వారు ప్రచారం చేసిన ప్రతిచోటా ఆ పార్టీ ఒడిపోయింది.. ఇక వారి చరిత్ర ముగిసింది -మంత్రి అప్పలరాజు
మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా దేశ రాజకీయాల్లో హీరోగా సీఎం వైయస్ జగన్ అవతరించారని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఎన్నికలు జరిగిన ఏ సందర్భంలోనైనా..
మున్సిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా దేశ రాజకీయాల్లో హీరోగా సీఎం వైయస్ జగన్ అవతరించారని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఎన్నికలు జరిగిన ఏ సందర్భంలోనైనా వైయస్‌ఆర్‌సీపీ విజయం సాధిస్తోందని అయన చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు అవుతోంది. రిఫరెండమ్‌గా భావించే ఈ ఎన్నికల్లో ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారని అప్పలరాజు అన్నారు. సీఎం చిత్తశుద్ధితో, నిజాయితీతో పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పారు..
మంత్రి ఇంకా ఏమన్నారంటే ప్రతిపక్షాలు, చంద్రబాబు ఎన్నో అవాంతరాలు సృష్టించారు. కులాలు, మతాలు, ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టారు. చివరికి దేవుళ్లను కూడా రాజకీయం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రాంతీయ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ వరకు ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ తరుపున పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. ప్రచారమూ చేయలేదని మంత్రి అన్నారు. దేశంలో ఎప్పుడూ ఎక్కడా ఇలా జరగలేదు. సీఎం పరిపాలన నుంచి పక్కకు జరగలేదు. తన పరిపాలన చూసి ప్రజలు స్వచ్ఛందంగా ఓటేయాలని సీఎం నమ్మారు. ఇచ్ఛాపురం నుంచి అనంతపురం వరకు వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే గెలిచింది. అందుకే దేశ రాజకీయ చరిత్రలో సీఎం వైయస్ జగన్‌ను హీరోగా అభివర్ణిస్తున్నానని అప్పలరాజు అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి 151 సీట్లతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజా తీర్పును జీర్ణించుకోలేని టీడీపీ నేతలు విమర్శలు చేశారు. గాలివాటంతో వచ్చామని దుయ్యబట్టారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి ప్రజా తీర్పు ఇచ్చారు. వైయస్‌ఆర్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. మొక్కవోని విశ్వాసంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కరోనా సమస్యలున్నా సంక్షేమమే ధ్యేయంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సీఎం ముందుకు వెళ్లారు. దీన్ని ప్రజలు గుర్తించారని ఈ ఎన్నికల ఫలితాల ద్వారా తేలిందని మంత్రి చెప్పారు.
సంక్షేమం తప్ప అభివృద్ధిని సీఎం శ్రీ వైయస్ జగన్ పట్టించుకోవటం లేదని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని కొలిచే ప్రమాణాలు ఉన్నాయి. అభివృద్ధికి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అని ఐక్యరాజ్యసమితి కొలమానం ఉంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. జీవితకాల పరిమితి, విద్యావకాశాలు, తలసరి ఆదాయం అనేవి హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ ప్రమాణాలుగా ఉన్నాయి. వీటిని బట్టి అభివృద్ధి జరిగిందా? లేదా అంశాలను బేరీజు వేసుకుంటారని అప్పలరాజు అన్నారు.
రెండేళ్లుగా సీఎం వైయస్ జగన్ చేస్తున్న పనులు గమనిస్తే అందరికీ ఈ విషయాలు అర్థమవుతాయి. విద్యావ్యవస్థపైన వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఈ స్థాయిలో విద్యపై ఖర్చు చేసిన దాఖలాలు లేవు. ప్రిస్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. విద్య కోసం ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సంక్షేమం అనడం కన్నా సంస్కరణలుగా చెప్పవచ్చు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు–నేడులో స్కూళ్లు, ఆస్పత్రుల్లో మార్పులు, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్, మధ్యాహ్న భోజనం, జగనన్న విద్యా కానుక, వైయస్సార్ ప్రిప్రైమరీ స్కూల్స్ వంటి వాటి రూపంలో పలు సంస్కరణలు రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి చెప్పారు.
