీ రెండు లోక్‌సభ స్థానాల నుంచి ఈ రోజు దేశంలో తిరుగులేని శక్తి పరిపాలించే స్థాయికి ఎదిగింది.
తాజా యూపీ పంచాయతీ ఎన్నికల్లో అనుహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఈ రెండు చోట్ల పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి ఫలితాలు ఆ పార్టీని మరింత ఇబ్బందులకు గురిచేశాయి. వారణాసిలో 40 జిల్లా పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వీటిల్లో ప్రతిపక్ష సమాజ్ వాది పార్టీ 15 స్థానాలను గెల్చుకుంటే బీజేపీకి దక్కినవి కేవలం 8 స్థానాలు మాత్రమే. మిగతా వాటిలో బహుజన్ సమాజ్ పార్టీకి 5, అప్నాదల్ కు మూడు, సుహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీకీ ఒకటి దక్కాయి. మిగిలిన మూడు సీట్లను స్వతంత్ర అభ్యర్థులు దక్కించుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అదే తీరు ఫలితాలు వెలువడ్డాయి. గత ఏడేళ్లుగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇక్కడ కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే, ఫలితాలు మాత్రం నిరాశజనకంగా ఉన్నాయి.
అయోధ్యలోని 40 జిల్లా పంచాయతీ స్థానాల్లో బీజేపీ కేవలం ఆరు స్థానాలను గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ 24 సీట్లు, బహుజన్ సమాజ్ పార్టీ ఐదు స్థానాలు గెలుచుకున్నాయి. ఇక, మధురలో బహుజన్ సమాజ్ పార్టీ 12 సీట్లు గెలుచుకుంది. రాష్ట్రీయ లోక్‌దళ్ ఎనిమిది సీట్లు గెలుచుకోక.. బీజేపీ తొమ్మిది సీట్లతో సరిపెట్టుకుంది. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ ఒక సీటు గెలుచుకుంది.
వారణాసి , అయోధ్య పంచాయతీ ఎన్నికల్లో కూడా కమలం జండాను ఎగరేసేందుకు ముఖ్యమంత్రి యోగి అదిథ్యనాథ్ చాలా చెమటోడ్చారు. అయినా ఫలితాలు అశించినంతగా రాకపోవడంతో పార్టీకి నిరాశే ఎదురైంది. ఈ రెండు నగరాలమీదే ఆశల భవిష్యత్తు ఆశల సౌధాలు కట్టుకున్నారు. అలాంటపుడు పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి పరాభవం ఎదురుకావడం ఆందోళనకు గురిచేసింది. ఇదిలావుంటే, అఖిలేష్ నాయకత్వంలోని సమాజ్ వాది పార్టీ మెల్ల మెల్లగా దూసుకువస్తోంది.
వచ్చే ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగబోతున్నాయి. అందుకే ఉత్తరప్రదేశ్ పంచాయతీ ఎన్నికలను అధికార బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2018 నుంచి ఇప్పటివరకు జరిగిన 23 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సొంతంగా గెలిచింది మూడు రాష్ట్రాలే. ఇవన్నీ కూడా ఈశాన్యభారతంలోని చిన్న రాష్ట్రాలే. వచ్చే ఫిబ్రవరి ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని సొంతంగా గెల్చుకోవడం ప్రధాని మోదీకి, ముఖ్యమంత్రి యోగికి చాలా అవసరం.
Read Also… ‘మీకన్నా ఐఐటీ సంస్థ నయం,’ ఆక్సిజన్ సరఫరాపై చేతులెత్తేసిన కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు నిప్పులు