హెల్త్ కేర్ వర్కర్లకు ‘భారత రత్న’ పురస్కారం ఇవ్వాలి.. ప్రధాని మోదీ కి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లేఖ
దేశంలో కోవిద్-19 తో పోరాటం చేసిన హెల్త్ కేర్ వర్కర్లకు అత్యున్నత 'భారతరత్న' పురస్కారాన్ని ప్రకటించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు.
దేశంలో కోవిద్-19 తో పోరాటం చేసిన హెల్త్ కేర్ వర్కర్లకు అత్యున్నత ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రకటించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు. ‘ఇండియన్ డాక్టర్’ అని ఆయన తన ట్విట్టర్లో పేర్కొంటూ..ఇలా తాను అన్నంత మాత్రాన ఒక డాక్టర్ మాత్రమే కాదని.. డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని అన్నారు. తమ ప్రాణాలను, తమ కుటుంబాలను కూడా రోజుల తరబడి పట్టించుకోకుండా కోవిద్ రోగులకు చికిత్సలు చేసిన వీరు ఈ పురస్కారం పొందడానికి అర్హులని పేర్కొన్నారు. దీంతో దేశమంతా హర్షిస్తుందన్నారు. అవసరమైతే నిబంధనలను కూడా మార్చి వీరికి ఈ అవార్డు ప్రకటించాలన్నారు. లక్షలాది మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది రోగులకు నిరంతరంగా సేవలు చేస్తూ వచ్చారు..వారిని గౌరవించడానికి ఇదే తగిన ప్రామాణికం అని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. రూల్స్ అంగీకరించకపోతే వాటిని మార్చండి..వీరికి భారతరత్న ఇచ్చినందువల్ల దేశంలోని ప్రతి పౌరుడూ సంతోషిస్తాడు అని ఆయన పేర్కొన్నారు.
నేషనల్ డాక్టర్స్ డే నాడు ప్రధాని మోదీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. వైద్య సిబ్బంది సేవలను కొనియాడారు. అభివృద్ధి చెందిన ఇతర దేశాలకన్నా మన దేశ వైద్య సిబ్బంది లక్షలాది కోవిద్ రోగుల ప్రాణాలను కాపాడారని ప్రశంసించారు. వీరి సేవలు వెలకట్టలేనివన్నారు. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఈ అభ్యర్థన చేశారు. అటు-సెకండ్ కోవిద్ వేవ్ లో దేశవ్యాప్తంగా 798 మంది డాక్టర్లు మరణించారని.. తొలి వేవ్ లో 736 మంది మృతి చెందారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. వీరిలో ఢిల్లీలో మృతి చెందినవారే ఎక్కువ మంది ఉన్నట్టు పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: యూపీ ఎన్నికల్లో ఆప్, ఎస్పీల పొత్తు ..? సంజయ్ సింగ్ ని కలిసిన అఖిలేష్ యాదవ్.. ఇప్పటినుంచే చేతులు కలుపుతున్న నేతలు