ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చేనా?

ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చేనా?

డిసెంబర్ 9 సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు అధికార, విపక్షాల రచ్చ రంబోలాతో వాడీ వేడీగా జరగబోతున్నాయా? జరుగుతున్న పరిణామాలు.. అధికార, విపక్షాల నేతల దూకుడు, వాదనలు, ప్రతివాదనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దానికి తోడు చంద్రబాబు, నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీల ట్వీట్లు.. సోషల్ మీడియా వేదికగా లేవనెత్తుతున్న పాయింట్లు ఏపీ అసెంబ్లీలో వాడీ వేడీ వాదనలు ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయి. గత పదిహేను రోజులుగా ఏపీ రాజధాని అమరావతి అంశం […]

Rajesh Sharma

| Edited By: Srinu Perla

Dec 07, 2019 | 1:36 PM

డిసెంబర్ 9 సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు అధికార, విపక్షాల రచ్చ రంబోలాతో వాడీ వేడీగా జరగబోతున్నాయా? జరుగుతున్న పరిణామాలు.. అధికార, విపక్షాల నేతల దూకుడు, వాదనలు, ప్రతివాదనలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. దానికి తోడు చంద్రబాబు, నారా లోకేశ్, తెలుగుదేశం పార్టీల ట్వీట్లు.. సోషల్ మీడియా వేదికగా లేవనెత్తుతున్న పాయింట్లు ఏపీ అసెంబ్లీలో వాడీ వేడీ వాదనలు ఖాయమనే సంకేతాలను ఇస్తున్నాయి.

గత పదిహేను రోజులుగా ఏపీ రాజధాని అమరావతి అంశం రాష్ట్రంలోనే కాకుండా ఇరు తెలుగురాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నిర్వహించిన రాజధాని యాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చంద్రబాబును గో బ్యాక్ అంటూ ఓ వర్గం.. వెల్‌కమ్ అంటూ మరో వర్గం… చంద్రబాబు అమరావతి యాత్రను ఆద్యంతం రక్తి కట్టించాయి.

ఆ తర్వాత ఓ వైపు టిడిపి మరోవైపు వైసీపీ రాజధాని అంశంపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాయి. ఎవరి వాదనను వారు గట్టిగానే వినిపించారు. అమరావతిలో అసలు నిర్మాణాలే జరగలేదన్న వైసీపీ వాదనతో చంద్రబాబు సహా టిడిపి నేతలు గట్టిగానే విభేదిస్తున్నారు. అందుకు అనుకూలంగా ఓ వీడియో ప్రజెంటేషన్‌ను టిడిపి నేతలు అఖిలపక్ష భేటీలో ప్రదర్శించారు.

మరోవైపు రాజధానిలో కొన్ని నిర్మాణాలున్నా.. వాటిలో అంతులేని అవినీతి దాగుందని వైసీపీ వాదిస్తోంది. తమ వాదనకు అనుకూలంగా వైసీపీ నేతలు గణాంకాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కర్నూలు జిల్లా యాత్రకు వెళితే.. అక్కడ హైకోర్టు సాధన సమితి వర్గాలు నినాదాలతో హోరెత్తించాయి.

అమరావతిలో చంద్రబాబు అనుకూల, ప్రతికూల రైతులు రచ్చ చేస్తే.. కర్నూలులో హైకోర్టు సాధన సమితి హల్‌చల్ చేసింది. ఈ నేపథ్యంలో పరిణామాలు చూస్తుంటే ఏపీ అసెంబ్లీ వేదికగా అధికార, విపక్షాల మధ్య అమరావతి అంశం కాక రేపే పరిస్థితి కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే చంద్రబాబు, తెలుగుదేశం పార్టీలు తమ తమ ట్విట్టర్ హ్యాండిళ్ళలో జోరుగానే ట్వీట్లు పోస్టు చేస్తున్నాయి.

సో.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఏదైనా అసెంబ్లీ సమావేశాల్లో రాజధాని అంశమే ప్రకంపనలు సృష్టించే పరిస్థితి కనిపిస్తోంది. దానికి అనుగుణంగా వైసీపీ, టిడిపి పార్టీలు లెక్కలు, వీడియోలతో అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu