హస్తినలో అరవిందుని పాట్లు.. టార్గెట్ మహిళలేనా..?

ఎన్నికలొస్తున్నాయంటే చాలు.. రాజకీయ నాయకులు ఓటర్లకు తాయిలాలు ప్రకటించడం ఆనవాయితీనే.. అయితే అధికారంలో ఉండి.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ఇక ఆ ప్రజల నుంచి మన్నలను పొందేందుకు ఆ ప్రభుత్వాలు చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజాసమస్యలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. మేనిఫెస్టోలను సిద్ధం చేసుకుంటాయి. అయితే ఇదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే.. అధికారం చేపట్టి ఏళ్లు గడిచినా పట్టించుకోని […]

హస్తినలో అరవిందుని పాట్లు.. టార్గెట్ మహిళలేనా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 31, 2019 | 4:13 PM

ఎన్నికలొస్తున్నాయంటే చాలు.. రాజకీయ నాయకులు ఓటర్లకు తాయిలాలు ప్రకటించడం ఆనవాయితీనే.. అయితే అధికారంలో ఉండి.. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే.. ఇక ఆ ప్రజల నుంచి మన్నలను పొందేందుకు ఆ ప్రభుత్వాలు చేసే జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజాసమస్యలను దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. మేనిఫెస్టోలను సిద్ధం చేసుకుంటాయి. అయితే ఇదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ అయితే.. అధికారం చేపట్టి ఏళ్లు గడిచినా పట్టించుకోని ప్రజా సమస్యలపై ఒక్కసారిగా దృష్టి సారిస్తారు. అంతేకాదు.. ప్రభుత్వానికి భారమైనా సరే.. కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా మన దేశంలో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. ప్రజలను తనవైపు తిప్పుకునేందుకు కేజ్రీవాల్ చేస్తున్న జిమ్మిక్కులు అన్నీ ఇన్నీ కావు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రజలకు వరాల జల్లు కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలను ఆకర్షించే విధంగా కొత్తకొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత ప్రయాణం ఒకటి. అటు మెట్రో రైళ్లతో పాటుగా.. బస్సుల్లో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేసేలా కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ప్రకటన కూడా చేసింది. ఈ ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. అంతేకాదు ఈ నిర్ణయాలకు కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరంలేదని.. తక్షణమే దీనిని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

అంతేకాదు.. ఢిల్లీలో మహిళలకు రక్షణ కరువైందంటూ గత కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉచిత బస్సు, మెట్రో ప్రయాణాలతో మహిళల భద్రత కాస్త మెరుగుపడుతుందన్న అభిప్రాయంతో కేజ్రీవాల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉచిత బస్సు సౌకర్యం వల్ల బస్సుల్లోనే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మహిళల సంఖ్య, సందడి పెరుగుతుందని.. దీంతో ఒకరికి, నలుగురు తోడవడం వల్ల వేధింపులు తగ్గుతాయన్న ఆలోచనలో కేజ్రీ ప్రభుత్వం ఉంది. అంతేకాదు బస్సుల్లో మహిళలకు రక్షణగా 13 వేల మంది మార్షల్స్‌ను కూడా రంగంలోకి దించుతున్నట్లు కేజ్రివాల్‌ ప్రకటించారు. దాని వల్ల కూడా భద్రత మరింత పెరుగుతుంది.

ఇక మహిళల రక్షణతో పాటుగా.. మరో సమస్య కాలుష్యానికి కూడా చెక్ పెట్టోచ్చన్న భావన ఉంది. మహిళలు, అమ్మాయిలకు ఉచిత ప్రయాణంతో స్కూల్, పాఠశాల వెళ్లే వారు.. ద్విచక్ర వాహనాలకు బదులుగా బస్సులను ఉపయోగించడం ద్వారా కాస్తైనా కాలుష్యం తగ్గుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇక మెట్రోలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నట్లు ఈ ఏడాది జూన్‌లోనే ప్రకటన చేసింది. అయితే మెట్రోలో ఫ్రీ ట్రావెలింగ్ విషయమై ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్‌ గెహ్లోట్‌.. ఇప్పటికే ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ సీనియర్‌ అధికారులను కలిసి వారితో చర్చించారు. ఉచిత ప్రయాణానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించారు.

ఇక మహిళలకు ఫ్రీ ట్రావెలింగ్‌తో పాటు.. గృహవినియోగదారులకు ఉచిత కరెంట్ పథకాన్ని కూడా ప్రకటించారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను సరఫరా చేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ గతంలోనే ప్రకటించారు. అంతేకాదు 200 యూనిట్లు దాటిన వారికి కూడా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. 201-400 యూనిట్ల వినియోగదారులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఢిల్లీలోని గృహ వినియోగదారులు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారు ఎలాంటి బిల్లులు కట్టక్కర్లేదంటూ ప్రకటనలు చేశారు. అయితే కేజ్రీవాల్ చేస్తున్న ఈ ప్రకటనలపై ప్రతిపక్ష బీజేపీ భగ్గుమంటోంది. ఎన్నికలు రాబోతున్నందుకే ఇలాంటి ప్రకటనలు ప్రవేశపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరి కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ఈ ఉచిత ప్రయాణాలకు ఢిల్లీ మహిళలు ఆయనకు మరోసారి అధికార పీఠం మీద కూర్చోబెడతారా లేదా అన్నది మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే.