Revanth Reddy Oath: గాంధీభవన్‌లో సంబురాలు.. TPCC కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు రేవంత్‌రెడ్డి. గాంధీభవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు రేవంత్‌రెడ్డి. గాంధీభవన్‌లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రేవంత్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు పండితులు రేవంత్‌ను ఆశీర్వదించారు. పదవీ బాధ్యతల కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క, సీనియర్ నేతలు నాగం జనార్దన్‌రెడ్డి, పొన్నాల లక్ష్యయ్య సహా కొత్త కార్యవర్గ సభ్యులు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనుకున్న ముహూర్తానికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నారు రేవంత్. భట్టి, శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, గీతారెడ్డి, పొన్నాల, నాగం వంటి నేతలు రేవంత్‌కు శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్‌కు పునర్వైభవం తేవాలని ఆకాక్షించారు. రేవంత్‌రెడ్డి బాధ్యతల స్వీకారోత్సవంతో కాంగ్రెస్ శ్రేణులు జోష్‌లో ఉన్నాయి. అధిష్టానం తరపున పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ కూడా వచ్చారు.
అంతకు ముందు.. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకుని గాంధీభవన్‌కు బయలుదేరారు రేవంత్‌రెడ్డి. ఆలయం నుంచి భారీ ర్యాలీగా గాంధీభవన్‌కు చేరుకున్నారు. ఇందులో కాంగ్రెస్ నేతలు పెద్దయెత్తున పాల్గొన్నారు. సరిగ్గా సమయానికి గాంధీ భవన్ చేరుకున్న రేవంత్… కొత్త టి.పీసీసీ టీమ్ కలిసి బాధ్యతల స్వీకారించారు. రేవంత్‌తోపాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, కమిటీల చైర్మన్లు కూడా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత గాంధీభవన్ ఆవరణలో జరిగిన సభలో రేవంత్‌తోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రసంగించారు.
ఇదిలావుంటే.. కాంగ్రెస్ అంటేనే కయ్యాల కాట్నం అన్న సెంటిమెంట్‌ను ముందే ఊహించిన రేవంత్.. టీపీసీసీ చీఫ్‌గా నియమితుడైన మరుక్షణం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తొలుత మాజీ మంత్రి జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ తర్వాత వరుసగా పార్టీ నేతలను వారి ఇళ్లకు వెళ్లి కలుస్తూ వచ్చారు. తనను వ్యతిరేకించిన వారి ఇళ్లకు కూడా వెళ్లి సహకారం కోరారు. వారి నుంచి అభినందనలూ అందుకున్నారు. తన పేరు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ఎంపీ వీహెచ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించి.. ఆయన నుంచి అభినందనలు అందుకున్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని అధిష్ఠానానికి వివరించారు.
దీంతో సోనియాగాంధీ స్వయంగా వీహెచ్‌కు ఫోన్ చేసి పరామర్శించారు. ఇలా తొలి అడుగే అసంతృప్తులను సంతృప్తిపరిచే దిశగా వేశారు. ఇక రేవంత్ నియామకాన్ని బాహాటంగానే తప్పుబట్టిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని, రేవంత్‌ను కలిసేందుకు ఇష్టపడని నేతలను అధిస్ఠానమే రంగంలోకి దిగి దారిలోకి తెచ్చింది. తద్వారా రేవంత్‌కు అధిష్ఠానం అండగా నిలిచింది.