రాను, రాలేను, ఇదంతా నావల్లకాదంటూ తెగేసి చెప్పేశారు, అయినా రజనీ అభిమానుల్లో ఆశ, రేపటి వేడుక కోసం ఎదురుచూపులు
Rajinikanth : లేదు.. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు అంటూ చివరికి తెగేసి చెప్పేశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అయినా అతని అభిమానుల్లో ఇంకా ఏదో ఆశ, ప్లీజ్ రాజకీయాల్లోకి ..
Rajinikanth : లేదు.. లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు అంటూ చివరికి తెగేసి చెప్పేశారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అయినా అతని అభిమానుల్లో ఇంకా ఏదో ఆశ, ప్లీజ్ రాజకీయాల్లోకి వచ్చి తమను ఉద్ధరించమని ఒకటే విన్నపాలు, ర్యాలీలు. ఇదీ.. తమిళనాట రజనీకాంత్ ఫ్యాన్స్ తీరు. కట్ చేస్తే, రేపు ఫిబ్రవరి 26. మళ్లీ మరో ఆశ, తమ అభిమాన నటుడు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందన్న ఘాడమైన ఆశ, కోరిక. శుక్రవారం రజని తన 40 వ వివాహ వార్షికోత్సవాన్ని తన భార్య లతతో జరుపుకోనున్నారు. ఆ పర్వదినాన తన రాజకీయాల గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తమిళనాట వార్తలు వస్తున్నాయి.
తన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొంటూ రాజకీయాల నుండి వైదొలగాలని రజనీ తన నిర్ణయాన్ని డిసెంబర్లోనే వెల్లడించారు. ఏదేమైనా, రాజకీయ రంగానికి వెలుపల నుండి తన సామాజిక సేవను కొనసాగిస్తానని కూడా రజని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతకీ రేపటి వేడుకలో తమిళతంబీల సూపర్ స్టార్ ఏం మాట్లాడతారు, అసలు రాజకీయ ప్రవేశం అనే అంశంపై స్పందిస్తారా లేదా అన్నది డౌటే. అయితే, ఆయన ఫ్యాన్స్ మాత్రం కచ్చితంగా ప్రకటన చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు చూద్దాం, ఏంజరుగుతుందో.
ఇలా ఉంటే, రాజకీయాల్లోకి రాలేనని తేల్చి చెప్పినా సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఆయన అభిమానులు చెన్నై సహా తమిళనాట ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అభిమానుల ఆందోళనలపై స్పందిస్తూ తలైవి తన ట్విట్టర్ వేదికగా అభిమానులకు అప్పట్లో భావోద్వేగ లేఖ కూడా రాశారు. “ఆరోగ్య పరిస్థితుల వలన నేను రాజకీయాల్లోకి రానని చెప్పాను. కానీ ఇప్పుడు నా నిర్ణయం మార్చుకోమని నాపై ఒత్తిడి చేయవద్దు అని రజినీ కోరారు. రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలను నేను వివరంగా చెప్పాను. ఇప్పుడు ఇలాంటి ఆందోళనలు చేసి నన్ను బాధపెట్టొద్దు. నా నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావొద్దు. నేనూ మీ ఆందోళనతో చాలా బాధపడ్డాను. ఇప్పటికైన నన్ను అర్థం చేసుకోని ఆందోళనలు చేయకండి” అని లేఖలో పేర్కోన్నారు.
డిసెంబర్ మొదటి వారంలో రజినీ మార్పు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ జరగదు అంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు రజినీ ప్రకటించారు. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల వలన ఆయన హైదరాబాద్‌ని అపోలోలో చేరారు. చికిత్స అనంతరం తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తాడని ఎంతోకాలం నుంచి ఎదురు చూసిన ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయన నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలని రజినీ అభిమానులు కోరుతూ వస్తున్నారు.
అయితే, రజనీకాంత్ యాక్టీవ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేయకపోవడంతో ఆయన అభిమానం సంఘం మక్కల్ మండ్రమ్ జిల్లాల అధ్యక్షులు అసంతృప్తికి లోనవుతున్నారు. నాలుగు జిల్లాల అధ్యక్షులు ఇప్పటికే డీఎంకేలో చేరారు. మరికొందరు ఏఐఏడిఎంకేలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో రజనీ మక్కల్ మండ్రమ్ రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ పార్టీ నాయకులుకు, శ్రేణులకు లేఖ కూడా రాశారు. ఇతర పార్టీలకు వెళ్లాలనుకునేవారు నిరభ్యంతరంగా వెళ్లవచ్చని స్పష్టం చేసి గో హెడ్ అన్నారు.