ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి ఆగ్రహం
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఓ ముఖ్యమంత్రి.. ఓ ప్రభుత్వ విభాగంతో సమానమైన టిఎస్ఆర్టీసీకి చెందిన చిరు ఉద్యోగుల పట్ల క్రూరమైన ఆధిపత్యం చెలాయించడం తగని పని. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్దమైన 26 డిమాండ్ల సాధనకుగాను ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ముఖ్యమంత్రి ఆగ్రహానికి ప్రేరణ అయినట్లు కనిపిస్తోంది. వారు చేస్తున్న డిమాండ్లన్నీ సహేతుకమైనవేనని చెప్పడం లేదు కానీ కార్మిక సంఘాలకు వారి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టే హక్కు వుంది. అలాంటి సమయంలో ఆర్టీసీ యాజమాన్యం వారితో బాధ్యతాయుతంగా […]
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ఓ ముఖ్యమంత్రి.. ఓ ప్రభుత్వ విభాగంతో సమానమైన టిఎస్ఆర్టీసీకి చెందిన చిరు ఉద్యోగుల పట్ల క్రూరమైన ఆధిపత్యం చెలాయించడం తగని పని. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయబద్దమైన 26 డిమాండ్ల సాధనకుగాను ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ముఖ్యమంత్రి ఆగ్రహానికి ప్రేరణ అయినట్లు కనిపిస్తోంది. వారు చేస్తున్న డిమాండ్లన్నీ సహేతుకమైనవేనని చెప్పడం లేదు కానీ కార్మిక సంఘాలకు వారి డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టే హక్కు వుంది. అలాంటి సమయంలో ఆర్టీసీ యాజమాన్యం వారితో బాధ్యతాయుతంగా చర్చలు జరిపి, బేరసారాలాడి డిమాండ్లను ఇరువురికి ఆమోదయోగ్యంగా పరిష్కారించాల్సి వుంటుంది.
కానీ, ఆశ్చర్యకరంగా ఇంత క్లిష్ట పరిస్థితిలో సైతం గత మూడేళ్ళుగా టిఎస్ఆర్టీసీకి పూర్తిస్థాయి యాజమాన్యం గానీ, మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మెన్, సభ్యులు కానీ లేరు. దాంతో కార్మిక సంఘాలకు ఆర్టీసీ సంస్థ పరిధిలో చర్చలు జరిపే అవకాశమే లేకపోయింది. రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన కార్పోరేషన్ ఆర్టీసీ. ప్రతి నిత్యం 95 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేరుస్తూ, 50 వేల మంది కార్మికులు, ఉద్యోగులతో, 10 వేలకు పైగా బస్సులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు అనుసంధానకర్తగా వున్న ఆర్టీసీ లాంటి ప్రధానమైన కార్పోరేషన్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌ని గానీ, ఛైర్మన్‌ని గాని ఏళ్ళ తరబడి నియమించక నిర్లక్ష్యం చేయడం ఊహకందని విషయంగా కనిపిస్తోంది.
అలాంటి పరిస్థితిలో డిమాండ్లు పేరుకుపోవడం, సంస్థ లెవల్‌లో చర్చలు జరిపేందుకు తగిన వ్యక్తులు లేకపోవడంతో కార్మిక సంఘాలు తప్పనిసరి పరిస్థితిలో 6 వారాలు ముందుగానే సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందచేశారు. ఆ తర్వాతే విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947, ట్రేడ్ యూనియన్ల చట్టం 1926 ప్రకారం కార్మిక సంఘాలకు సమ్మె చేసేందుకు పూర్తి హక్కు వుంది.
సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో చర్చలు జరిపే స్థాయిలో యాజమాన్యం సంస్థలో లేనపుడు ప్రభుత్వమే చొరవ చూపడం సర్వసాధారణం. నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు బాధ్యతాయుతమైన అధికారుల బృందాన్ని నియమించడం, కార్మిక సంఘాలతో చర్చలు జరిపేందుకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, ఒక పరిష్కారం దిశగా చర్యలు చేపట్టడం ప్రభుత్వం బాధ్యత. కానీ ముఖ్యమంత్రి కెసీఆర్ చాలా మొరటుగా, నిరంకుశ ధోరణితో కార్మికులను, ఉద్యోగులను సమ్మె ప్రారంభించిన తొలి రోజే ఘాటుగా హెచ్చరించారు. సాయంత్రంలోగా విధుల్లోకి చేరకపోతే వేలాది మందిని ఉద్యోగంలోంచి తొలగిస్తామన్నది సీఎం హెచ్చరిక సారాంశం. హెచ్చరించినట్లుగానే అక్టోబర్ 5 సాయంత్రం 48 వేల మంది ఆర్టీసీ కార్మికుల్లో విధులకు హాజరుకాని వారంతా డిస్మిస్ అయినట్లు ప్రకటించారు.
