- Telugu News పొలిటికల్ ఫొటోలు Minister ktr launched the dial a septic tank cleaner services and flagged off the cleaner vehicles in ghmc
Dial a Septic Tank: శాస్త్రీయ పద్ధతిలో మానవ వ్యర్థాల తరలింపు.. డయల్ ఎ సెప్టిక్ ట్యాంకర్లను ప్రారంభించిన కేటీఆర్.. చిత్రాలు..
మురుగు నీటి శుద్ధీకరణలో ఇప్పటికే దేశంలోనే అన్ని నగరాల కన్నా అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం, మురుగు నీటి శుద్ధీకరణలో తన సామర్య్థాన్ని మరింత పెంచుకుంటోంది.
Updated on: Jul 17, 2021 | 8:35 PM

మురుగు నీటి శుద్ధీకరణలో ఇప్పటికే దేశంలోనే అన్ని నగరాల కన్నా అగ్రస్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం, మురుగు నీటి శుద్ధీకరణలో తన సామర్య్థాన్ని మరింత పెంచుకుంటోంది. తాజాగా ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ (ఎఫ్ఎస్టీపీ)ల నిర్మాణాన్ని చేపట్టింది.

మురుగు నీటి శుద్ధీకరణలో భాగంగా శనివారం హైదరాబాద్ పీవీ నర్సింహారావు మార్గ్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద 87 సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జెండా ఊపి ప్రారంభించారు.

జలమండలి ఉప్పల్ లోని నల్ల చెరువులో నూతనంగా నిర్మించిన ఎఫ్ఎస్టీపిని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. అనంతరం ప్రజలకు అవగాహన కోసం పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు.

జలమండలి ఓఆర్ఆర్ పరిధిలోని 7 కార్పొరేషన్ లు, 18 మున్సిపాలిటీ లు, 18 గ్రామ పంచాయితీల్లో తాగునీటి సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతాల్లో జలమండలి తన సేవలను మరింత విస్తరించే క్రమంలో నూతనంగా, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను తరలించే వాహనాలతో పాటు.. ఎఫ్ఎస్టీపిల (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) నిర్మాణం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

ఇందులో భాగంగానే జలమండలి ఇప్పటికే ఉన్న ఎస్టిపిలు , ప్రతిపాదిత ఎఫ్ఎస్టిపిల వద్ద సెప్టిక్ వ్యర్థాలను రవాణా, డంపింగ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సహకారంతో 87 మంది సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లను ఎంపిక చేసింది. వీరికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇవ్వడమే కాకుండా విధి నిర్వహణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా సామాగ్రితో పాటు, కార్మికులకు ప్రత్యేక యూనిఫాం ను కూడా అందజేసింది.

ప్రస్తుతం అంబర్ పేట్, నల్లచెరువు, పెద్దచెరువు, మిరాలం ట్యాంక్, ఖాజాగూడ, నానక్ రామ్ గూడ, నాగోల్ మరియు ఖాజకుంటలలో ఉన్న ఎస్టిపిల వద్ధ.. 80 కెఎల్డి (కిలో లీటర్ పర్ డే) సామర్థ్యం గల, 8 కో-ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించారు. ఇప్పటికే ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలను ఇవి శుద్ధి చేస్తున్నాయి.

హైదరాబాద్ నల్ల చెరువు వద్ద ఆస్కీ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సహకారంతో 40 కెఎల్డి సామర్థ్యం గల ఒక నూతన ఎఫ్ఎస్టిపి ని నిర్మించారు. నాగారం, ఇంజాపూర్ ల వద్ద 20 కెఎల్డి సామర్థ్యం గల మరో రెండు ఎఫ్ఎస్టిపిలు నిర్మాణ దశలో ఉన్నాయి.

ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణ, క్లీనింగ్ కోసం జలమండలి డయల్-ఎ-సెప్టిక్-ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను గౌరవ మంత్రి చేతుల మీదుగా ప్రారంభించింది. ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ కోసం 155313/14420 కు కాల్ చేసి వినియోగదారులు ఈ సేవలను పొందవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు.





























