AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘”రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా!”.. ప్రధాని మోదీతో ఇటలీ పీఎం మెలోని స్పెషల్ సెల్ఫీ!

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల సుదీర్ఘ విదేశీ పర్యటనలో భాగంగా చివరి అంచెగా మంగళవారం (మే 19) సాయంత్రం ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఇటలీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజానీ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాని రాకతో రోమ్‌లోని భారతీయ సమాజంలో తీవ్ర ఉత్సాహం నెలకొంది.

'రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా!.. ప్రధాని మోదీతో ఇటలీ పీఎం మెలోని స్పెషల్ సెల్ఫీ!
Pm Modi With Giorgia Meloni
Balaraju Goud
|

Updated on: May 20, 2026 | 9:03 AM

Share

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల సుదీర్ఘ విదేశీ పర్యటనలో భాగంగా చివరి అంచెగా మంగళవారం (మే 19) సాయంత్రం ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఇటలీ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజానీ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి ప్రధాని మోదీకి సాదరంగా స్వాగతం పలికారు. ప్రధాని రాకతో రోమ్‌లోని భారతీయ సమాజంలో తీవ్ర ఉత్సాహం నెలకొంది. విమానాశ్రయం వెలుపల, హోటల్ వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాస భారతీయులను ప్రధాని మోదీ కలుసుకుని, వారితో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.

రోమ్‌లోని హోటల్‌కు చేరుకున్న వెంటనే, ప్రధానమంత్రి మోదీ గౌరవార్థం ఒక ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో ప్రదర్శించిన సాంప్రదాయ శాస్త్రీయ, సాంస్కృతిక నృత్యాలు, మనోహరమైన వాద్య సంగీత ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భారతీయ,ఇటాలియన్ సంస్కృతుల సమ్మేళనంగా సాగిన ఈ ప్రదర్శనలు, అక్కడ ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక బంధాన్ని ప్రతిబింబించాయి.

తాను రోమ్‌లో ల్యాండ్ అయినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించిన ప్రధాని మోదీ, ఈ పర్యటన ప్రాధాన్యతను వివరించారు. “నేను ఇటలీలోని రోమ్‌లో అడుగుపెట్టాను. ఈ పర్యటనలో భాగంగా ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టారెల్లా, ప్రధానమంత్రి జార్జియా మెలోనిలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతాను. భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ (IMEC)పై ప్రత్యేక దృష్టి సారించి, భారత్-ఇటలీల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రాథమిక లక్ష్యం. అలాగే, ‘2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక’ను కూడా మేము సమీక్షిస్తాము,” అని ప్రధాని పేర్కొన్నారు. దీనితో పాటు, బహుపాక్షికవాదం, ప్రపంచ ఆహార భద్రత పట్ల భారతదేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ, తాను ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శించనున్నట్లు ఆయన తెలిపారు.

ఇటీవలి కాలంలో భారతదేశం – ఇటలీ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్రమంగా వృద్ధి చెందాయి. పలు రంగాలలో వ్యూహాత్మక సహకారం కోసం ఇరుపక్షాలు రూపొందించిన సమగ్ర చట్రమైన ‘జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025-2029’ను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఈ ఆర్థిక, రాజకీయ బంధం గణాంకాల పరంగా కూడా ఎంతో బలంగా ఉన్నాయి. 2025 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యం 16.77 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అలాగే, ఇటలీ నుండి భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 3.66 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక రక్షణ – భద్రత, స్వచ్ఛ ఇంధనం, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు వంటి కీలక రంగాలలో సహకారం వేగంగా విస్తరిస్తోంది.

సోషల్ మీడియాలో మెలోని ‘సెల్ఫీ’ హల్చల్

ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని ప్రత్యేక ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ పర్యటన, ప్రధాని మోదీ ఇటలీలో పర్యటిస్తున్న తొలి అధికారిక ద్వైపాక్షిక పర్యటన కావడం విశేషం. ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ ఇటలీ పీఎం జార్జియా మెలోని తన సోషల్ మీడియా ఖాతాలో మోదీతో కలిసి దిగిన ఒక ప్రత్యేకమైన సెల్ఫీ ఫోటోను పంచుకున్నారు. ఆ ఫోటోకు “రోమ్‌కు స్వాగతం, నా మిత్రమా!” అనే ఆత్మీయమైన క్యాప్షన్‌ను ఆమె జోడించారు. ఈ ఫోటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ప్రధాని మోదీ తన ఐదు దేశాల విస్తృత పర్యటనలో భాగంగా ఇటలీకి చేరుకోవడానికి ముందు నార్వే, స్వీడన్, నెదర్లాండ్స్, మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) దేశాలలో విజయవంతంగా పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ తుది విడత ఇటలీ పర్యటనతో ఇరు దేశాల ఆర్థిక, వ్యూహాత్మక బంధం సరికొత్త శిఖరాలకు చేరుకుంటుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us