Telangana Politics: జనవరి 18 తర్వాత న్యూ టర్న్ తీసుకోబోతున్న తెలంగాణ రాజకీయాలు.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకిక పదును

తెలంగాణ రాజకీయం జనవరి 18 తర్వాత ఒక్కసారిగా వేడెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంగా సుడి తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో 18వ తేదీ కీలకంగా కనిపిస్తోంది.

Telangana Politics: జనవరి 18 తర్వాత న్యూ టర్న్ తీసుకోబోతున్న తెలంగాణ రాజకీయాలు.. బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకిక పదును
Khammam Politics
Follow us

|

Updated on: Jan 17, 2023 | 12:05 PM

గత కొన్ని రోజులుగా స్తబ్దుగా కనిపిస్తున్న తెలంగాణ రాజకీయం జనవరి 18 తర్వాత ఒక్కసారిగా వేడెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కేంద్రంగా సుడి తిరుగుతున్న తెలంగాణ రాజకీయాల్లో 18వ తేదీ కీలకంగా కనిపిస్తోంది. జాతీయ పార్టీగా మారిన భారత రాష్ట్ర సమితి తమ తొలి భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా కేంద్రాన్ని వేదికగా చేసుకుంది. అయితే ఖమ్మం జిల్లాను ఎంపిక చేసుకునే విషయంలో గులాబీ బాస్ కెసిఆర్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లుగా భావించాలి. 2014లో వైయస్సార్సీపి తరఫున ఎంపీగా గెలిచి, ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కీలక నేతగా మారిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. గత కొంతకాలంగా తనకు గులాబీ పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని, ఉద్దేశపూర్వకంగా పార్టీ అధిష్టానం తనను పక్కన పెడుతుందని..నిర్లక్ష్యం చేస్తుందని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీని వీడే దిశగా మంతనాలు ప్రారంభించిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించింది బీఅర్ఎస్ పార్టీ అధిష్టానం. బీఆర్ఎస్ పార్టీ దృక్పథంలో ఆలోచిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురు నాయకులు ఎమ్మెల్యే టికెట్లను ఆశించే పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఏర్పడినప్పటి నుంచి పని చేస్తున్న వారు కొందరైతే.. 2014 పరిణామాల తర్వాత పార్టీలో చేరిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నేతలు మరికొందరు. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఇద్దరికి మించి అభ్యర్థులు కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా 2014 తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు ఆ పార్టీలో గ్రూపులు పెరిగిపోవడానికి కారణమైంది. అయితే ఈ గ్రూపు నాయకులెవరు పార్టీ అధిష్టానానికి తెలియకుండా పూచిక పుల్ల కూడా కదిపే పరిస్థితి లేదు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆనాటి టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్, టీడీపీల హవానే కొనసాగింది. కానీ ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ తర్వాత కెసిఆర్ వ్యూహాత్మక విధానాల వల్ల కాంగ్రెస్, టిడిపి పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరారు. దాంతో టిఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లాలో బలపడింది.

పొంగులేటి పోతే తుమ్మలే దిక్కు

2014లో వైయస్సార్సీపి పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆయన వెంట వైయస్సార్సీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నాయి. ఒక దశలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తిరుగులేని నేతగా కనిపించారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి. పువ్వాడ అజయ్ కుమార్ మంత్రి కావడం, ఆ తర్వాత తనపై 2014లో పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీలో చేరి 2019లో పొంగులేటికి టికెట్ రాకుండా చేయడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. 2014లో టిడిపి తరఫున పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కెసిఆర్ తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఇంటికెళ్ళి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. అసాధారణ రీతిలో ఏకంగా మంత్రిని చేశారు. ఆ తర్వాత మంత్రి పదవిని కాపాడటానికి తొలుత ఎమ్మెల్సీని చేశారు. 2016లో పాలేరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో తుమ్మలను బరిలోకి దింపి ఆ సీటును కాంగ్రెస్ ఖాతాలోంచి టిఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి మళ్ళించారు కేసీఆర్. అయితే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నుంచే పోటీచేసి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయనపై విజయం సాధించిన కందాడి ఉపేందర్ రెడ్డి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావుకు ఆ నియోజకవర్గంలో ప్రాధాన్యత క్రమంగా తగ్గింది. క్రమంగా తుమ్మల నాగేశ్వరరావు రాజకీయంగా చురుకుగా వుండడం తగ్గించారు. కేసీఆర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు పట్ల పెద్దగా ఆసక్తి లేదు అన్నట్లుగా చాలా కాలం వ్యవహరించారు.

కేసీఆర్ తిరుగులేని వ్యూహం

కానీ తాజాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ గాలం వేస్తున్న నేపథ్యంలో ఆయన, ఆయన అనుచరగణం కాషాయతీర్థం పుచ్చుకుంటున్నారన్న సంకేతాలు వెలబడ్డాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ జిల్లాలో కీలకంగా ఉన్న గులాబీ నేతలను అప్రమత్తం చేశారు. చాలాకాలంగా టచ్‌లో లేని తుమ్మల నాగేశ్వరరావును మళ్ళీ అక్కున చేర్చుకున్నారు. ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలను పంపించారు. ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న బహిరంగ సభకు ఖమ్మం జిల్లాను వేదిక చేసుకోవడం వెనుక కేసీఆర్ వ్యూహం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్న కేసీఆర్ ఇటీవలనే ఏపీ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్‌ను నియమించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహించే సందర్భంలో ఇటు తెలంగాణ పొరుగు జిల్లాలతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొరుగు జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా దేశానికి ఒక సందేశం ఇవ్వాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏపీలోని కృష్ణ, ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలు ఆనుకొని ఉంటాయి.

ప్రతిష్టాత్మకంగా ఖమ్మం సభ

ఈ మూడు జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా ఏపీలో తమ పార్టీకి క్యాడర్ ఉంది అని చాటుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అదే సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు నేతలు పార్టీని వీడనుండడంతో మిగిలిన నేతలతోనే ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని చాటాలని భావిస్తున్నారు. అందుకే ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని తరలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకునేలా జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లాలో కీలక నేత తుమ్మల నాగేశ్వరరావులను అప్రమత్తం చేశారు. వీరిద్దరి మధ్య సమన్వయంతో పాటు.. పొంగులేటి శ్రీనివాస్ వెంట తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కువ స్థాయిలో వెళ్లకుండా నివారించే బాధ్యతలను ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావుకు అప్పగించారు కేసీఆర్. ఈ నేపథ్యంలో జరుగుతున్న జనవరి 18 ఖమ్మం బహిరంగ సభ కేసీఆర్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం కానుంది. సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఖమ్మం వెళ్ళిన హరీష్ రావు.. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నామని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు బహిరంగ సభ నిర్వహిస్తామని, ఏపీ నుంచి కూడా భారీ ఎత్తున జన సమీకరణకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులను ఈ సభకు ఆహ్వానించారు కేసీఆర్. బహిరంగ సభకు రానున్న జాతీయ నేతలు ముందుగా హైదరాబాదులోని ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అవుతారు. ఆ తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని సందర్శించుకుని అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభ జరిగే ప్రదేశానికి చేరుకుంటారని హరీష్ రావు వివరించారు.

ఖమ్మంపై కమలం నజర్

ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని వెనక్కి నెట్టి కెసిఆర్‌తో తలపడినకే సత్తా తమకే ఉందని చాటుకుంటున్న భారతీయ జనతా పార్టీ నేతలు కూడా తాజా పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను లక్ష్యంగా చేసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో పేరు, పట్టు, ప్రజల్లో అభిమానం ఉందని భావిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలోకి చేర్చుకుంటే ఆయన వెంట పలు నియోజకవర్గం పలువురు పార్టీలో చేరతారని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం చేయాలని, అందుకోసం వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను ఆకర్షించాలని తలపెట్టిన బిజెపి.. ఆ బాధ్యతలను మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు అప్పగించింది. చాలా కాలంగా ఈటల రాజేందర్ ఇదే పని మీద ఉన్నారు. అదే క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను ఊపేసిన మునుగోడు ఉప ఎన్నిక రావడం, జిల్లాలో బాగా పట్టున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కమలం తీర్థం పుచ్చుకోవడం జరిగిపోయాయి. ఆ తర్వాత కమలనాధుల దృష్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా మీద పడింది. కేసీఆర్ పార్టీలోనే కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలాకాలంగా కినుక వహించినట్లు గుర్తించింది బీజేపీ. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పార్టీ టికెట్ నిరాకరించడంతో ఆయన అప్పట్లోనే పార్టీ మారతారని ప్రచారం జరిగింది.

అవకాశాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ

కానీ గత నాలుగు సంవత్సరాలుగా తనకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ పొంగులేటి గులాబీ పార్టీలోనే కొనసాగారు. తాజాగా కెసిఆర్ తనను పూర్తిగా ఇగ్నోర్ చేస్తూ ఉండడం ఒకవైపు, ఇంకోవైపు తమ పార్టీలో చేరాల్సిందిగా బిజెపి నేతలు క్రమం తప్పకుండా వెంటపడుతూ ఉండడంతో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం శ్రీనివాస్ రెడ్డికి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆయన బిజెపి వైపు మొగ్గు చూపుతున్నట్లు గత వారం రోజుల పరిణామాలు చాటిచెబుతున్నాయి. ఇందులో భాగంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనవరి 18వ తేదీనే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా తో భేటీ అయిన తర్వాత ఆయన బిజెపి తీర్థం పుచ్చుకోవడం ఇక లాంఛనమే అంటున్నారు. ఆయన వెంట పలువురు మాజీ ఎమ్మెల్యేలు బిజెపిలో చేరతారని చెబుతున్నారు. ఇదే జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బిజెపికి అభ్యర్థుల కొరత తీరినట్లేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 18వ తేదీన అమిత్ షా తో భేటీ అనంతరం 19వ తేదీన హైదరాబాద్ రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కల్పించాలని, తద్వారా ఆయనకు పార్టీలో తగిన గుర్తింపు ఇవ్వబోతున్న సంకేతాలు ఇవ్వాలని కమలనాథులు భావించారు. కానీ జనవరి 19వ తేదీన జరగాల్సిన ప్రధాని హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జనవరి 18వ తేదీన అమిత్ షాను కలిసిన తర్వాత అక్కడే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిజెపిలో చేరతారని తాజాగా తెలుస్తోంది.

ఏపీ తర్వాత ‘ఆ’ 3 రాష్ట్రాలపై దృష్టి

ఒకవైపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టు నిలుపుకునేందుకు గులాబీ బాస్ జనవరి 18వ తేదీని జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం, అదే రోజు న్యూఢిల్లీలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరుగణంతో భారతీయ జనతా పార్టీలో చేరుతుండడంతో ఆ తర్వాత జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక తర్వాత తెలంగాణలో ఆపరేషన్ ఆకర్షను వేగవంతం చేసే వ్యూహాలను బిజెపి రచిస్తోంది. మరోవైపు ఖమ్మం బహిరంగ సభకు పలువురు జాతీయస్థాయి నాయకులను ఆహ్వానించడం ద్వారా వివిధ రాష్ట్రాలలో పార్టీ శాఖలను ఏర్పాటు చేసే చర్యలను వేగవంతం చేయబోతున్నారు కేసీఆర్. ఏపీ తర్వాత శాఖ ఒడిశా రాష్ట్రంలో ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగో ఇటీవల హైదరాబాద్ వచ్చి కేసీఆర్‌తో భేటీ అయి వెళ్లారు. ఆయన్నే ఒడిశా శాఖ అధ్యక్షునిగా కెసిఆర్ చేయబోతున్నట్లు ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేసే దిశగా కెసిఆర్ చర్యలు తీసుకుంటున్నట్లు గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మొత్తమ్మీద జనవరి 18 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఓ కీలక మలుపు రానున్నదన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..