AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh Elections: అత్యాచార బాధితులే అక్కడ అభ్యర్థులు.. ప్రియాంక కొత్త ఎత్తుగడ..

Uttar Pradesh Elections: బీజేపీ(BJP), సమాజ్‌వాదీ(SP) పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఉత్తర్‌ప్రదేశ్(UP-Elections) రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు

Uttar Pradesh Elections: అత్యాచార బాధితులే అక్కడ అభ్యర్థులు.. ప్రియాంక కొత్త ఎత్తుగడ..
Priyanka Gandhi
Mahatma Kodiyar
| Edited By: Janardhan Veluru|

Updated on: Jan 17, 2022 | 5:02 PM

Share

Uttar Pradesh Elections: బీజేపీ(BJP), సమాజ్‌వాదీ(SP) పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొన్న ఉత్తర్‌ప్రదేశ్(UP-Elections) రాష్ట్రంలో ఉనికి చాటుకునేందుకు కాంగ్రెస్(Congress) సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించి, మహిళా ఓటుబ్యాంకును హస్తగతం చేసుకోవాలన్న ప్రయత్నాల్లో ఉన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇప్పుడు యోగీ సర్కారు హయాంలో యూపీలో అలజడి సృష్టించిన ‘హత్రాస్’, ‘ఉన్నావ్’ వంటి అత్యాచార ఘటనల్లోని బాధిత కుటుంబాలను ఎన్నికల బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా మహిళాశక్తిని కూడగట్టేందుకు ప్రియాంక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కులానికొక రాజకీయ పార్టీ ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటర్లు ఇప్పటికే కులాలవారిగా, మతాలవారిగా చీలిపోయారు. అయితే అన్నివర్గాల్లోనూ సగానికి సగం ఉన్న మహిళా ఓటర్లకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది.

‘లడ్కీ హూఁ లడ్‌సక్తీ హూఁ’ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టి పోటీచేసిన కాంగ్రెస్‌ను రాహుల్ గాంధీ ముందుండి నడిపించారు. అఖిలేశ్ యాదవ్‌తో కలిసి ఒకే వేదికపై విస్తృతంగా ప్రచారం చేశారు. ఈసారి ఒంటరిగా పోటీచేస్తున్న కాంగ్రెస్, ప్రియాంక నేతృత్వంలో ముందుకు సాగుతోంది. పోలికల్లో ఇందిరా గాంధీని గుర్తుకుతెస్తున్న ప్రియాంక, మహిళా శక్తిని చాటేలా ‘లడ్కీ హూఁ లడ్‌సక్తీ హూఁ’ నినాదంతో ప్రచారపర్వం చేపట్టారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు హయాంలో అవమానాలు, అత్యాచారాలు, వేధింపులకు గురైన మహిళల జాబితాను ఆమె సిద్ధం చేస్తున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘హత్రాస్’, ‘ఉన్నావ్’ అత్యాచార బాధిత కుటుంబాలు కూడా ఉన్నాయి.

పోరాడేవారికే టికెట్లు.. అత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేవారికే తాను టికెట్లు ఇస్తానని ప్రియాంక గాంధీ ప్రకటించారు. తమ కోసం నిలబడాలనుకునే మహిళలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఏ ఎమ్మెల్యే, ఎంపీ చేతిలో అన్యాయానికి గురైనవారుంటే, ఎన్నికల బరిలో నిలిచి ఎదురొడ్డాలని ధైర్యం చెబుతున్నారు. ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అకృత్యాలను ప్రియాంక ఈ సందర్భంగా గుర్తుచేశారు. “మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. ఎమ్మెల్యేగా గెలవండి. అధికారం చేతుల్లోకి తీసుకుని పోరాడండి.” అంటూ వ్యాఖ్యానించారు.

జాబితాలో నలుగురు సిద్ధం? రాష్ట్రవ్యాప్తంగా బాధిత, పీడిత మహిళల జాబితాను తయారుచేస్తున్న కాంగ్రెస్, తొలుత సంచలనం సృష్టించిన ఘటనల్లో బాధిత కుటుంబాలను ఎన్నికల్లో పోటీచేసేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. వారిని చూసి మిగతా మహిళల్లోనూ ధైర్యం వస్తుందని భావిస్తోంది.

ఉన్నావ్ గ్యాంగ్‌రేప్: ఉన్నావ్ గ్యాంగ్‌రేప్ కేసులో బాధితురాలి తల్లి ఆశా సింగ్‌ను ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒప్పించినట్టు తెలుస్తోంది. ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2017లో ఉన్నావ్‌లోని బంగార్‌మావు స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న కుల్దీప్ సెంగార్‌, ఓ మైనర్ బాలికకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఇంటికి తీసుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దుశ్చర్యపై న్యాయపోరాటం చేసిన బాధితురాలికి మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు అండగా నిలిచాయి. అయితే కేసు విచారణ సమయంలోనే బాధిత బాలిక, ఆమె బంధువులు ప్రయాణిస్తున్న కారు అత్యంత అనుమానాస్పద స్థితిలో ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో బాధితురాలు, ఆమె సమీప బంధువు చనిపోయారు. ఈ ప్రమాదం కూడా సెంగార్ సృష్టించిందేనన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మొత్తంగా సెంగార్‌కు జీవిత ఖైదు పడింది. ఈ ఘటన యోగి ప్రభుత్వానికి మచ్చ తెచ్చిపెట్టింది. రాజకీయ దుమారం చెలరేగడంతో సెంగార్ సభ్యత్వాన్ని రద్దు చేశారు.

హత్రాస్ గ్యాంగ్‌రేప్: ఈ దళిత యువతి కుటుంబంలో ఒక మహిళకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ కుటుంబంలో ఏ మహిళకు టికెట్ వస్తుందో తేలాల్సి ఉంది. బాధితురాలి తల్లి లేదా సోదరుడి భార్యకు ఇచ్చే అవకాశం ఉంది. ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2020 సెప్టెంబర్ 14న దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసు హత్రాస్‌లో వెలుగులోకి వచ్చింది. నిందితులు అగ్రవర్ణ ఠాకూర్ వర్గానికి చెందినవారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 29న బాలిక మరణించడంతో విషయం వెలుగు చూసింది. కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండా పోలీసులు బాలికకు అంత్యక్రియలు చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ సామాజికవర్గానికి చెందినవారే కావడంతో, ఆయన నిందితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేశాయి. ఈ కేసులో 2020 అక్టోబర్ 11న సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 2020 డిసెంబర్ 18న చార్జిషీట్ దాఖలు చేసింది.

షాజహాన్‌పూర్‌ ఆశా వర్కర్‌: గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జిల్లాలో జరుగుతున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమావేశానికి తన సహచరులతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆశా వర్కర్ పూనం పాండేను పోలీసులు అడ్డుకుని, ఆమెను తీవ్రంగా గాయపరిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక వాద్రా గాంధీ వెంటనే ఈ వీడియోను ట్వీట్ చేసి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన గత ఏడాది నవంబర్‌లో జరిగింది.

మాజీ సమాజ్‌వాదీ నేత రీతూ సింగ్: లఖింపూర్ ఖేరీలోని పాస్‌ఘ్వాన్ బ్లాక్‌లో బ్లాక్ చీఫ్ పదవికి నామినేషన్ సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రీతూ సింగ్ చీర లాగి ఘోరంగా అవమానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనలో నిందితుడి బీజేపీతో సంబంధాలున్నాయని, బీజేపీ ఎంపీ రేఖా వర్మకు సమీప బంధువని తేలింది. మొత్తమ్మీద ఈ ఘటనలో పోలీస్‌స్టేషన్‌లో మొత్తం 6గురిని సీఎం యోగి సస్పెండ్ చేశారు. బాధితురాలు రీతూ ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు టికెట్ ఖరారు చేసినట్టేనని తెలుస్తోంది.

మహాత్మ కొడియార్, ఢిల్లీ బ్యూరో చీఫ్, టీవీ9 తెలుగు

Also read: Viral Video: మొసలితోనే పరాచకాలా… సరదా తీర్చిందిగా.. చావు తప్పి..

RuPay Debit Card: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రూపే కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డు.. రూ.10 లక్షల వరకు ప్రయోజనం!

Viral Video: ప్యాంట్‌పై బురద పడిందని.. రెచ్చిపోయిన లేడీ పోలీస్‌..