Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో హీట్‌ పెంచిన మాటల తూటలు.. దూసుకొచ్చిన మరో కొత్త బుల్లెట్..

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువేమీ కాదు.. కానీ తెలంగాణలో డోసు కాస్త ఎక్కువే అయింది. దశాబ్ధాలు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా శత్రువులు..

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో హీట్‌ పెంచిన మాటల తూటలు.. దూసుకొచ్చిన మరో కొత్త బుల్లెట్..
Kokkirala Prem Sagar Rao
Follow us
Sanjay Kasula

|

Updated on: Nov 06, 2021 | 7:37 PM

కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువేమీ కాదు.. కానీ తెలంగాణలో డోసు కాస్త ఎక్కువే అయింది. దశాబ్ధాలు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా శత్రువులు అవసరం లేదు. అందులో గ్రూపు రాజకీయాలే చాలన్న సామెతను నిజం చేస్తున్నారు తెలంగాణ పీసీసీ నాయకులు. ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా మారింది పరిస్థితి. హుజూరాబాద్‌ ఎన్నికల్లో ఘోరపరాభవం తర్వాత పార్టీలో అసమ్మతీ స్వరాలు పెరుగుతున్నాయి. ఎన్నికల విశ్లేషించుకోవడానికి పెట్టిన సమావేశంలోనూ అసంతృప్తులపైనే చర్చ జరగడం పార్టీలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతుంది.

భవిష్యత్తుపై బెంగలేదు.. పార్టీ పట్ల కించత్‌ ప్రేమ కనిపించదు.. కాంగ్రెస్‌లో ఎవరి ఎజెండా వారిదే అన్నట్టుగా మారింది. అసలే గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా మారిన పార్టీలో పీసీసీ కార్యవర్గం ప్రకటించినప్పటి నుంచి చిచ్చు రాజుకుంది. హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితం తర్వాత అది లావా లా ఎగిసిపడుతోంది. పార్టీలో పదవులు ఇచ్చినా అసమ్మతీయే.. ఇవ్వకపోయినా గొడవే. అందుకే రాష్ట్రం ఇచ్చినా అధికారం దక్కించుకోలేకపోయిన పార్టీలో ఈ గ్రూపుల గోల కేడర్‌ను కలవరపెడుతోంది.

పీసీసీ టార్గెట్‌గా కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి- ఎల్లారెడ్డి నుంచి ఉద్యమం మొదలుపెడుతానని.. రేపటి నుంచి నా సత్తా చూపిస్తానంటూ డైలాగులు పేల్చారు. మాకు అప్పడూ.. ఇప్పుడూ సోనియానే దేవత అని.. పెద్ద లీడర్లు అని చెప్పుకొని- పదవుల పంపకాలు చేసుకున్నవాళ్లకు నాడు దెయ్యం.. నేడు దేవతగా మారారని ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్‌ లేదనుకుంటే 6వేల ఓట్లు వచ్చాయి- తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకున్నా డిపాజిట్లు రాలేదంటే నాయకత్వం ఏమైనట్టు అని ప్రశ్నించారు ఎంపీ.

అసలే అసహనంతో రగిలిపోతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బుజ్జగించేందుకు సీనియర్‌ నాయకుడు వీహెచ్‌ చేసిన ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎల్పీ లో వీహెచ్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటి అయ్యారు. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న ఎంపీని బుజ్జగించేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. పీఏసీ సమావేశంలో కూడా కోమటిరెడ్డి అంశం చర్చకు వచ్చింది.. ఈ సమయంలో బుజ్జగించే బాధ్యత వీహెచ్‌కు అప్పగించారు. ఇందులో భాగంగా చేసిన ప్రయత్నం ఫలించకపోగా.. మళ్లీ వ్యవహారం మొదటికొచ్చింది.

