ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన తుది విడత పల్లె పోరు… చివరి రోజు తప్పని ఉద్రిక్తతలు.. పోలింగ్ ప్రశాంతంపై ఎస్ఈసీ హర్షం

Sarpanch elections : ఆంధ్రప్రదేశ్ తుది విడత పల్లె పోరులో అదే సీను.. పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఫైట్లు.. ఫీట్లు హోరెత్తించాయి. వైసీపీ-టీడీపీ వర్గీయులు బాహాబాహీకి దిగారు.

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన తుది విడత పల్లె పోరు... చివరి రోజు తప్పని ఉద్రిక్తతలు.. పోలింగ్ ప్రశాంతంపై ఎస్ఈసీ హర్షం
Follow us

|

Updated on: Feb 21, 2021 | 6:53 PM

Political parties fight : ఆంధ్రప్రదేశ్ తుది విడత పల్లె పోరులో అదే సీను.. పంచాయతీ ఎన్నికల్లో పలుచోట్ల ఫైట్లు.. ఫీట్లు హోరెత్తించాయి. వైసీపీ-టీడీపీ వర్గీయులు బాహాబాహీకి దిగారు. పోటాపోటీగా నిరసనలతో పోలింగ్ స్టేషన్ల వద్దే తన్నుకున్నారు. పోలీసుల అప్రమత్తతతో పోలింగ్ ఎపిసోడ్ ప్రశాంతంగా ముగిసింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు, ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలతో ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి.

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రాజుగార్లపాడులో రెండు పార్టీల కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. కొంతమంది పోలింగ్ బూత్‌ పరిసరాల్లోకి వెళ్లడంపై మాటామాటా పెరిగింది. పరస్పరం వాగ్వివాదానికి దిగారు. దీంతో ఇరువర్గాలు తోపులాటకు దారితీయడంతో పోలీసులు చెదరగొట్టారు. అటు, తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరంలో వైసీపీ-టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇటూ గుంటూరు జిల్లా ధూళిపాళ్లలో ఏజెంట్లు పరస్పర దాడులకు దిగారు. పోలింగ్ బూతు యుద్ద వాతావరణ తలపించింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదే జిల్లాలోని ముప్పాళ్ల మండలం మాదలలో టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించిన వైసీపీ అభ్యర్థిని టీడీపీ వర్గీయులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.

ఇక, కృష్ణాజిల్లా రెడ్డిగూడెం పోలింగ్ కేంద్రంలో ఓట్లు వేసే విషయంలో వివాదం రాజుకుంది. వైసీపీ ఏజెంట్ ఓ వృద్దురాలిని పోలింగ్ బూత్‌లోకి తీసుకెళ్లి ఓటు వేయించాడని టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో వాగ్వాదం మొదలైంది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. నెల్లూరుజిల్లా కొడవలూరు మండలం పాత ఒంగల్లు వడ్డి పాళెం పోలింగ్ బూత్ దగ్గర రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఒకరి ఓటు మరొకరు వేయడంతో అగ్గి రాజుకుంది.

అటు, తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ పోలింగ్ బూత్ దగ్గర దొంగ ఓట్లు వేస్తున్నారని పోటీలో ఉన్న అభ్యర్థులు గొడవపడ్డారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత తలెత్తింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వాదంపల్లి గ్రామంలో అధికార ప్రతిపక్ష పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల ఎంట్రీతో ఇరువర్గాలు శాంతించాయి.

ఇక, విశాఖజిల్లా భీమిలి మండలం తాటితూరులో పోలింగ్ బూత్ సమీపంలో గుమికూడిన గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ క్రమంలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అనంతరం ఉన్నతాధికారుల జోక్యంతో ఆందోళన విరమించారు. గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లా ఆలూరు మెయిన్ స్కూల్‌లో సర్పంచ్ అభ్యర్థుల మధ్య వివాదం మొదలైంది. ఓటర్లను కేంద్రంలోనికి పంపే విషయంలో వాదులాటకు దిగారు. అటు కోసిగి పీఎస్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తమ నేతల్ని నిర్భంధించి పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలింగ్ వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఉద్రిక్తతల మధ్యే పోలింగ్ ఎపిసోడ్‌ పూర్తయింది.

Read Also…  AP Panchayat Elections 2021 results live: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కొనసాగుతున్న కౌంటింగ్