Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SC on IT Act: నిరసనగళంపై ఉక్కుపాదం మోపే పాలకుల చేతిలోని అస్త్రాలు.. వివాదాస్పద చట్టాలకు ఇక చెల్లుచీటీయేనా..?

భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో విశృంఖులంతో, విచ్చలవిడిగా ప్రవర్తించేవారిని కట్టడి చేయడానికి ఉన్న చట్టాలే అయినా ప్రభుత్వ వ్యతిరేక స్వరంపైనే ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

SC on IT Act: నిరసనగళంపై ఉక్కుపాదం మోపే పాలకుల చేతిలోని అస్త్రాలు.. వివాదాస్పద చట్టాలకు ఇక చెల్లుచీటీయేనా..?
Supreme Court On It Act
Follow us
Balaraju Goud

|

Updated on: Jul 17, 2021 | 4:55 PM

Supreme Court on IT Act: 124A… 66A ఈరెండు నిరంతరం వినిపిస్తున్న పదాలే. పాలకుల చేతిలో అస్త్రాలుగా మారి నిరసనగళంపై ఉక్కుపాదం మోపే చట్టాలనే విమర్శలున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో విశృంఖులంతో, విచ్చలవిడిగా ప్రవర్తించేవారిని కట్టడి చేయడానికి ఉన్న చట్టాలే అయినా ప్రభుత్వ వ్యతిరేక స్వరంపైనే ప్రయోగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలోనే అత్యున్నత న్యాయస్థానం 66Aను రద్దు చేసినా.. హోంశాఖ ఆరేళ్ల తర్వాత చట్టాన్ని వెనక్కు తీసుకుంటూ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఇక 124Aపైనా సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సదరు చట్టానికి ముగింపు తప్పదన్న సంకేతాలున్నాయా?

స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లైనా దేశద్రోహ చట్టం అవసరమా అంటూ సుప్రీంకోర్టు ఓ ప్రశ్నను సంధించింది.124A రద్దు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్న సమయంలో అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఊపిరి పోశాయి. వివాదాస్పదంగా మారిన ఈ చట్టానికి శతాబ్ధాల చరిత్ర ఉంది.. ఇండియాలో మొదటి లా కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన థామస్ మెకాలే 1837లో భారత శిక్షా స్మృతి ముసాయిదాను రూపొందించారు. అందులో సెక్షన్ 133 కింద దేశద్రోహం అనే నిబంధనను చేర్చారు. మహాత్మగాంధీ, బాలగంగాధర్‌ తిలక్‌ వంటివారిపై కేసులు మోపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశద్రోహం అనే పదం మాత్రమే లేదు.. కానీ చట్టం అలాగే ఉంది. నాటి నుంచి పాలకులు దేశద్రోహం పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించేవారిపై కేసులు పెడుతూనే ఉన్నారు.

JNTUలో కన్హయ్య కుమార్‌పై దేశద్రోహం కేసు పెట్టినప్పుడు దీని ఉనికిపై ప్రశ్నలు తలెత్తాయి. రద్దు చేయాలన్న డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ఇటీవల ఏపీకి చెందిన ఓ కేసులో కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ రిటైర్డ్‌ ఆర్మీ అధికారి వేసిన కేసులో చీఫ్‌ జస్టిస్‌ NV రమణ చేసిన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. ఈ సెక్షన్‌ను ఎందుకు కొట్టివేయకూడదని ప్రశ్నించింది న్యాయస్థానం. 124-A సెక్షన్‌ రాజ్యాంగబద్ధతను పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సరిగ్గా ఇదే వారం కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీల‌క నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ -2000 సెక్షన్‌ 66A కింద న‌మోదైన కేసులు ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సెక్షన్‌ కింద కొత్తగా కేసులు నమోదు చేయవద్దని ఆదేశించింది. వాస్తవానికి సెక్షన్‌ 66-Aను రద్దు చేస్తూ 2015లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆరేళ్లు కావస్తున్నా ఆ సెక్షన్‌ కింద దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదు కావడంపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. దీంతో హోంశాఖ తాజా నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పు వెలువరించిన తర్వాత దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 13వందల 7 కేసులు నమోదు అయ్యాయి. సెక్షన్‌ 66A కింద సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవచ్చు. అయితే భావప్రకటనా స్వేచ్ఛకు ఇది భంగం కలిగించేలా ఉందని కోర్టులో దాఖలైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం 2015లో రద్దు చేసింది.

తాజా పరిణామాలు ప్రజాస్వామ్య, స్వేచ్ఛవాదా విజయమని అంటున్నారు ఉద్యమకారులు. పాలకులు చట్టాలను తమ చుట్టాలుగా మార్చకుని డిసెంట్‌ వాయిస్‌పై ఉక్కుపాదం మోపుతున్నారని… వీటికి చరమగీతం పాడాల్సిన అవసరం ఉందంటున్నారు. 66A రద్దు చేయడం ద్వారా సోషల్‌ మీడియాలో తమ భావప్రకటనా స్వేచ్ఛకు విధించిన సంకెళ్లు తెంచుకుంటున్నాయని.. ఇక రాజద్రోహం పేరుతో మగ్గుతున్న వందల మంది ప్రజాస్వామ్యిక వాదులకు కూడా స్వేచ్ఛ కల్పించాల్సిన సమయం వచ్చిందంటున్నారు. మరి నిజంగానే 124A చట్టం అవసరం లేదా? మరి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన పాలకుపై కుట్రలు చేస్తే ఏ కేసులు పెట్టాలి..?

Read Also…  Hyderabad : అసలేం తెలియనట్లుగా మహిళ మృతదేహాన్ని తీసుకువచ్చారు.. ఆపై పరారయ్యారు.. హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన..!