నా ఫోన్ సంభాషణలను ట్యాప్ చేస్తున్నారు, బీజేపీపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపాటు

తన ఫోన్ సంభాషణలను బీజేపీ నేతలు ట్యాప్ చేస్తున్నారని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.   తమ పార్టీకి చెందిన నేత ఒకరితో తాను జరిపిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ను బీజేపీ విడుదల చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Umakanth Rao
  • Publish Date - 11:30 am, Sun, 18 April 21
నా ఫోన్ సంభాషణలను ట్యాప్ చేస్తున్నారు, బీజేపీపై బెంగాల్ సీఎం  మమతా బెనర్జీ మండిపాటు
Mamata Banerjee

తన ఫోన్ సంభాషణలను బీజేపీ నేతలు ట్యాప్ చేస్తున్నారని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.   తమ పార్టీకి చెందిన నేత ఒకరితో తాను జరిపిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ను బీజేపీ విడుదల చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్బా బర్ధమాన్ జిల్లాలో దీదీ నిన్న టీఎంసీ నాయకుడొకరితో ఫోన్ లో మాట్లాడారు. బీజేపీ నిర్వాకంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశిస్తానని ఆమె చెప్పారు. కూచ్ బిహార్ లో జరిగిన కాల్పుల ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలతో ర్యాలీ నిర్వహించాలని సితాల్ కుచ్చి నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేతతో మమత ఫోన్ లో ఆదేశించారంటూ ఈ ఆడియో క్లిప్ బయటపెట్టింది. అయితే ఈ ఆరోపణను మమత ఖండించారు. తానేమీ ఈ మేరకు ఎలాంటి సూచనా చేయలేదని ఆమె అన్నారు. దీన్ని బోగస్ గా టీఎంసీ దుయ్యబట్టింది. నా ఫోన్ సంభాషణలను భారతీయ జనతా పార్టీ ట్యాప్ చేస్తోందని, ఇది పెద్ద స్కామ్ అని, దీనిపై సీఐడీ విచారణకు ఆదేశిస్తానని మమతా బెనర్జీ తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ కుట్ర అని అన్నారు. బీజేపీ దీన్ని పబ్లిసిటీ చేస్తోందని, అయితే తన ఫోన్ ను  ఎవరు ట్యాప్ చేస్తున్నారో సీఐడీ ఇన్వెస్టిగేషన్ లో తేలుతుందని ఆమె చెప్పారు.  వారిని వదిలిపెట్టను అని ఆమె హెచ్ఛరించారు.

కూచ్ బీహార్ జిల్లాలో ఈ నెల 10 న ఓ పోలింగ్ కేంద్రం బయట సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్స్ దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. అయితే స్థానికులు కొందరు తమపై దాడి చేయడంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని ఈ  దళాలు అంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా కేంద్ర దళాలు తమ ఏజంట్లను నియమించుకుని ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నాయని  మమతా బెనర్జీ ఆరోపించారు. తమ ప్రభుత్వం మూడోసారి మళ్ళీ అధికారం చేపట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కి బెదిరింపులు, ఫ్లోరిడాకు చెందిన నర్సు అరెస్ట్

ఐఏఎస్ చదివే యువకుడు అకస్మాత్తుగా సూసైడ్.. విచారణలో పోలీసులకు మైండ్ బ్లాంక్.. వామ్మో ఏం స్కెచ్