విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగాలంటే అదొక్కటే మార్గం.. కార్మికులను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందన్న గంటా

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అందరం కలిసి పోరాడాలని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో..

  • K Sammaiah
  • Publish Date - 12:19 pm, Tue, 9 March 21
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగాలంటే అదొక్కటే మార్గం.. కార్మికులను ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందన్న గంటా

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటనతో ఉక్కునగరం విశాఖలో అగ్గి రాజుకుంది. మోదీ, జగన్ బొమ్మలను కార్మికులు తగులబెట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వం కలిసే ఉందంటూ ఆగ్రమం వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, ఇటీవల రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అందరం కలిసి పోరాడాలని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం వైఖరిని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారు. రాష్ట్రంలోని పెద్దలు ఏం జరగలేదని తప్పుదోవ పట్టించారని వైసీపీని ఉద్దేశించి గంటా విమర్శించారు. రాష్ట్రానికి సమాచారం అందిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి చెప్పారు. ప్రైవేటీకరణపై ఆర్థికమంత్రి ముగిసిన అధ్యాయమన్నారు. సీఎంతో కలిసి పనిచేస్తామని చంద్రబాబు కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఉప సంహరణకు భాజపా నేతలు ప్రధాన పాత్ర పోషించాలని గంటా అన్నారు.

ప్రధానిని కలిసినప్పుడు విశాఖ ఉక్కు అంశం సీఎం ఎందుకు ప్రస్తావించలేదని గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. దిల్లీలో పాదయాత్రకు మేము సిద్ధం అందరూ కలిసి రావాలన్నారు. విశాఖ ఉక్కుపై పవన్‌ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కార్మికుల తరఫున పవన్‌ పోరాడాలని కోరారు. రాష్ట్ర మంత్రులు రాజీనామా చేస్తే కచ్చితంగా ఫలితం ఉంటుందని అన్నారు. రాజీనామా చేస్తే తెదేపా పోటీ పెట్టదని కూడా గంటా చెప్పారు. కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలని సీఎంను కోరుతున్నానని గంటా శ్రీనివాసరావు వివరించారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. నిర్దిష్ట అంశాల్లో అవసరమైనప్పుడల్లా రాష్ట్రప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నామని లోక్‌సభలో నిర్మల సీతారామన్ తెలిపారు. వైసీపీ సభ్యులు గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యం అవసరమైన అంశాల్లో తప్పకుండా దాని మద్దతు కోరతామన్నారు. విశాఖ ఉక్కును కాపాడాలని జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, తాము పోరాడుతున్నామని విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్న సమయంలో నిర్మలా సీతారామన్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

విశాఖ ఉక్కులో కేంద్ర ఈక్విటీని ఉపసంహరించుకోవడం వల్ల పెద్దఎత్తున పెట్టుబడులు ప్రవేశిస్తాయని, విస్తరణకు, సామర్థ్యం పెంపునకు, అధునాతన టెక్నాలజీ ప్రవేశపెట్టడం, మెరుగైన యాజమాన్య పద్ధతులను అవలంబించ వచ్చని ఆమె చెప్పారు. దీనివల్ల ఉత్పాదకత పెరగడమే కాక.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అమ్మకం కోసం నియమ నిబంధనలను ఖరారు చేసే సమయంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు, వాటాదారులకు ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరిస్తామని.. అందుకు అనుగుణంగా వాటాల కొనుగోలు ఒప్పందంలో తగిన అంశాలను చేరుస్తామని స్పష్టం చేశారు.

Read More:

జై శ్రీరామ్‌కు పోటీగా జై హనుమాన్‌.. బీజేపీపైకి ఎమ్మెల్సీ కవిత వదిలిన బాణం.. మల్లును ముల్లుతోనే తీసే యత్నం

ఏప్రిల్‌ 1న గో మహాగర్జన.. కామారెడ్డికి చేరుకున్న యుగతులసి ఫౌండేషన్‌ ప్రచార రథం..

కంటతడి పెట్టిన స్పీకర్‌ పోచారం.. మహిళా దినోత్సవం వేడుకల్లో ఆ పాటతో శాసనసభాపతి భావోద్వేగం