- Telugu News Photo gallery Ttd temple opening in jammu 8th june 2023 union ministers kishan reddy jitendra singh ttd chairman perticipated
TTD Temple in Jammu: జమ్మూలో కొలువుదీరిన వైకుంఠదాముడు.. వైభవంగా మహా సంప్రోక్షణ కార్యక్రమం..
జమ్ములో శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణం ఘనంగా జరిగింది. జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా టీటీడీ ఆలయాలన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి , జితేంద్రసింగ్‌తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. తొలిరోజే స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు.
Updated on: Jun 09, 2023 | 6:10 AM

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జమ్మూలోని మాజిన్ గ్రామంలో గురువారం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన మహా సంప్రోక్షణ, విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, మరో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

శివాలిక్ అడవుల మధ్య 62 ఎకరాల ప్రాంగణంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయు ప్రారంభోత్సవం జూన్ 3న ప్రారంభమైంది. ఆరు రోజుల పాటు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పలు పూజా, ప్రతిష్టా కార్యక్రమాలను నిర్వహించారు.

చివరి రోజైన గురువారం ధ్వజారోహణం, సర్వదర్శనం ప్రారంభ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వెంకటేశ్వర దేవాలయం జమ్మూ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మహా సంప్రోక్షణలో భాగంగా విగ్రహ ప్రతిష్ట ఒకప్పుడు మహర్షి కశ్యపులకు నిలయమైన ఈ భూమిని ఉత్తేజపరుస్తుంది అని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ట్విట్ చేశారు.

“జమ్మూలో జరిగిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్టలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మహా సంప్రోక్షణలో భాగంగా విగ్రహ ప్రతిష్ఠాపన మహర్షి కశ్యపులకు నిలయమైన ఈ భూమిని ఉత్తేజపరుస్తుంది.’’ “ఇప్పుడు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశవ్యాప్తంగా బాలాజీ దేవాలయాలు ఉన్నాయి. దీని వల్ల భక్తులు ఆలయంలో తమ ప్రార్థనలు నిర్వహించుకుని బాలాజీని దర్శించుకునే అవకాశం లభిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక పర్యాటకాన్ని పెంచేందుకు దోహదపడటంతోపాటు జమ్మూ కాశ్వీర్ వాసులు దర్శనం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది’’ అని కిషన్ రెడ్డి ట్విట్ చేశారు.

ఈ ఆలయం జమ్మూ ప్రాంతంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి. జమ్మూలోని ఈ గుడి ఆంధ్రప్రదేశ్ వెలుపల నిర్మించిన ఆరో శ్రీ వేంకటేశ్వర ఆలయం. మిగతా ఐదు ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్ లలో నిర్మించింది. రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కొత్త ఆలయాలు కూడా నిర్మించనుంది.

జమ్ము లోని మాజిన్ గ్రామంలో స్వామి వారి ఆలయాన్ని టీటీడీ సర్వాంగసుందరంగా నిర్మించింది. 30 కోట్ల వ్యయంతో 62 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మించారు. అందమైన శివాలిక్ అడవుల మధ్య శ్రీ వేంకటేశ్వర ఆలయం భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

జమ్మూ లో శ్రీ వేంకటేశ్వర్ ఆలయాన్ని భక్తుల కోసం ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో అనుసరిస్తున్న విధానం, ఆచారాన్ని జమ్మూ ఆలయంలో కూడా అనుసరిస్తామన్నారు. ఈ పవిత్ర స్థలంలో తిరుపతి బాలాజీ ఆలయాన్ని టీటీడీ నిర్మించిందని తెలిపారు.

ఆలయ ప్రాంగణంలో టీటీడీ ప్రధాన ఆలయ సముదాయంతో పాటు ఉపాలయాలు, పోటు కిచెన్ ఏరియా, అన్నప్రసాదం కౌంటర్లు తదితరాలను నిర్మించింది.

ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, స్థానిక ఎంపీ జుగల్ కిషోర్ శర్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జమ్మూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, ఆలయ అధ్యక్షులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వేదపండితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





























