ప్రచారంతో హోరెత్తించినా, పోలింగ్ సమయాన్ని ఏకంగా రెండుగంటలు పెంచినా…ఓటింగ్ శాతం మాత్రం అంతే..!
Tirupati By Election: అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ప్రచారంతో హోరెత్తించినా, పోలింగ్ సమయాన్ని ఏకంగా రెండుగంటలు పెంచినా.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 65శాతం..
అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా, ప్రచారంతో హోరెత్తించినా, పోలింగ్ సమయాన్ని ఏకంగా రెండుగంటలు పెంచినా.. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 65శాతం దాటలేదు పోలింగ్. ఉదయం 7నుంచి రాత్రి 7గంటలదాకా ఓటేసే అవకాశం కల్పించటంతో.. రికార్డ్‌స్థాయి పోలింగ్ నమోదవుతుందనుకున్నా.. ఇప్పటిదాకా ఉన్న సమాచారాన్ని బట్టి 64నుంచి 65శాతంలోపే ఓటింగ్‌శాతం ఉంది. 2019 ఎన్నికల్లో దాదాపు 79శాతం పోలింగ్ నమోదైంది. దీంతో గతంకంటే 10నుంచి 14శాతం తక్కువ పోలింగ్ నమోదు కావటంతో.. మెజారిటీల అంచనాలు తలకిందులయ్యేలా ఉన్నాయి.
సిట్టింగ్‌సీటుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ కనీసం 4 లక్షలపైనే మెజారిటీ రావాలని టార్గెట్ పెట్టుకుంది. ప్రచారసభల్లోనూ తిరుగులేని మెజారిటీ వస్తుందని ధీమాగా చెప్పుకుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావుకు 2లక్షల 28వేల పై చిలుకు మెజారిటీ వచ్చింది. దానికి రెట్టింపు మెజారిటీని వైసీపీ ఈసారి టార్గెట్‌గా పెట్టుకున్నా..పోలింగ్‌శాతం బాగా తగ్గేలా ఉండటంతో రికార్డ్‌స్థాయి మెజారిటీ అసాధ్యమనే చర్చ మొదలైంది. పోలింగే తగ్గటంతో.. అనుకున్న మెజారిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదంటున్నారు.
2019 ఎన్నికల్లో వైసీపీ 55.03 శాతం ఓట్లు సాధించింది. అప్పట్లో రెండోస్థానంలో నిలిచిన టీడీపీకి 37.65శాతం ఓట్లు వచ్చాయి. అప్పట్లో మిగిలినపార్టీలు రెండుశాతం లోపు ఓట్లకే పరిమితమయ్యాయి. ఈ ఉప ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ నడిచింది. వైసీపీ, టీడీపీలతో పాటు జనసేన మద్దతుతో బీజేపీ కూడా బరిలో నిలిచింది. దీంతో మూడు పార్టీల మధ్య ఓట్ల చీలికకు తోడు…పోలింగ్ పర్సంటేజీ తగ్గటంతో ఎవరు గెలిచినా మెజారిటీ ఆరంకెలు అందుకోవడం సాధ్యమా అన్నదే చాలామందికొస్తున్న డౌట్. 3లక్షలు నాలుగు లక్షలు కాదుకదా.. లక్ష వస్తే గొప్పన్నట్లుంది పోలింగ్ ట్రెండ్.
ఇవి కూడా చదవండి: