Telangana: ముగిసిన స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికలు.. అన్ని చోట్ల భారీగా ఓటింగ్
Telangana MLC Election News: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు అన్ని చోట్ల 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది.
Telangana MLC Elections: తెలంగాణలో స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికలు ముగిశాయి. 5 జిల్లాల్లోని ఆరు స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు అన్ని చోట్ల 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది..ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మొదక్ జిల్లాల్లో ఒక్కో స్థానం. కరీంనగర్‌లో రెండు స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మొత్తం ఓటర్లు 5 వేల 326 మంది. ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా ఓటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు చేశారు. 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నంకల్లా ఫలితాలు వెలువడనున్నాయి.
లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాల్లో ఇవాళ పోలింగ్ జరిగింది. ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానికే మెజార్టీ ఉంది. అయితే క్రాస్ ఓటింగ్ భయంతో జాగ్రత్తపడింది అధికార పార్టీ. ఖమ్మం, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పోటీలో ఉంది. కరీంనగర్‌లో TRSకు రాజీనామా చేసిన మాజీ మేయర్ రవీందర్‌సింగ్ పోటీ చేశారు. ముందుజాగ్రత్తగా ఓటర్లను క్యాంప్‌లకు తరలించిన అధికార పార్టీ..ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంది.
జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలను అనుసరిస్తూ పోలింగ్ నిర్వహించారు. సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఓటు వేశారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటేశారు మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. 14వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలు వెల్లడికానున్నాయి. మొత్తం 12 MLC స్థానాల్లో ఇప్పటికే 6 ఏకగ్రీవం కాగా.. మిగిలిన ఆరు చోట్ల కూడా తాము గెలుస్తామని TRS ధీమా వ్యక్తంచేస్తోంది.
Also Read..
LIC: ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటా పెంచుకోనున్న ఎల్ఐసీ.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ!