ఆ విషయంలో బీఏసీ బేటీలో కీలక నిర్ణయం.. ఆ నిర్ణయంపై ప్రతిపక్షాల అభ్యంతరం..

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి బడ్జెట్‌ సమావేశాలను కుదించాలని శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ..

ఆ విషయంలో బీఏసీ బేటీలో కీలక నిర్ణయం.. ఆ నిర్ణయంపై ప్రతిపక్షాల అభ్యంతరం..
Follow us

|

Updated on: Mar 16, 2021 | 8:30 AM

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ఈసారి బడ్జెట్‌ సమావేశాలను కుదించాలని శాసనసభ బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాలు ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈ నెల 18న సభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, 20 నుంచి 25 వరకు బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపై చర్చ పూర్తిచేసి 26న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాలన్న నిర్ణయం జరిగింది. మధ్యలో సెలవు దినాలు పోగా.. మొత్తం పది రోజులపాటు బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి.

అసెంబ్లీ కమిటీ హాల్లో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైంది. నేడు సభలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దివంగత మాజీ ఎమ్మెల్యేలు గుండా మల్లేశ్‌, నాయిని నర్సింహారెడ్డి, కట్టా వెంకటనర్సయ్య, కమతం రాంరెడ్డి, కె.మధుసూధన్‌రావు, దుగ్యాల శ్రీనివాసరావు, చెంగల్‌ బాగన్న, కె.వీరారెడ్డిల మరణానికి సంతాపం తెలుపుతూ తీర్మానంపై సభ్యులు మాట్లాడనున్నారు. 17న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సీఎం కేసీఆర్‌ సమాధానం ఉంటాయి.

ప్రభుత్వం 18న ఉదయం 11.30 గంటలకు 2021-22 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. 19వ తేదీ విరామం ఇచ్చి.. 20 నుంచి బడ్జెట్‌పై సాధారణ చర్చను చేపడతారు. 21న ఆదివారం విరామం ఇవ్వనున్నారు. 22న బడ్జెట్‌పై సాధారణ చర్చ, ఆర్థిక మంత్రి సమాధానం ఉంటుంది. 23న వివిధ శాఖల పద్దులపై చర్చ ప్రారంభమై.. 25న ముగియనుంది. 26న ద్రవ్యవినిమయ బిల్లులను ఆమోదించి సభను నిరవధికంగా వాయిదా వేస్తారు.

అయితే బడ్జెట్‌పై కేవలం ఆరురోజుల పాటే చర్చించడం సరిగా లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్నింటికీ కలిపి కనీసం 29 రోజుల పాటు సభను నిర్వహించేవారని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ ఎన్ని గంటలపాటైనా మాట్లాడేందుకు సమయం ఇస్తామని చెప్పారు. అయితే ‘‘ నేను పనిదినాల గురించి మాట్లాడుతుంటే.. మీరు గంటల గురించి మాట్లాడుతున్నారు. సభలో ఎవరూ శాశ్వతం కాదు. మీరు ఆరు రోజులకు కుదిస్తే.. రేపు వచ్చేవాళ్లు రెండు రోజులకు కుదిస్తారు’’ అని భట్టి వ్యాఖ్యానించారు.

స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ సభ్యులందరూ చర్చలో పాల్గొనేలా పని గంటలు పెంచి, సంఖ్యకు అనుగుణంగా పార్టీలకు మాట్లాడే సమయం కేటాయిస్తామన్నారు. కాగా, కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ సభలో తీర్మానం చేయాలని భట్టి విక్రమార్క కోరారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తదితర అంశాలపైనా చర్చించాలన్నారు. అయితే ఏయే అంశాలపై చర్చించాలో జాబితా ఇవ్వాలని, ప్రాధాన్యాలను బట్టి స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు.

Read More:

వారు ప్రచారం చేసిన ప్రతిచోటా ఆ పార్టీ ఒడిపోయింది.. ఇక వారి చరిత్ర ముగిసింది -మంత్రి అప్పలరాజు