Telangana New zones: తెలంగాణలో కొత్త జోనల్ వ్యవస్థ.. మార్పులు, చేర్పులకు కేంద్రం ఆమోదముద్ర.. రాష్ట్ర సర్కార్ జీవో విడుదల
తెలంగాణ జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది.
Telangana New Zonal system: తెలంగాణ జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆమోదానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు చేసింది సీఎం కేసీఆర్ సర్కార్. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
నారాయణపేట జిల్లాకు జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లాకు కాళేశ్వరం జోన్‌లో చోటు కల్పించారు. స్థానికంగా ఉన్న విజ్ఞప్తుల మేరకు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్‌కు మార్పు చేశారు. ఇక నుంచి అందుకు అనుగుణంగానే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు స్థానికతను ఖరారు చేస్తారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
కొత్తగా అమలులోకి వచ్చిన జోనల్ వ్యవస్థ ద్వారా పూర్తిగా తెలంగాణ ప్రజలే ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకమయ్యే అవకాశం కల్పించారు. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేస్తారు. గ్రూప్-1 పోస్టులు కూడా మల్టీ జోనల్ స్థాయిలోనే నియమిస్తారు. దీనివల్ల పూర్తిగా తెలంగాణ ఉద్యోగాలన్నీ తెలంగాణ నిరుద్యోగులకే లభిస్తాయి. జిల్లాస్థాయి పోస్టుల్లో కూడా గ్రామీణ ప్రాంత జిల్లాల యువతకు ప్రాధాన్యం లభించే అవకాశం కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిగింది. మల్టీ జోనల్ పోస్టులు కూడా ఆయా ప్రాంతాల ప్రజలకే ఎక్కువగా లభిస్తాయి. సీఎం కేసీఆర్ ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీచేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలన్నీ కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే భర్తీ అవుతాయి.