Huzurabad By Election: ఏం చేద్దాం.. ఎవర్ని నిలబెడదాం.. హుజూరాబాద్ అభ్యర్థి ఎంపిక దగ్గరే ఆగిపోయిన కాంగ్రెస్ కుస్తీ
తెలంగాణ కాంగ్రెస్ రూటే సపరేటు! హుజూరాబాద్ బైపోల్‌లో మిగతా పార్టీలన్నీ దూసుకుపోతుంటే.. ఆ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఆగిపోయింది. నెల రోజులుగా కుస్తీలు పడుతున్నా ఇప్పటికీ ఎటూ తేల్చలేదు.
తెలంగాణ కాంగ్రెస్ రూటే సపరేటు! హుజూరాబాద్ బైపోల్‌లో మిగతా పార్టీలన్నీ దూసుకుపోతుంటే.. ఆ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఎంపిక దగ్గరే ఆగిపోయింది. నెల రోజులుగా కుస్తీలు పడుతున్నా ఇప్పటికీ ఎటూ తేల్చలేదు. అదిగో..ఇదిగో అంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇంతకీ ఈ ఉపఎన్నికపై కాంగ్రెస్ ప్లానింగ్ ఏంటి? హుజూరాబాద్ ఉపఎన్నికపై ఏం చేద్దాం? ఎవర్ని నిలబెడదాం? అభ్యర్థి ఎవరైతే దీటుగా పోటీ ఇవ్వగలం? సామాజిక వర్గాలు..కులాల సమీకరణాలు..ఆ లెక్కలు.. ఈ లెక్కలు.. వరుస సమావేశాలు. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచి ఇదే తంతు. అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకుపడటం లేదు. ఈ అంశాలపై ఇప్పటికే పలుమార్లు చర్చించిన నేతలు.. మరోసారి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, PCC అధ్యక్షుడు రేవంత్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, CLP నేత భట్టి విక్రమార్క తో పాటు మాజీ PCCలు పలువురు కీలక నేతలు భేటీ అయ్యారు.
హుజూరాబాద్ బైపోల్‌లో ఎవరిని పోటీలోకి దింపుదాం? అనే అంశంపై కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య తర్జనభర్జన జరిగింది. ఈ భేటీలో పలువురు సీనియర్లు.. TRS గెలిచినా నష్టం లేదు కానీ బీజేపీ గెలిస్తే కష్టకాలమే అని చెప్పుకొచ్చారట. TRS గెలిస్తే వందకు ఒకటి చేరుతుంది… అదే BJP అయితే దుబ్బాక తరువాత మరొక విజయం చేకూరుతుంది. అదే జరిగితే ఆ పార్టీకి పట్టపగ్గాలు లేని ఉత్సాహం వస్తుంది. అంతేకాదు భవిష్యత్తు రాజకీయాలు కూడా TRS వర్సెస్ BJPగా మారుతాయని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడ్డారని తెలుస్తోంది.
కొత్త PCC చీఫ్‌గా రేవంత్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలంటే హుజురాబాద్ లో గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. లేదంటే ఏదో తప్పనిసరిగా పోటీ చేసినట్లు అవుతుందని సీనియర్లు సూచించినట్లు తెలుస్తోంది. అందుకే క్యాండిడేట్ ఎంపికపై ఇంకా ఏటూ తేల్చుకోలేక పోతున్నారట. ప్రస్తుతానికి ముగ్గురితో లిస్ట్‌ను షార్ట్ చేసింది. ఆ ముగ్గురిలో కొండా సురేఖ, కృష్ణారెడ్డి, దయాసాగర్ ఉన్నారు. ఎక్కువ మంది కొండా సురేఖ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపుతున్నారట. సామాజిక సమీకరణాలు కూడా కలిసివస్తాయని లెక్కలు వేస్తున్నారట.
మొత్తానికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది తేలేందుకు మరో 10 రోజులకుపైగానే సమయం పడుతుందని తెలుస్తోంది.. మరి ఈ సుదీర్ఘ కసరత్తు ఏ మేరకు ఫలిస్తుంది? హైకమాండ్ కొండా సురేఖకే ఓటేస్తుందా? లేక అనూహ్యంగా ఎవరినైనా తెరపైకి తేస్తారా అన్నది తేలాల్సి ఉంది..మొత్తానికి అభ్యర్థే ఇంకా ఖరారు కాకపోవడంతో హుజూరాబాద్ హస్తం నేతల్లో గందరగోళం నెలకొందట. మరి.. కాంగ్రెస్ తర్జనభర్జన ఎప్పుడు తేలేనో అని ప్రశ్నిస్తున్నారు హుజూరాబాద్ ఓటరు దేవుళ్ళు..
-అశోక్ భీమనపల్లి, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
ఇవి కూడా చదవండి: Driving License at Home: ఇంట్లో కూర్చొని మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను రెన్యూవల్ చేసుకోండి.. జస్ట్ ఇలా చేయండి.. అంతే..