ఖబర్దార్ బీజేపీ..! మా సహనాన్ని పరీక్షించొద్దు.. పచ్చని తెలంగాణలో మత రాజకీయాల చిచ్చు పెట్టొద్దు -మంత్రి ఎర్రబెల్లి
ఖబడ్దార్ బిజెపి! చిల్లర రాజకీయాలతో అల్లరి మానుకోండి. మా సహనాన్ని పరీక్షించవద్దు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించవద్దని అంటూ..

ఖబడ్దార్ బీజేపీ! చిల్లర రాజకీయాలతో అల్లరి మానుకోండి. మా సహనాన్ని పరీక్షించవద్దు. ప్రజాస్వామ్యాన్ని పరిహసించవద్దని అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా లోనే ఇది వరుసగా నాలుగో దాడి. మొదట ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత పరకాల సీఐ పై దాడి చేశారు. ఆ తర్వాత కాకతీయ యూనివర్సిటీలో అల్లరి చేశారు. ఇప్పుడు ఏకంగా మరోసారి పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడికి దిగారు. పోలీసుల లాఠీలను గుంజుకుని ఇంటిపై విసిరారు. రాళ్ళు రువ్వారు. ఇంట్లో మహిళలు ఉన్న సమయంలో ఈ దాడికి పాల్పడ్డారు. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. ఇదేమి రాజకీయం? అంటూ ఎర్రబెల్లి బిజెపి వైఖరిని దుయ్యబట్టారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించారు. జనగామ పర్యటనలో ఉన్న మంత్రి చల్లా ధర్మారెడ్డి ఇంటి పై దాడి జరిగిన ఘటన తెలిసిన వెంటనే తిరిగి హనుమకొండ కు చేరుకున్నారు. ధర్మారెడ్డి ఇంటిని పరిశీలించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే ధర్మారెడ్డి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బిజెపి అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తోంది. దాడులకు దిగుతోంది. ప్రజలను, ఇతర పార్టీలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. గూండాగిరి ని ప్రదర్శిస్తోంది. రామాలయ నిర్మాణానికి సంబంధించిన నిధుల సేకరణపై ధర్మారెడ్డి ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించారు. తన అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని ప్రజాస్వామ్య పద్ధతిలోనే నివృత్తి చేయాలి. కానీ బిజెపి దౌర్జన్యానికి దిగింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వైఖరులకు తావు లేదు. ఇలాంటి పరిస్థితి వస్తే మా పార్టీకి కావలసినంత బలం బలగం ఉంది. కానీ మా పద్ధతి అది కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం. పార్టీగా బిజెపిని గౌరవిస్తున్నాం. ఈరోజు మా పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బిజెపి శ్రేణులు చేసిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నానని ఎర్రబెల్లి చెప్పారు.
ప్రజాస్వామ్య పద్దతిలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి తీరుని ప్రజాస్వామ్యవాదులు అంతా ఖండించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. మా ఓపికకు ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బిజెపిని హెచ్చరించాం. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నాం. టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బిజెపి మర్చిపోకూడదని హెచ్చరిస్తున్నాం అని చెప్పారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బిజెపి చేస్తున్న కుటిల ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు, సమాజంలోని బుద్ధిజీవులు గమనించి, బిజెపిని ఎక్కడికక్కడ నిలదీయాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
సిరిసిల్లకు పాకిన ఓరుగల్లు వార్.. కోనరావుపేటలో మంత్రి కేటీఆర్‌ను అడ్డుకోబోయిన కాషాయం శ్రేణులు
