సొంత జిల్లాకు చంద్రబాబు..3 రోజుల మకాం అందుకేనా ?

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నవంబర్ 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళుతున్నారు. సొంత జిల్లాకు వెళ్ళడం మామూలు అంశమే అయినా.. ఈసారి ఏకంగా మూడు రోజుల పాటు అక్కడ మకాం వేయడంపై చర్చనీయాంశమైంది. జిల్లాకు చెందిన నేతలకు సమాచారమివ్వడం సర్వసాధారణమే కానీ ఈసారి అనూహ్యంగా పొరుగు జిల్లా అయిన నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేయమని ఆదేశించడం.. […]

సొంత జిల్లాకు చంద్రబాబు..3 రోజుల మకాం అందుకేనా ?
Follow us

| Edited By:

Updated on: Nov 02, 2019 | 7:18 PM

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నవంబర్ 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సొంత జిల్లా చిత్తూరు పర్యటనకు వెళుతున్నారు. సొంత జిల్లాకు వెళ్ళడం మామూలు అంశమే అయినా.. ఈసారి ఏకంగా మూడు రోజుల పాటు అక్కడ మకాం వేయడంపై చర్చనీయాంశమైంది. జిల్లాకు చెందిన నేతలకు సమాచారమివ్వడం సర్వసాధారణమే కానీ ఈసారి అనూహ్యంగా పొరుగు జిల్లా అయిన నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేయమని ఆదేశించడం.. సభా ఏర్పాట్ల బాధ్యతను కూడా ఆయన భుజస్కంధాలపై మోపడం వెనుక వ్యూహం ఏంటా అన్నది జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది.
ఈనెల 6వ తేదీ నుంచి మూడు రోజుల పాటు చంద్రబాబు రానున్న నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అమర్‌నాథ్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డికి కూడా ఇవే ఆదేశాలు చంద్రబాబు కార్యాలయం నుంచి వెళ్ళాయి. దాంతో సోమిరెడ్డి హుటాహుటిన తిరుపతికి పయనమయ్యారు. వెళ్ళిన వెంటనే చంద్రగిరి దగ్గరి ఐతేపల్లి వద్ద సభ నిర్వహించాలని తలపెట్టి.. స్థలాన్ని కూడా సందర్శించారు.
ఏపీలో నెలకొన్న ఇసుక సంక్షోభంతోపాటు శాంతి భద్రతల అంశం ఆధారంగా సభ ఎజెండాను ఖరారు చేసినట్లు సమాచారం. దాంతో పాటు ప్రజలతోను, పార్టీ శ్రేణులతోను చంద్రబాబు సమావేశాలు నిర్వహిస్తారని సోమిరెడ్డి తెలిపారు. రాయల సీమ జిల్లాల్లో టిడిపి పరిస్థితి అతి దారుణంగా తయారైన నేపథ్యంలో ముందుగా సొంత జిల్లాల్లో పరిస్థితిని చక్కదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగానే మూడు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో మకాం వేసి.. పార్టీ వర్గాలలో ఉత్సాహం నింపడంతోపాటు..వారికి భరోసా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి జిల్లా ఇంఛార్జి బాధ్యతలు అప్పగిస్తారని అందుకోసమే మూడు రోజుల పాటు జిల్లాలో మకాం వేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి.