NTR Birthday : ‘ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదు. ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం’
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..
Chandrababu and Nara Lokesh on NTR : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారకరామారావు జయంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు. ఆయన జీవిత గమనాన్ని ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. “అధికారం అన్నది అనుభవించడానికి కాదు,ప్రజలకు సేవ చేయడానికి అన్న మానవీయ సిద్ధాంతాన్ని తొలిసారిగా రాజకీయాల్లోకి,పాలనలోకి తెచ్చి ఆచరించి చూపిన మహనీయుడు ఎన్టీఆర్.అప్పటివరకు ఓటు బ్యాంకులుగా పరిగణించబడిన పేదల కడుపులోని ఆకలిని,బతుకులోని కష్టాలని తొంగిచూసిన తొలి రాజకీయనాయకుడు ఎన్టీఆర్. ప్రతి తెలుగువాడు గర్వించేలా సినీ,రాజకీయ రంగాలలో ఒక అసాధారణ చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ విశ్వవిఖ్యాతుని ఆదర్శాలను, ఆశయాలను మననం చేసుకుంటూ… ప్రజాసేవలో స్ఫూర్తిని పొందుదాం.తిరుగులేని ఆ ప్రజా నాయకుని స్మృతికి నివాళులర్పిద్దాం” అని చంద్రబాబు తన సందేశమివ్వగా,
“ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడూ స్మరించుకునే చరిత్ర కాదు. ప్రతిరోజూ చదవాల్సిన స్ఫూర్తి పాఠం. ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా, అసాధ్యుడిగా, చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు కృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ, జీవితంలోనూ భాగం చేసుకున్నారు ఎన్టీఆర్. సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి. బడుగు వర్గాలకు అన్నివిధాలా అండగా నిలిచి, వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మానవతావాది ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషిచేద్దాం.” అని లోకేష్ ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కు ఘన నివాళులర్పించారు.