Prof Kodandaram: రాజ్యాంగం మార్చి ఏ రాజ్యాంగం తెస్తారో చెప్పాలి.. ప్రశ్నల వర్షం కురిపించిన కోదండరాం..
తాజాగా సీఎం కేసీఆర్‌పై టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. మరోసారి రాజ్యాంగం మారుస్తా అనే చర్చ తెస్తే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని..

రాజ్యంగం మార్చాలి అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేసిన వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తాజాగా సీఎం కేసీఆర్‌పై టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం (Prof Kodandaram) మండిపడ్డారు. మరోసారి రాజ్యాంగం మారుస్తా అనే చర్చ తెస్తే తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోరాటాలతో తెచ్చుకున్న రాజ్యాంగం మార్చి ఏ రాజ్యాంగం తెస్తామని అనుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉదృతం చేస్తామన్నారు. ముందు 317జీవో ను సవరించాలని డిమాండ్ చేశారు. ఫ్యూడల్ ఆలోచనలు ఉన్న సీఎం కేసీఆర్‌కు ఈ రాజ్యాంగం ఏం అర్థం అవుతుందంటూ ఎద్దేవ చేశారు. నిరంకుశ పాలనకు చట్టబద్ధత కల్పించాలా రాజ్యాంగంలో మార్చాలని చేస్తున్నారని.. ఇప్పటికే తెలంగాణలో అడ్డగోలుగా జిల్లాలు ఏర్పాటుచేసిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ తప్పుని కప్పి పుచ్చు కోవడం కోసం స్థానికత అంటున్నారని నిప్పులు చెరిగారు. స్థానికతకు గుర్తింపు లేకుండా చేసేందుకే 317 జీవో 371, 124రెండు జీవో లకు తూట్లు పొడిచారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ కోదండరాం.
ప్రభుత్వం 317 జీవో ద్వారా ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి సం ప్రదింపుల్లేకుండా జీవోను అమలు చేయడం ఘోరమన్నారు. సొంత జిల్లాలో ఉద్యోగం చేసేందుకు అవకాశం లేకుండా జీవో ఉందని కోదండరాం విమర్శించారు. జిల్లాల వారీగా పెద్ద మొత్తంలో ఖాళీలున్నాయని, ఉద్యోగులను సొంత జిల్లాలకు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి: UP Assembly Election 2022: వర్చువల్ ర్యాలీలతో దూసుకుపోతున్న ప్రధాని మోడీ.. వెనకబడిన ప్రధాన పార్టీలు..