అటు సీనియర్లు కూడా కొంతకాలంగా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. నాయకత్వంలో ఒంటెద్దు పోకడలు పెరిగాయని.. సీనియర్లకు రెస్పెక్ట్‌ లేదన్నది ప్రధానంగా పార్టీలో వినిపిస్తోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి, విహెచ్‌లు పార్టీలో అసమ్మతిరాగం వినిపిస్తూనే ఉన్నారు. తన మనసులో మాట దాచుకోవడం తెలియని జగ్గారెడ్డి పీసీసీకి టార్గెట్‌ అయ్యారు. ఇటీవల జరిగిన పీఏసీ సమావేశంలో మందలించినట్టు తెలుస్తోంది.

దీంతో అలకబూనిన జగ్గారెడ్డి తన నియోజ‌క‌వ‌ర్గం సంగారెడ్డికే ప‌రిమితం కావాల‌ని నిర్ణయించుకున్నారు. అటు కొత్త కార్యవర్గంపై ఉత్తమ్, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మహేశ్వర రెడ్డి, విహెచ్‌, కొండ దంపతులు, శ్రీధర్ బాబు అసంతృప్తిగానే ఉన్నారు. ఉత్తమ్, జగ్గారెడ్డి, బట్టి, శ్రీధర్‌ అక్కడక్కడా యాక్టీవ్‌గా కనిపిస్తున్నా మిగిలిన సభ్యులు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. దీనిపై పార్టీలో అంతర్గంగా పెద్ద చర్చే జరుగుతోంది.

దీనికి సమాధానం కూడా జానారెడ్డి మాటల్లోనే కనిపిస్తోంది. హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితానికి బాధ్యత తనదే అంటూ పీసీసీ ప్రెసిడెంట్‌ ప్రకటించడాన్ని జానా వ్యతిరేకించారు. పార్టీలో ఏకస్వామ్యానికి దారి తీస్తుందని గుర్తు చేశారు. అంతా తానే అన్న అభిప్రాయం పీసీసీ అధ్యక్షుడిలో ఉండటం వల్లే సీనియర్లు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి జానారెడ్డి వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయన్నది పార్టీలో వినిపిస్తున్న టాక్‌.

అటు రాష్ట్ర నాయకత్వంలోనే కలహాలు బయటపడితే.. తాజాగా జిల్లాల్లోనూ ముసలం ముదురుతోంది. ఇన్నాళ్లు అన్నీ తానై ఉమ్మడి ఆదిలాబాద్ కాంగ్రెస్ ను గట్టెక్కించాలని‌ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. మంచిర్యాలలో నిర్వహించబోతున్న కార్యకర్తల సమావేశం సంచలనంగా మారింది.

ఇంద్రవెళ్లి సభకు అన్నీ తామై పని చేసినా కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి గుర్తింపునివ్వకుండా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని అందలం ఎక్కించడం పై మాజీ ఎమ్మెల్సీ రగిలిపోతున్నారు. అధిష్టానికి అల్టిమేట్ ఇచ్చేందుకే ఈ సమావేశం పెడుతున్నట్టు తెలుస్తోంది. పార్టీలో లోపాలున్నాయని.. సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రేమసాగర్‌రావు.

అటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌పైనా సీనియర్లు ఆరోపణలు చేస్తన్నారు. మాణిక్యం ఠాగూర్‌ స్థానంలో కొత్తవాళ్లకు నియమించాలని కొందరు సోనియాకు లేఖ రాసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అటు కాంగ్రెస్‌లో పరిణామాలు అధిష్టానానికి తలపోటుగా మారాయి. కలహాల కాంగ్రెస్‌ ఫ్యూచర్‌ ఏంటో ఆ ఓటరు దేవుడికే తెలియాలి.

ఇవి కూడా చదవండి: Google Pay: గూగుల్‌ UPI పిన్‌ని మరిచిపోతున్నారా.. మార్చాలా.. చాలా ఈజీ.. ఎలానో తెలుసుకోండి..

Spectacle Marks: కళ్ల జోడు వాడకంతో ముక్కుపై మచ్చలు ఏర్పడుతున్నాయా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి..