‘చిన్నమ్మ’ మళ్ళీ అన్నాడీఎంకేలోకి రావచ్చు , పరిశీలిస్తాం, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్ళీ పార్టీలోకి రావచ్చునని, ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని పార్టీ నేత డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు.
అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ మళ్ళీ పార్టీలోకి రావచ్చునని, ఈ విషయాన్ని తాము పరిశీలిస్తామని పార్టీ నేత డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తెలిపారు. ఆమె నాలుగేళ్లు జైల్లో ఉన్నారని, 32 ఏళ్లపాటు దివంగత సీఎం జయలలితకు సేవ చేశారని ఆయన చెప్పారు. అన్నాడీఎంకే ప్రస్తుత వ్యవస్థను అంగీకరిస్తే శశికళ తిరిగి పార్టీలో చేరిక విషయాన్ని తాము పరిశీలిస్తామన్నారు. తమ రాష్ట్ర సీఎం, అన్నాడీఎంకే నేత పళనిస్వామి ఆమె పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకించినప్పటికీ తను మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానని పన్నీర్ సెల్వం వెల్లడించారు. తాను రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్టు శశికళ ఇటీవల ప్రకటించారు. పార్టీ సదా ఐక్యంగా ఉండాలని జయలలిత కోరేవారని, ఆ కోర్కె మేరకు పార్టీ కార్యకర్తలంతా సమైక్యంగా ఉండి ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని ఆమె ఆ మధ్య వ్యాఖ్యానించారు. కాగా ఒక వ్యక్తి కోసమో, కుటుంబం కోసమో పార్టీ పని చేయజాలదని పన్నీర్ సెల్వం పరోక్షంగా పళనిస్వామిని ఉద్దేశించి పేర్కొన్నారు.
శశికళ పట్ల తనకు అసంతృప్తి గానీ, కోపం గానీ, విచారం గానీ లేదని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జయలలిత స్మారకం వద్ద తను నిరసన ప్రకటించినప్పుడు కూడా ఆమెను ఏ మాత్రం సందేహించలేదన్నారు. ‘ శశికళను, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ ను కూడా నేనెప్పుడూ గౌరవిస్తుంటాను.. 20 ఏళ్ళ క్రితం జయలలితకు నన్ను వారే పరిచయం చేశారు’ అని పన్నీర్ సెల్వం వెల్లడించారు. 2007 లో పార్టీ కోశాధికారిగా దినకరన్ స్థానే పన్నీర్ సెల్వం బాధ్యతలు స్వీకరించారు.
మళ్ళీ పార్టీలో చేరాలా, వద్దా అన్న విషయాన్ని శశికళ తానే నిర్ణయించుకోవాలని పన్నీర్ అన్నారు. కాగా… శశికళ నాయకత్వ తీరును విమర్శిస్తూ లోగడ (2017 ఫిబ్రవరిలో)పన్నీర్ సెల్వం తన సీఎం పదవికి కూడా రాజీనామా చేసి జయలలిత స్మారకం వద్ద ధర్నా చేశారు.
మరిన్ని ఇక్కడ చదవండి: కిడ్నీ ఫెయిల్యూర్.. గుండె సమస్యలతో ఉన్న నన్ను సినిమాలే హీరోగా మార్చాయి.. ఆసక్తికర విషయాలను చెప్పిన రానా..