‘వందేమాతరం’ తో బెంగాల్ ఇండియాకు ఆప్త రాష్ట్రమైంది, మమ్మల్ని బయటివారంటారా ? మోదీ
'వందేమాతరం' గీతంతో బెంగాల్ రాష్ట్రం ఈ దేశానికి చాలా సన్నిహితమైందని, ఆప్త రాష్ట్రమైందని ప్రధాని మోదీ అన్నారు. అయితే మమ్మల్ని ఈ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ... 'బయటివారంటారా' అని ఆయన ప్రశ్నించారు.
‘వందేమాతరం’ గీతంతో బెంగాల్ రాష్ట్రం ఈ దేశానికి చాలా సన్నిహితమైందని, ఆప్త రాష్ట్రమైందని ప్రధాని మోదీ అన్నారు. అయితే మమ్మల్ని ఈ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ… ‘బయటివారంటారా’ అని ఆయన ప్రశ్నించారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలోని కోంటై నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ఆయన.. మనమంతా ఈ భూమి పుత్రులమని, ఈ భూమిపై ని ఏ భారతీయుడూ బయటి వ్యక్తి కాడని అన్నారు. ఈ రాష్ట్రం శాంతిని, సుస్థిరతను కోరుతోందని, హింసను కాదని ఆయన చెప్పారు. ఈ ముఖ్యమంత్రి హయాంలో హింస, బాంబు పేలుళ్లు నిత్యకృత్యమయ్యాయని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆయన ఆరోపించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని ఈ సీఎం రైతులకు వర్తింపజేయలేదని, కేంద్రం నుంచి ఈ రాష్ట్ర రైతులకు దక్కాల్సిన ప్రయోజనాలను ఇక్కడి ప్రభుత్వం వారికి కల్పించలేదని మోదీ పేర్కొన్నారు. ‘క్రూరురాలైన’ ఈ ముఖ్యమంత్రిని రైతులు క్షమించబోరని, ఈ రాష్ట్ర అభివృధ్దిని అడ్డుకుంటున్న గోడలను వారు మే 2 న పగులగొట్టడం ఖాయమని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ని మహిళలు శిక్షించబోతున్నారని ఆయనజోస్యం చెప్పారు.
ఇక ఈ రాష్ట్ర యువత దేశానికి మార్గ నిర్దేశకులు కావాలని ఈ రాష్ట్రంలో మార్పును తెచ్చేందుకు వారు ఉద్యమించాలని, బీజేపీకి ఓటు వేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు. మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకోబోతున్న యువకులు ఈ రాష్ట్ర మార్పును కోరుతున్నట్టు అవగతమైందన్నారు.బెంగాల్ భవితవ్యానికి వీరే పునాదులని మోదీ అభివర్ణించారు. కాగా ఈ నెల 27 న బెంగాల్ మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొలి దశలో 5 జిల్లాలలో 30 సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి: రోడ్డుపై వెళ్తున్న ట్రక్‌పై పడిన పిడుగు.. పేలిన 450 సిలిండర్లు.. సమీప గ్రామాలకు దూసుకెళ్లిన ముక్కలు
‘చిన్నమ్మ’ మళ్ళీ అన్నాడీఎంకేలోకి రావచ్చు , పరిశీలిస్తాం, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం