ప్రపంచం చూపు భారత్ వైపు.. ఒకే వేదికపైకి భారత్, రష్యా, చైనా.. ఢిల్లీలో పుతిన్-జిన్‌పింగ్ భేటీ!
ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు భారతదేశం వేదిక కాబోతోంది. ఈ ఏడాది 2026, సెప్టెంబర్ నెలలో భారత్ ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కానున్నారు.

ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు భారతదేశం వేదిక కాబోతోంది. ఈ ఏడాది 2026, సెప్టెంబర్ నెలలో భారత్ ప్రతిష్టాత్మక బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 12, 13 తేదీలలో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కానున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రతిష్టాత్మక పర్యటనకు సంబంధించి ఇరు దేశాలు ఇప్పటికే న్యూఢిల్లీకి అధికారికంగా సమాచారం అందించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను ఆ దేశ ప్రభుత్వ వార్తా సంస్థ ‘టాస్’ (TASS) కూడా ధృవీకరించింది.
పుతిన్ పర్యటన ఖరారు!
రష్యా అంతర్జాతీయ వ్యవహారాల సలహాదారు యూరి ఉషకోవ్ ఈ పర్యటన వివరాలను వెల్లడించారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో న్యూఢిల్లీ వేదికగా జరిగే బ్రిక్స్ సదస్సులో అధ్యక్షుడు పుతిన్ పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశం కూడా జరగనుందని ఆయన పేర్కొన్నారు. ఏడాది కాలంలోనే పుతిన్ భారతదేశంలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో 2025 డిసెంబర్‌లో జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ఆయన భారత్‌కు వచ్చారు. ఈ నెల ప్రారంభంలోనే రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.
ఏడేళ్ల తర్వాత భారత్‌లో షీ జిన్‌పింగ్ అడుగు!
ఈ బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన భారతదేశంలో పర్యటించబోతున్నారు. చివరిగా ఆయన 2019లో చెన్నై సమీపంలోని మామల్లాపురంలో జరిగిన సదస్సు కోసం భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత సరిహద్దు వివాదాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో, 2026 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన భారత్‌కు ఆయన రానుండడం గమనార్హం.
SCO వేదికగా మోదీ-పుతిన్ భేటీ?
సెప్టెంబరులో జరిగే బ్రిక్స్ వార్షిక సదస్సుకు ముందే మరో కీలక అంతర్జాతీయ వేదిక సిద్ధమవుతోంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీలలో కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్‌లో ఎస్‌సీఓ (SCO – షాంఘై సహకార సంస్థ) సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ హాజరవుతారని భావిస్తున్నారు. ఆ వెంటనే న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది.
విశ్వవ్యాప్త శక్తిగా ‘బ్రిక్స్’ కూటమి!
ప్రస్తుతం బ్రిక్స్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 11 దేశాల మహా కూటమిగా అవతరించింది. గతంలో ఇందులో కేవలం ఐదు దేశాలు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా మాత్రమే ఉండేవి. అయితే, 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈలు ఇందులో చేరాయి. కాగా 2025లో ఇండోనేషియా కూడా ఈ కూటమిలో భాగస్వామి అయింది.
ప్రస్తుతం ఈ 11 దేశాల కూటమి మొత్తం ప్రపంచ జనాభాలో సుమారు 49.5 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతేకాదు, ప్రపంచ జీడీపీ (GDP)లో సుమారు 40 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 26 శాతం వాటాను ఈ దేశాలే కలిగి ఉన్నాయి. ఇంతటి భారీ ప్రాధాన్యత ఉన్న కూటమికి భారత్ నేతృత్వం వహిస్తుండడం, ప్రపంచ అగ్రనేతలు తరలివస్తుండడంతో సెప్టెంబర్ సదస్సుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
