MP Raghurama Krishna Raju: ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారంలో మరో ట్విస్ట్.. షాక్ ఇచ్చిన ఎయిమ్స్ అధికారులు
మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కి వెళ్లిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు అక్కడ చుక్కెదురైంది. ఆస్పత్రిలో చేర్చుకోబోమంటూ..
MP Raghurama Krishna Raju: సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కి వెళ్లిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు అక్కడ చుక్కెదురైంది. చికిత్స కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్‌కి వెళ్లిన ఆయనకు ఆస్పత్రి వర్గాలు షాక్ ఇచ్చాయి. రఘురామకృష్ణను ఆస్పత్రిలో చేర్చుకునేందుకు అధికారులు నిరాకరించారు. దాంతో చేసేదేం లేక ఆయన ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. కాగా, హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రఘురామకృష్ణ రాజును ఆయన బంధువులు తొలుత ఎయిమ్స్‌కు తరలించారు. అయితే, ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించుకునేందుకు నిరాకరించడంతో రఘురామతో పాటు వారు కూడా వెనుదిరిగారు.
ఈ నెల 14న రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎంపీ తనను కొంతమంది కొట్టారని ఆరోపించారు. దీంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు సూచించగా.. గుంటూరు జీజీహెచ్‌లో నిర్వహించి రిపోర్ట్ అందజేశారు. రఘురామ మాత్రం వైద్య పరీక్షలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించడంతో.. అక్కడ పరీక్షలు నిర్వహించి రిపోర్టులను సీల్డ్ కవర్‌లో తెలంగాణ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టుకు అందజేశారు. అనంతరం జరిగిన విచారణలో రఘురామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. సీఐడీ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు అదేశించింది. సీఐడీ కోర్టులో షూరిటీ పేపర్లు సమర్పించేందుకు రఘురామకు 10 రోజుల గడువు ఇచ్చింది.