AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu elections 2021 : తమిళనాట వేడెక్కిన రాజకీయం.. పార్టీల మధ్య కుదిరిన పొత్తులు.. సీట్ల సర్ధబాట్లపై సిగపట్లు..!

త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.

Tamilnadu elections 2021 : తమిళనాట వేడెక్కిన రాజకీయం.. పార్టీల మధ్య కుదిరిన పొత్తులు.. సీట్ల సర్ధబాట్లపై సిగపట్లు..!
Balaraju Goud
|

Updated on: Mar 09, 2021 | 11:57 AM

Share

Tamilnadu elections 2021 : త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో.. విజయం సాధించేందుకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బీజేపీతో సహా మిగతా పార్టీలు ఈ రెండు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాయి. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ 20 స్థానాల నుంచి పోటీకి సిద్ధమవుతోంది. అంతేకాదు, కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నిక సీటును కూడా బీజేపీకి కేటాయించింది అన్నాడీఎంకే. ఇక ఇదిలా ఉంటే, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేతో సీపీఐ పొత్తు పెట్టుకుంది. సీపీఐకి ఆరు స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది డీఎంకే.

మొన్నటి వరకు మేనిఫెస్టోల గోల..నిన్నటి నుంచి సీట్ల గోల..మేనిఫెస్టో వర్సెస్‌ సీట్ల పంపకంలా ఉంది తమిళనాడు రాజకీయం..అన్నాడీఎంకేలో ఓపీఎస్‌, ఈపీఎస్‌ మధ్య సీట్ల వార్ నడుస్తోంది..ఇక డీఎండీకేకు అన్నాడీఎంకే సీట్ల కొట్లాట కంటిన్యూ ఆవ్వుతుండంతో..ఇదే అదునుగా విజయ్‌కాంత్‌కు భారీ ఆఫర్‌ ప్రకటించేశారు కమల్‌హాసన్‌..మరోపక్క ఏఎంఎంకే అధినేత దినకరణ్‌కు ఆశాకిరణంలా మారారు ఓవైసీ.. ఏప్రిల్ 6న జరగనున్న తమిళ ఎన్నికల్లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా నడుస్తోంది. అభ్యర్ధుల ఎంపికపై అన్నాడీఎంకేలో రగడ కొనసాగుతోంది. ఓపీఎస్‌ ఈపీఎస్‌ రాజీకి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దినకరన్‌ వర్గంతో మజ్లిస్‌కు పొత్తు కుదిరింది. అభ్యర్ధుల ఎంపికపై అన్నాడీఎంకేలో అసంతృప్తి సెగలు రాజుకున్నాయి. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం మధ్య అభ్యర్ధుల ఎంపికపై అభిప్రాయబేధాలు వచ్చాయి. ఫైనల్‌ లిస్ట్‌లో పన్నీర్‌ సెల్వం వర్గానికి అత్యధిక సీట్లు లభించాయి. అయితే, దీనిపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఎన్నికల వేళ పళని పన్నీర్‌ల మధ్య అభిప్రాయబేధాలు రావడంతో అన్నాడీఎంకే సీనియర్లను కలవరపెడుతోంది. అభ్యర్థుల ఎంపికపై జరిగిన సమావేశానికి సీఎం పళనిస్వామి రాలేదు. ఈ పరిణామం పార్టీ అగ్రనేతల మధ్య వార్‌ను బయటపెట్టింది. సీనియర్ల జోక్యంతో ఇద్దరు నేతలు చర్చలు ప్రారంభించారు. పార్టీ కార్యాలయంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. ఇది ఇలా ఉంటే.. సీట్ల సర్దుబాటు ఎంతకీ తేలడం లేదు. సీట్ల కోసం సిగపట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అన్నాడీఎంకే, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చినా.. డీఎండీకేతో మాత్రం కొట్లాట కంటిన్యూ అవుతోంది.

ఇక, విజయ్‌కాంత్‌ నేతృత్వంలోని డీఎండీకే 40 సీట్లు కావాలని పట్టుబడుతోంది. కానీ 15 స్థానాలతో పాటు ఒక రాజ్యసభ ఇస్తామంటోంది అన్నాడీఎంకే. ఐతే కనీసం 25 సీట్లైనా కావాలని డిమాండ్‌ చేస్తున్నారు విజయ్‌కాంత్‌. ఇదే అదునుగా విజయ్‌కాంత్‌కు భారీ ఆఫర్‌ ప్రకటించేశారు కమల్‌హాసన్‌. తమతో దోస్తీ కట్టాలని ఆహ్వానించారు. కమల్‌ ఆఫర్‌తో ఆలోచనలో పడ్డ విజయ్‌కాంత్‌.. మూడో కూటమి వైపు చూస్తున్నారు. ఇవాళ మరోసారి పార్టీ ముఖ్య నేతలతో అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు.

మరోవైపు, తమిళనాడు మరో కొత్త పొత్తు తెరపైకి వచ్చింది. చిన్నమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పడంతో అయోమయంలో పడిపోయిన దినకరణ్‌కు ఆశాకిరణంగా ఓవైసీ దొరికారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ బరి లోకి దిగుతోంది. టీటీవీ దినకరన్‌ ఏఎంఎంకే పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకుంది. పొత్తువానియంబాడీ, కృష్ణగిరి, శంకరాపురం స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తుంది. ఈ నెల 12న చెన్నైలో అసదుద్దీన్‌ ఒవైసీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.

డీఎంకే మ్యానిఫెస్టోపై తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేశారు ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌. తమ పథకాలను డీఎంకే కాపీ కొట్టిందని ఆరోపించారు. మరోపక్క కమల్‌హాసన్‌ కూటమి ఇందియా జననాయక కట్చి, ఆలిండియా సమతున మఖల్‌ కట్చితో కలిసి పోటీ చేస్తోంది..154 స్థానాల్లో పోటీ చేయనున్న మక్కల్‌ నీది మయ్యం..ఇందియా జననాయక కట్చి పార్టీకి 40 స్థానాలు..ఆలిండియా సమతున మఖల్‌ కట్చికి 40 స్థానాలు కేటాయించింది..

ఇటు మేనిఫెస్టోల రగడతో పాటు ఉచిత పథకాలను మాత్రం అన్ని పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రకటిస్తున్నాయి. ఇక డీఎంకకే రాబోయే పదేళ్లలో ఏడాదికి పది లక్షల ఉద్యోగాలు, మంచినీరు, రేషన్‌కార్డు ఉన్న ప్రతి గృహిణికి నెలకు వెయ్యిరూపాయలు , విద్య, వైద్యం , స్కాలర్‌షిప్పుల రెట్టింపు వంటి పథకాలు ఆ పార్టీకి క్రేజ్ తెస్తున్నాయి..ఇప్పటికే మిగతా పార్టీలు కూడా పలు ఉచిత పథకాలు ప్రకటించి ఆకర్షించే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు…ఉచితాలతో తడిసి ముద్దవుతున్నారు తమిళనాడు ఓటర్లు..

Read Also… విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆందోళనల్లో ఉద్రిక్తత.. పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మికులు.. భయంతో పరుగులు తీసిన డైరెక్టర్‌