ఆ మర్నాడే పదాలను ముందస్తు వ్యూహంతో మార్చి చెప్పారు కెసీఆర్. విధులకు హాజరు కానీ వారంతా సెల్ప్ డిస్మిస్ అయ్యారంటూ సరికొత్త పదజాలాన్ని తెరమీదికి తెచ్చారు ముఖ్యమంత్రి. మరో అడుగు ముందుకేసి, సెప్టెంబర్ నెల వేతనాలను కూడా వారికి చెల్లించబోమని ప్రకటించారు. ఇంతకంటే చౌకబారుతనం మరొకటి వుంటుందా ? దిగజారిపోవడంలో ఇది పరాకాష్ట కదా ? గత 27 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వల్ల తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల మంది ప్రజలు ఏదో రూపంలో ఇబ్బందుల పాలవుతూనే వున్నారు. వీరిలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఆధారపడే గ్రామీణ ప్రాంత రైతులు, చిన్న వ్యాపారులు, చిరు ఉద్యోగులు, విద్యార్థులు, సీనియర్ సిటిజెన్లు, పేద ప్రజలు వున్నారు.
బాధ్యతారాహిత్యంతో ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన ఆర్టీసీ ప్రైవేటీకరణ, ఆర్టీసీ మూసివేత, 48 వేల మంది ఉద్యోగులు, కార్మికుల తొలగింపు వంటి ప్రకటనలు ఆర్టీసీ ఉద్యోగులను భయకంపితులను చేశాయి. దాంతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా.. మరికొందరు గుండెపోట్లతో మరణించారు. ఇప్పటి వరకు 14 మంది మరణించిన బాధాకర పరిస్థితి నిరంకుశ ముఖ్యమంత్రి కెసీఆర్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింద. పైగా సామాజికంగా, ఆర్థికంగా బలహీనులై చిన్నఉద్యోగస్తులైన ఆర్టీసీ కార్మికుల పట్ల సీఎం ఈరోజు వరకు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే వున్నారు.
తనకు తాను ముఖ్యమంత్రి లెవెల్‌లో కార్మిక సంఘాలతో నేరుగా చర్చలు జరపలేనని చెబుతూ వస్తున్న కెసీఆర్.. ఆర్టీసికి సంబంధించిన ప్రతీ ప్రకటనను తానే స్వయంగా చేస్తుండడం గమనార్హం. కనీసం రవాణా శాఖా మంత్రి ద్వారా కానీ, తాత్కాలిక యాజమాన్యం చేతగానీ ఎలాంటి ప్రకటన కెసీఆర్ చేయించడం లేదు. కెసీఆర్ ఏ ఉద్దేశంతో ఆర్టీసీపై ప్రకటనలు చేస్తున్నారో కనీసం రవాణా శాఖ మంత్రికి గానీ, తాత్కాలిక యాజమాన్యానికి గానీ తెలియకపోవడం విశేషం.
ఆర్టీసీ సమ్మె లాంటి చిన్న విషయాన్ని తన అసమర్థ ధోరణితో జఠిలం చేసిన ఘనత కెసీఆర్‌ది.
సమ్మెను తన వ్యక్తిగతమైన అంశంగా పరిగణిస్తూ.. కక్షాపూరితంగా వ్యవహరిస్తున్న కెసీఆర్ తన స్థాయిని తగ్గించుకోవడమే కాకుండా.. ముఖ్యమంత్రి పాత్రను కూడా దిగజార్చారు. కెసీఆర్ సిగ్గుమాలిన ఎత్తుగడలు, హైకోర్టుకు తప్పుడు సమాచారం అందించడం, సమ్మెతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకపోవడం, ఆర్టీసీని మూసేస్తామనడం, ప్రధాన సర్వీసులను ప్రైవేటుపరం చేస్తామని ప్రకటనలివ్వడం చూస్తుంటే ఆర్టీసీనీ, దాని కోట్ల విలువైన ఆస్తులను తనకు సన్నిహితులైన ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ఉద్దేశం కనిపిస్తోంది.
ప్రస్తుత పరిణామాలలో తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ పార్టీ, కెసీఆర్ పరిస్థితి రాజకీయ సంక్షోభంలో కొట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై కెసీఆర్ తీసుకునే తదుపరి నిర్ణయాలే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనల తీవ్రతను నిర్ణయిస్తాయి.
NOTE: రచయిత తెలంగాణ బిజెపి ముఖ్య అధికార ప్రతినిధి, వ్యూహకర్త మరియు గ్లోబల్ లీడర్ షిప్ కోచ్.
Disclaimer: ఈ ఆర్టికల్‌లోని అంశాలు రచయిత సొంత అభిప్రాయాలు..వాటిని టివీ9 ఛానల్, టీవీ9 వెబ్‌సైట్ అభిప్రాయాలుగా పరిగణించ వద్దని మనవి.