- Telugu News Photo Gallery World photos At least 13 dead in Italy floods and force 13,000 displaced from their homes
Italy Floods: ఇటలీలో వరద భీభత్సం.. 13 మంది మృతి, నిరాశ్రయులైన వేలమంది ప్రజలు
సుమారు వందేళ్ల తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల దాటికి ఇటలీ అల్లాడిపోతోంది. ఉత్తర ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. వరద దాటికి ఇప్పటి వరకు 13 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..
Updated on: May 19, 2023 | 4:16 PM

సుమారు వందేళ్ల తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల దాటికి ఇటలీ అల్లాడిపోతోంది. ఉత్తర ఎమిలియా-రొమాగ్నా ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. వరద దాటికి ఇప్పటి వరకు 13 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

వినాశకరమైన వరద ఇటలీలో వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా వ్యవసాయాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. 5 వేల ఎకరాల పంట నీటిపాలయ్యింది. రొమాగ్నాలో 300 వరకు కొండచరియలు విరిగిపడ్డాయి. 23 నదులు పొంగిపొర్లుతున్నాయి. 400 రోడ్లు, 42 మునిసిపాలిటీలు దెబ్బతిన్నాయి.

వరద ఉధృతి 2012లో ఈ ప్రాంతంలో సంభవించిన భూకంప సంఘటనలను తలపించేలా ఉంది. వేలాది మంది నివాసాలు ధ్వంసం అయ్యాయి. దాదాపు 1 బిలియన్ యూరోల నష్టం వాటిల్లినట్లు ఎమిలియా-రొమాగ్నా ప్రెసిడెంట్ స్టెఫానో బొనాకిని అంచనా వేస్తు్న్నారు. నష్టం మరింత పెరగవచ్చని, కచ్చితమైన గణాంకాలు ఇవ్వడం ఇప్పట్లో కుదరదని ఆయన అన్నారు.

వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవడానికి అత్యవసర సహాయంగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇచ్చింది. కొన్ని కంపెనీలు సైతం విరాళాలు అందించడానికి ముందుకొచ్చాయి.

కనీసం 13,000 మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టవలసి వచ్చింది. ముంపు ప్రాంతాలలో కరెంటు స్థంభించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. అధికారులు విద్యుత్‌ను పాక్షికంగా పునరుద్ధరించగలిగినా.. దాదాపు 27,000 మంది ప్రజలు ఇంకా చీకట్లోనే ఉన్నారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తక్షణమే తరలించాలని అధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోని నివాసితులను రక్షించేంత వరకు ఎత్తైన భవనాల్లో ఆశ్రయం పొందాలని ఆదేశించారు.





























