AP Govt Schools: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు భలే ఛాన్స్.. రోజూ గంటసేపు పండగే
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను చదువుతోపాటు క్రీడల్లోనూ తీర్చిదిద్దాలని కూటమి సర్కార్ సంకల్పించింది. ఇందుకోసం క్రీడల్లోనూ పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సరికొత్త కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ బడుల్లో అమలు చేసేందుకు సంకల్పించింది. ఆటలు ఆడటం వల్ల విద్యార్థుల మానసిక వికాసం మెరుగుపడుతుందని, గెలుపోటములను సమానంగా తీసుకుని ఆదర్శంగా మారతారని భావిస్తుంది..

అమరావతి, మార్చి 5: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధుల కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను క్రీడల్లోనూ తీర్చిదిద్దాలని సంకల్పించింది. ఇందుకోసం క్రీడల్లోనూ పిల్లల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని అన్ని ప్రభుత్వ బడుల్లో అమలు చేసేందుకు సంకల్పించింది. ఆటలు ఆడటం వల్ల విద్యార్థుల మానసిక వికాసం మెరుగుపడుతుందని, గెలుపోటములను సమానంగా తీసుకునే స్ఫూర్తి అలవడి ఆత్మవిశ్వాసం పెంచుకుంటారని భావిస్తోంది. ఈ కార్యక్రమం కింద అన్ని బడుల్లో రోజుకు గంట చొప్పున విద్యార్ధులతో ఆటలు ఆడించేందుకు విద్యాశాఖ సమాయాత్త మవుతుంది. ఇందుకు ఢిల్లీ పాఠశాలల్లో అమలు చేసిన నమూనాపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా వచ్చే వేసవి సెలవుల వరకు ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు పాఠశాలలో ఈ కార్యక్రమాన్ఇన అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం విడతల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం ఎలా ఉంటుందంటే..
అన్ని ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులను 5-8, 9-14, 15-19 ఏళ్లుగా విభజిస్తారు. వారికి ఆసక్తి ఉన్న ఆటలను రోజుకో గంట చొప్పున ఆడిస్తారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుల్‌బాల్ వంటి క్రీడల కోసం పాఠశాలల్లో మల్టీ కోర్టులు ఏర్పాటు చేస్తారు. అలాగే పరుగు పందెం, ఇతర క్రీడల కోసం ట్రాక్‌లు నిర్మిస్తారు. ఇందుకోసం పాఠశాలల్లోని పీఈటీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఫలితాలను పరిశీలించి, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది. అంతేకాకుండా నాలుగైదు పాఠశాలలకు ఓ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
పాఠశాలల్లో రాణించిన వారిని ఈ కేంద్రంలో నిర్వహించే ప్రత్యేక శిబిరాలకు పంపి అక్కడ మెరికల్లా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ప్రోత్సహిస్తే రాణించే అవకాశం ఉంటుందనేది ప్రభుత్వం ఉద్దేశ్యం. మొదట ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో ప్రతిభ అన్వేషణ జరుగుతుంది. వీరికి చదువుతో సహా పదేళ్లపాటు శిక్షణ ఇచ్చి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేస్తారన్నమాట. ఇందుకోసం ప్రత్యేకంగా పాఠశాలల్లో స్పోర్ట్స్ కరిక్యులమ్‌ను రూపొందిస్తారు. ‘యాక్టివ్ ఆంధ్ర’ కార్యక్రమం కోసం స్వీక్యోయియా ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ టెక్నాలజీ అనే సంస్థతో విద్యాశాఖ ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




