రెండు గంటలవరకే అందుబాటులో ఆక్సిజన్, కన్నీటి పర్యంతమైన ఢిల్లీ ఆసుపత్రి చీఫ్

ఢిల్లీలోని పలు ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నాయి. రోజురోజుకీ,  గంట గంటకీ ఆక్సిజన్  కొరతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి.

  • Umakanth Rao
  • Publish Date - 5:29 pm, Thu, 22 April 21
రెండు గంటలవరకే అందుబాటులో ఆక్సిజన్, కన్నీటి పర్యంతమైన ఢిల్లీ ఆసుపత్రి చీఫ్
Ceo Of Shanti Mukand Hospital Sunil Saggar

ఢిల్లీలోని పలు ఆసుపత్రులు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నాయి. రోజురోజుకీ,  గంట గంటకీ ఆక్సిజన్  కొరతతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. శాంతి ముకుంద్ అనే చిన్న ఆసుపత్రి చీఫ్ మీడియాతో మాట్లాడుతూ.. తమ నిస్సహాయత పట్ల తనకు తానే కుమిలిపోయారు. తమ హాస్పిటల్ లో ఆక్సిజన్  అయిపోవస్తోందని , మహా అయితే మరో రెండు గంటలు, లేదా అంతకన్నా ముందే అయిపోతుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. డిశ్చార్జి చేయాల్సిన రోగులను వెంటనే డిశ్చార్జి చేయాలని  డాక్టర్లను కోరామని తెలిపారు. ఎన్నడూ లేని ఈ సంక్షోభంపై మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతు గద్గదికమైంది. 110 మంది రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నామని, వీరిలో 12 మంది వెంటిలేటర్లపై ఉన్నారని ఆయన చెప్పారు. సుమారు 85 మంది రోగులకు కొంత సమయం మేరకు దీన్ని ఇవ్వగలుగుతున్నాం.. ఈ రోగుల్లో క్యాన్సర్ తో బాధ పడుతున్నవారు, గుండెజబ్బులు ఉన్నవారు కూడా ఉన్నారు.. చికిత్స  పొందుతున్న వీరికి ఆక్సిజన్ చాలా అవసరం.. ఏది ఏమైనా ఇది చాలా దురదృష్టకరమైన, దయనీయమైన పరిస్థితి అన్నారు.డాక్టర్లమైన తాము రోగులకు జీవితాన్ని ఇవ్వాల్సి ఉంటుందని,  కానీ కనీసం ఆక్సిజన్ అయినా ఇవ్వలేకపోతున్నామని, తమ కళ్ళ ముందే రోగులు మరణిస్తుంటే ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంటున్నామని అంటూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మరేదీ మాట్లాడలేకపోయారు.

ఢిల్లీ నగరంలో ఇంకా ఇలాంటి ఆసుపత్రులు చాలా ఉన్నాయి. అత్యవసర ప్రాతిపదికపై వీటికి తక్షణమే ఆక్సిజన్ సరఫరా చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఆసుపత్రుల పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టే దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ వంటి పరిస్థితి తలెత్తిందని వ్యాఖ్యానించడం, కేంద్రానికి తగిన సూచనలు చేయడం గమనార్హం. ఇక ఢిల్లీ హైకోర్టు అయితే కేంద్రాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ముందు చూపు లేదని ఆరోపించింది. రేపటిలోగా పరిస్థితిని చక్కదిద్దెందుకు చర్యలు చేపట్టాలని కోరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Modi : ఆక్సిజన్ సరఫరా, ఉత్పత్తికి వినూత్న మార్గాలు అన్వేషించండి… ఉన్నతస్థాయి సమావేశంలో ప్రధాని మోదీ ఉద్భోద

Megastar Chiranjeevi: కీలక నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులకు ఉచితంగా టీకా…