Telangana: మంత్రి కావాలన్న ఆయన కల కలేనా..? సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయంతో శాసన మండలి చైర్మన్‌గా మళ్లీ..
Gutta Sukender Reddy: నల్గొండ జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి చిరకాల వాంఛ నెరవేరడం కష్ట మేనా..? మంత్రి పదవిపై పెట్టుకున్న ఆశలు.. అడియాశలయ్యాయా.. గుత్తాకు మళ్లీ శాసన మండలి చైర్మన్ గిరినే దక్కడంతో అవుననే సంకేతాలు..
నల్గొండ జిల్లాలో సీనియర్ టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukender Reddy) చిరకాల వాంఛ నెరవేరడం కష్ట మేనా..? మంత్రి పదవిపై(Minister) పెట్టుకున్న ఆశలు.. అడియాశలయ్యాయా.. గుత్తాకు మళ్లీ శాసన మండలి చైర్మన్ గిరినే దక్కడంతో అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మరో సారి శాసన మండలి చైర్మన్ పదవి చేపడుతుండడంతో అధికార పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసనమండలి చైర్మన్ పదవికి మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎంచుకున్నారు సీఎం కేసీఆర్. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన కేబినెట్ బెర్తును గుత్తాకు కేటాయిస్తారని.. మండలి చైర్మన్ పదవిని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారికి అప్పగిస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం జరిగింది. మండలి చైర్మన్ గా గుత్తా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. శాసనమండలి చైర్మన్ పదవికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదివారం నాడు నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుఖేందర్ రెడ్డి నామినేషన్ పత్రాలను సమర్పించారు. మండలి చైర్మన్‌గా రెండోసారి అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి వివాదరహితుడిగా మృదు స్వభావిగా పేరుంది. వార్డు సభ్యుడిగా రాజకీయ అరంగ్రేటం చేసిన గుత్తా టీడీపీ నుంచి 1999లో నల్గొండ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా 2009లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే ఏడాది జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. తిరిగి 2014లో వరుసగా మూడోసారి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మారిన రాజకీయ సమీకరణాలతో తన అనుచరులతో కలిసి గుత్తా సుఖేందర్రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు.
రాష్ట్రస్థాయిలో సీఎం కేసీఆర్ ఏర్పాటుచేసిన రైతు సమన్వయ సమితి తొలి చైర్మన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి శాసన మండలి రెండో ఛైర్మెన్ గా 21 నెలలపాటు వ్యవహరించారు. ఆ పదవి నుంచి గుత్తా దిగిపోయిన నాటి నుంచి ఖాళీగానే ఉంది. తిరిగి రెండోసారి 2021 నవంబర్ లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక య్యారు.
అయితే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాబినెట్ లో బెర్త్ ఆశించారు. ఎప్పటి నుంచో మంత్రి పదవి పైన ఆశలు పెట్టుకున్న ఆయనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ హోదా లభిస్తుందని ఆయన వర్గీయులు భావించారు. ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఇష్టపడే సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలినాళ్లలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది.
ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక 2019 సెప్టెంబర్ 11 నుంచి గతేడాది జూన్ 3వరకు మండలి చైర్మన్ గా పనిచేశారు. చైర్మన్ పదవి దక్కడంతో ఆయన ప్రభుత్వంలో సముచిత స్థానం లభించినట్టుగానే భావించారు. కానీ మరో కోణంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమరయ్యారనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. గుత్తా శాసనమండలి చైర్మన్ అయినప్పటికీ ప్రజలతో, పార్టీ కేడర్ తో సత్సంబందాలు కొన సాగించారు.
నాగార్జునసాగర్ ఉపఎన్నిక, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గుత్తా తెరవెనక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మళ్లీ మండలి చైర్మన్ గా గుత్తాకు మరోసారి అవకాశం లభించింది. కానీ ఊహించని రీతిలో మళ్లీ మండలి చైర్మన్ పదవికే సీఎం కేసీఆ ర్ మొగ్గు చూపడంతో ఇక మంత్రి పదవి కల ఇక కల లాగే మిగిలి పోనుందనే చర్చ జరుగుతోంది. క్యాబినెట్ లో ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఉందని.
దీంతో సుఖేందర్ రెడ్డికి బెర్త్ దొరకడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డిని మండలి చైర్మన్ గా ఎంపిక చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో భవిష్యత్తులో జరిగే క్యాబినెట్ మార్పుల్లో గుత్తాకు అవకాశం ఉండకపోవచ్చని చర్చ జరుగుతోంది.
మండలి చైర్మన్ పదవిలో గుత్తా ఎన్నాళ్లు కొనసాగుతారనే విషయం పక్కన పెడితే భవిష్యత్తులో కేబినెట్ లో చోటు దక్కుతుందా లేదా అనేది ఇప్పటికైతే ప్రశ్నార్ధకమే. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోనే ఉండాలని ఆయన అనుచరులు కోరుకుంటున్నారు. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో క్యాబినెట్ మార్పులు-చేర్పుల్లో చిరకాల వాంఛ మంత్రిపదవి నెరవేరాలని గుత్తా ఆశిస్తున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి చిరకాల వాంఛ నెరవేరుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
ఇవి కూడా చదవండి: Iraq Rocket Attack: అమెరికాతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఇరాన్.. ఇరాక్ లోని యూఎస్ ఎంబసీపై మిస్సైల్ దాడి..
Earthquake: ఆ రెండు దేశాల్లో భారీ భూకంపం.. భయాందోళనలో అక్కడి ప్రజలు..