సర్కారుకు తలనొప్పిగా మారిన పోడు.. గిరిజన భూములపై నాయకుల మాటల తూటాలు..

తెలంగాణలో పోడుభూముల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడిజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నోఏళ్లుగా గిరిజనులు పోడుభూములు సాగు చేసుకుని..

సర్కారుకు తలనొప్పిగా మారిన పోడు.. గిరిజన భూములపై నాయకుల మాటల తూటాలు..
issue of tribal lands
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 21, 2021 | 8:12 PM

Issue of Tribal Lands: తెలంగాణలో పోడుభూముల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ ఉమ్మడిజిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నోఏళ్లుగా గిరిజనులు పోడుభూములు సాగు చేసుకుని జీవిస్తున్నారు. అయితే పోడు భూముల స్వాధీనానికి ఫారెస్ట్ అధికారుల తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే భూమిని నమ్ముకొని ఏళ్ల తరబడి జీవిస్తున్న గిరిజనులు… ప్రాణం పోయినా భూమి వదలనంటున్నారు. ఇరు వర్గాల ఘర్షణతో వార్‌ ఫీల్డ్‌ను తలపిస్తోంది.

పోడు వ్యవసాయాన్ని అడ్డుకునేందుకు ఏకంగా పులులను వదులుతున్నారంటూ ఎంపీ సోయం బాపూరావు చేసిన కామెంట్స్ కాకరేపితే.. పోడు భూముల జోలికి వస్తే సహించేది లేదంటూ ఆదివాసీ ప్రాంత ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు మరింత మంట పుట్టిస్తున్నాయి. ఆదివాసీ పల్లెల్లో వరుస పులుల దాడులు నేతల మాటలకు మరింత ఊతమిస్తున్నాయి. ఆయన బాటలోనే ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజక వర్గ ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్‌లు అటవీశాఖపై ఫైర్ అవుతూనే ఉన్నారు. గిరిజనుల పొట్ట మీద కొట్టే చర్యలు చేపడితే సహించేది లేదంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు.

అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లాగా పేరు పొందిన ఈ జిల్లాలో నిత్యం పోడు వ్యవసాయ దారులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య పోరాటాలు జరుగుతున్నాయి. సుమారు లక్ష హెక్టార్లపైగా అడవిని నరికి పోడు సాగు చేసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.. 2005 ముందు నుంచి సాగు చేస్తున్న వారికి 2007లో పోడు పట్టాలు పంపిణీ చేశారు. కొందరికి టెక్నికల్‌ ప్రాబ్లమ్స్‌తో పట్టాలు రాలేదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక… పోడు భూముల స్వాధీనం ప్రారంభించింది. దీంతో వివాదం మొదలైంది. పోడు భూములకు ఫారెస్ట్ అధికారులు సరిహద్దులు తవ్వడానికి ఎప్పుడైతే ప్రయత్నాలు చేశారో అప్పటినుంచి రైతులు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు.

కేవలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్షల హెక్టార్లు అడవిని నరికి పోడు సాగు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సీఎం కెసీఆర్ పట్టాలిచ్చిన భూములను సైతం ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం విమర్శలపాలైంది. గుండాల మండలం శంభునిగూడెం, చెట్టుపల్లిలో భూముల స్వాధీనం కోసం ఫారెస్టు అధికారుల ప్రయత్నాన్ని గిరిజనులు అడ్డుకున్నారు. పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు గిరిజనుల తరపున ఉద్యమానికి పిలుపునిచ్చారు.

అడవులగుండా ఇష్టారీతిన ఇసుక అక్రమంగా రవాణా సాగితే పట్టించుకోని ఫారెస్టు అధికారులు..కేవలం పోడు వ్యవసాయం విషయంలో ఆంక్షలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి‌. అయితే ప్రభుత్వ అధికారులపై, అధికార ప్రజాప్రతినిధులు సమరానికి పిలుపు ఇవ్వడం కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవేళ గిరిజనులు తిరుగుబాటు చేస్తే..శాంతి భద్రతల సమస్య వస్తే ఎవరు బాధ్యత వహిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.