Chiru : నా పొలిటికల్ లైఫ్ లో గొప్ప స్నేహితుడు రఘువీరారెడ్డి, అంత దార్శినికుడ్ని చూడలేదు : చిరంజీవి
రఘువీరారెడ్డీ.. మీకు హ్యాట్సాఫ్.. మీలాంటి నాయకుణ్ని చూడలేదంటున్నారు చిరంజీవి. పరిచయమైన కొద్ది రోజుల్లోనే రఘువీరా రెడ్డితో మంచి అనుబంధం బలపడిందని..
Chiranjeevi on Raghuveera : రఘువీరారెడ్డీ.. మీకు హ్యాట్సాఫ్.. మీలాంటి నాయకుణ్ని చూడలేదంటున్నారు చిరంజీవి. పరిచయమైన కొద్ది రోజుల్లోనే రఘువీరా రెడ్డితో మంచి అనుబంధం బలపడిందని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అయిన రఘువీరారెడ్డిపై సినీ నటుడు చిరంజీవి ప్రత్యేక వీడియో సందేశంలో ప్రశంసలు కురిపించారు. అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో రఘువీరా నేతృత్వంలో కొత్తగా నిర్మిస్తున్న చారిత్రక దేవాలయాలకు ఇవాళ ప్రారంభోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రఘువీరాకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.
తన రాజకీయ జీవితంలో గొప్ప స్నేహితుడు రఘువీరా అని చిరు చెప్పారు. కరువుసీమకు నీళ్లు ఇవ్వాలనే కథాంశంతో తాను ‘ఇంద్ర’ సినిమాను తీశానని… ఆ సినిమా ప్రేరణతోనే రఘువీరా కరువుసీమకు నీళ్లు ఇచ్చారని, ఇది ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనమని చిరంజీవి ప్రశంసించారు. అంతేకాదు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడం, ఆ కార్యక్రమానికి తాను హాజరుకావడం తన భాగ్యమని చిరంజీవి అప్పటి తీపిగుర్తుల్ని నెమరువేసుకున్నారు.
తాను మళ్లీ సినిమాలు చేస్తూ నటుడిగా కొనసాగుతుంటే… రఘువీరా రైతుగా మారారని చెప్పారు. రఘువీరా ఇప్పుడు వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాలను పునర్నిర్మిస్తున్నారని, కొత్త ఆలయాలను నిర్మిస్తున్నారని కీర్తించారు . రఘువీరాకు భగవంతుని ఆశీస్సులు, ప్రజల సహకారం ఎప్పుడూ ఉండాలని మెగాస్టార్ ఆకాంక్షించారు.