వైద్యం, ఆరోగ్యం విషయానికి వస్తే.. గతంలో ప్రభుత్వ ఆరోగ్య ఆసుపత్రులకు వెళ్లి వైద్యం పొందే అవకాశాలు ఉండేవి కావు. కోవిడ్ సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కొని ఎన్నో అభివృద్ధి చెందిన దేశాలు కంటే మెరుగ్గా వైద్యం అందించాం. నాడు–నేడు కింద పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులను అభివృద్ధి చేస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. 2434 రోగాలను ఆరోగ్యశ్రీ పరిధిలో సేవలు అందిస్తున్నాం. గతంలో ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆసుపత్రుల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను కూడా మెరుగుపరుచుకున్నాం. జనాభా ప్రాతిపదికన నర్సులను నియమించుకున్నాం. ఈ విషయంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్ వన్. అంతే కాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి వైద్య, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసుకుంటున్నాం. ఇవన్నీ దేశానికి దిక్సూచి లాంటివి. వీటిని గమనించిన ప్రజలు ఎన్నికల్లో తమ తీర్పును ఇచ్చారని మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు.
రాష్ట్రంలో తలసరి ఆదాయం విషయానికి వస్తే.. గ్రామీణ వాణిజ్యం కోసం విప్లవాత్మక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్, మిల్క్ కలెక్షన్ సెంటర్లు వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. తద్వారా అభివృద్ధి చెందిన దేశాలతో రాష్ట్రం పోటీ పడుతోంది. సెక్రటేరియట్ వ్యవస్థ, ఆర్బీకేల ద్వారా ప్రజలకు ప్రభుత్వం మేలు చేస్తోంది. గతంలో వ్యవసాయం చేయటం దండగ అనే పరిస్థితులు ఉంటే.. ఇప్పుడు ప్రతి రైతుకు లాభం చేకూరేలా సీఎం శ్రీ వైయస్ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. విత్తనం నాటిన నాటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసేలా జనతా బజార్లు ఏర్పాటు చేయనున్నాం. వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చివేయబోతున్నామని మంత్రి జోస్యం చెప్పారు.
గతంలో పంచాయితీ ఎన్నికల్లోలా.. చంద్రబాబు కల్లబొల్లి కబుర్లు చెప్పటానికి వీల్లేదు. అప్పుడు చంద్రబాబు 44% టీడీపీకి వచ్చాయని కబుర్లు చెప్పారు. ఇప్పుడు చెప్పరెందుకు? హైదరాబాద్ వెళ్లి సేద తీరుతున్నారు. టూరిస్టుల్లా రాష్ట్రానికి వచ్చి వెళ్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా వికేంద్రీకరణకు 95% ప్రజలు అంగీకరించారని రుజువైంది. విశాఖ, గుంటూరు, విజయవాడ కార్పొరేషన్‌లు గెలవటం ద్వారా ప్రజలు వికేంద్రీకరణకు మద్దతు ఇచ్చారు. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడరు. అవసాన దశలో ఉన్న వ్యక్తులే ఇలాంటి మాటలు మాట్లాడతారు. లోకేశ్ రాజకీయాలకు పనికిరారు. ఇక, రాష్ట్రం నుంచి టీడీపీ కనుమరుగైపోయిందని భావించాలి. లోకేశ్ ఎక్కడైతే ప్రచారం చేశాడో అక్కడంతా టీడీపీ ఓడిపోయిందని అప్పల రాజు ఎద్దేవా చేశారు.
సీఎం వైయస్ జగన్ స్థిరమైన లక్ష్యంతో పని చేస్తున్నారు. అందుకే ఆయన రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. సీఎం వైయస్ జగన్ సారథ్యంలో పని చేయడం గౌరవంగా భావిస్తున్నామని మంత్రి అప్పలరాజు అన్నారు.