భారతరత్న ఇవ్వాలంటూ ఇప్పుడు మరొకరి పేరు తెరమీదకు వచ్చింది.. ఇంతకాలం స్వర్గీయ ఎన్టీఆర్ పేరు.. ఆతర్వాత బహుముఖ ప్రజ్ఞాశాలి, వివిధ రంగాల్లో కృషి చేసిన మాజీ భారత ప్రధాని పీవీ నరసింహారావు.. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడు తాజాగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు వినిపిస్తోంది. జైపాల్ రెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జైపాల్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నివాళి అర్పించారు. ఆ పార్టీ ఉపాధ్యక్షులు మల్లురవి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థి దశ నుండి కూడా జైపాల్ రెడ్డి నైతిక విలువలతో రాజకీయాలు చేశారని చెప్పుకొచ్చారు. భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారని… తెలంగాణ సాధనలో స్వరాష్ట్రం కోసం జైపాల్ రెడ్డి పాటుపడ్డారని తెలిపారు.
ఇక కృష్ణ, గోదావరి బోర్డు పరిధిపై గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నదీ జలాల అధికారాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని మండి పడ్డారు. కృష్ణ, గోదావరి నదుల బోర్డుల పరిధి గెజిట్ విడుదల చేసి రెండు రాష్ట్రాల అధికారాలను, హక్కులను కేంద్రం తన చేతిలోకి తీసుకుందని విమర్శించారు.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు తయారు చేయడంలో జైపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అన్నారు. హైదరాబాద్ మెట్రోరైలును తీసుకొచ్చిన ఘనత జైపాల్ రెడ్డి దక్కుతుందన్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ అని అన్నారు. సోనియ్మ రాజ్యంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన తీసుకొస్తామన్నారు.
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు రహస్య ఏజండాతో పని చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీల ప్రయోజలనాల కొరకు తెలంగాణ సెంటిమెంట్ వాడుకోవాలని రెండు రాష్టాల ముఖ్యమంత్రులు పని చేస్తున్నారు.