Yoga Benefits: కంటి చూపు తగ్గుతోందా.. ఈ ఆసనాలను కేవలం రెండు నిమిషాలు చేసినా చాలు..
ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా కంటి చూపు మందగిస్తోంది. దృష్టి సమస్యలు ఈ రోజుల్లో చాలా సాధారణం అవుతున్నాయి. అయితే ఇది ఆందోళన కలిగించే విషయం. దీనికి కారణం శరీరంలో పోషకాలు లేకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్ సమయం అలాగే సరైన నిద్ర లేకపోవడం. ఈ రోజు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కొన్ని నిమిషాల యోగా భంగిమల గురించి మనం తెలుసుకుందాం..
Updated on: Jun 07, 2025 | 8:09 PM

కొన్ని ఏళ్ల క్రితం వరకూ కంటి చూపు మందగించడాన్ని వృద్ధాప్య సమస్యగా భావించేవారు. అయితే నేటి కాలంలో చాలా మంది యువకులు కళ్ళజోడు ధరించడమే కాదు చిన్న పిల్లలలో కూడా కంటి చూపు మందగించడం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దీని కోసం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం చాలా ముఖ్యం. , ఎందుకంటే చెడు ఆహారం శరీరంలో పోషకాల లోపానికి కారణమవుతుంది. అపుడు దృష్టిని బలహీనపరచడమే కాదు అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కనుక మంచి ఆహారంతో పాటు యోగాను మీ దినచర్యలో చేర్చుకోవాలి. తద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే యోగాసనాలు కూడా ఉన్నాయి.

కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు దినచర్యలో కూడా మార్పులు చేసుకోవాలి. చెడు అలవాట్లకు వీడ్కోలు చెప్పి మంచి అలవాట్లను అలవర్చుకోవాలి. యోగా ఈ మంచి అలవాట్లలో ఒకటి. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు మీ చూపుని అకాల వృద్ధాప్యం నుంచి కాపాడుతుంది. కంటి చూపును పెంచడంలో ఏ యోగాసనాలు సహాయపడతాయో ఈ రోజు తెలుసుకుందాం..

త్రాటక యోగా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి త్రాటక ఒక గొప్ప యోగాభ్యాసం. ఇందులో మీరు ఒక సాధారణ ప్రక్రియను పునరావృతం చేయాలి. ముందుగా చీకటి గదిలో కొవ్వొత్తిని వెలిగించి.. దానిని ఒక చేయి అంత దూరంలో ఒక స్టాండ్‌పై ఉంచండి. కొవ్వొత్తి ఎత్తు మీ కళ్ళకు సమానంగా ఉండాలి. తద్వారా మీరు కొవ్వొత్తిని నేరుగా చూడగలరు. మండుతున్న మంటను రెప్పవేయకుండా చూస్తూ ఉండండి . కళ్ళ నుంచి నీరు కారడం ప్రారంభించినప్పుడు.. కళ్ళు మూసుకోండి. ఈ ప్రక్రియను రెండు. మూడు సార్లు చేయండి. రోజూ క్రమం తప్పకుండా చేయండి.

పామింగ్ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ దినచర్యలో కొన్ని సెకన్ల పాటు కంటి పామింగ్ చేయాలి. ఇది ముఖ్యంగా కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి చేసే ప్రక్రియ. ఇందులో కంటి కండరాలు సడలించబడతాయి. కంటి ఒత్తిడి తగ్గుతుంది. ఇది కళ్ళ చుట్టూ ఉన్న కండరాల రక్త ప్రసరణను మెరుగుపరుస్తుందని, ఇది బలహీనమైన దృష్టిని నివారిస్తుందని నమ్ముతారు. ఈ పామింగ్ ను పని చేస్తూ మధ్యలో కూడా చేయవచ్చు. కళ్ళు అలసిపోయినట్లు అనిపించినప్పుడు.. అరచేతులను ఒకదానికొకటి రుద్దండి.. ఆపై అవి వెచ్చగా ఉన్నప్పుడు, కళ్ళు మూసుకుని అరచేతులను కనురెప్పలపై ఉంచండి.

హలాసనం సర్వాంగాసనం లాగే, హలాసన యోగా కూడా కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనాలు రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. ఒకే తేడా ఏమిటంటే చాప మీద పడుకున్న తర్వాత మీరు మీ కాళ్ళను పైకి లేపడానికి బదులుగా వెనుకకు తీసుకోవాలి. ఈ హలాసనం బొడ్డు కొవ్వును తగ్గించడం, మధుమేహాన్ని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది.

సర్వాంగాసనం మీ దినచర్యలో ఒకటి నుంచి రెండు నిమిషాలు సర్వాంగాసనాన్ని చేయండి. తల వైపు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కనుక ఈ ఆసనం కళ్ళకు కూడా మేలు చేస్తుంది. ఈ యోగాసనం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఇది ప్రయోజనకరమైన యోగా ఆసనం కూడా.

భస్త్రిక ప్రాణాయామం ప్రాణాయామం చేయడం వల్ల మొత్తం శరీరానికి, మెదడుకు కూడా మేలు జరుగుతుంది. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి దినచర్యలో భస్త్రిక ప్రాణాయామాన్ని చేర్చుకోవచ్చు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరచడంతో పాటు శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది.



















