- Telugu News Photo Gallery Tokyo olympics 2020-21 photos Tokyo Olympics 2020: 14 year old China swimmer quan wins Olympic diving gold with perfect 10
Tokyo Olympics 2020: చిన్న వయసులోనే సంచలనం.. డైవింగ్‌లో సరికొత్త రికార్డులతో స్వర్ణ పతకం
డైవింగ్ ఈవెంట్‌లో చైనా తన ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. గత నాలుగు ఒలింపిక్స్‌లో మహిళల డైవింగ్ ఈవెంట్‌లో వరుసగా విజేతలుగా నిలుస్తూ వస్తోంది.
Updated on: Aug 06, 2021 | 9:15 AM

టోక్యో ఒలింపిక్ క్రీడల్లో మహిళల 10 మీటర్ల డైవింగ్ ప్లాట్‌ఫాం ఈవెంట్‌లో చైనాకు చెందిన 14 ఏళ్ల కువాన్ హాంగ్‌చాన్ ఆధిపత్యం చెలాయించింది. ఐదు రౌండ్ల పోటీలో రెండవ, నాల్గవ రౌండ్లలో, మొత్తం ఏడుగురు జడ్జీలు ఆమెకు 10 పాయింట్లు అందించారు. మొత్తం 466.20 స్కోర్‌తో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకోగా, వెండి పతకం చైనాకు చెందిన 15 ఏళ్ల చెన్ యుషి (425.40) కి దక్కింది. ఆస్ట్రేలియాకు చెందిన మెలిస్సా వు నాల్గవ ఒలింపిక్స్ ఆడుతూ, 341.40 స్కోరుతో ఈ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ 29 ఏళ్ల అథ్లెట్ బామ్మ చైనాకు చెందినది కావడం విశేషం.

వెండి పతకం గెలుచుకున్న చెన్, 2019 ప్రపంచ ఛాంపియన్. ఈ గేమ్స్‌లో ఆమె ఇప్పటికే 10 మీటర్ల సింక్రో టీమ్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించింది. ఈ ఈవెంట్‌లో చైనా నుంచి పతకం సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా కువాన్ నిలిచింది. 1992 ఒలింపిక్స్‌లో 13 సంవత్సరాల వయస్సులో బంగారు పతకం సాధించిన ఫు మింగ్సియా పేరు మీద ఈ రికార్డు ఉంది. అనారోగ్యంతో ఉన్న తన తల్లికి కువాన్ తన విజయాన్ని అంకితం చేసింది. 'నేను నాతల్లికి సహాయం చేయడానికి డబ్బు సంపాదించాలనుకుంటున్నాను. నా కోచ్ చెప్పినట్లుగానే ఆడాను. ఆయన ప్రతీ సూచనను పాటించి విజయం సాధించాను' అని పేర్కొంది.

చైనా తన డైవర్లను చాలా చిన్న వయస్సు నుంచే సిద్ధం చేస్తుంది. దీని కోసం, వారి శిక్షణ కౌమారదశ నుంచి అంటే 12 సంవత్సరాల నుంచే మొదలుపెడుతుంది. కువాన్ హాంగ్‌చాన్ ఫలితం కూడా అలా వచ్చిందే. టోక్యో ఒలింపిక్స్‌లో ఆమె చైనాకు చెందిన అతి పిన్న వయస్కురాలు. లెటియావో (స్పైసీ చైనీస్ స్నాక్) తినడం ద్వారా బంగారు పతక విజయోత్సవాన్ని నిర్వహించుకుంటానని ఆమె తెలిపింది.

'మాకు ప్రత్యేక శిక్షణ సాంకేతికత అంటూ ఏమీ లేదు. పదే పదే డైవింగ్ చేయడం, పూర్తి సాధనతో ఇది సాధ్యమైందని' ఆమె తెలిపింది. కువాన్ విజయం తర్వాత ఇతర దేశాల కోచ్‌లు, అథ్లెట్లు కూడా ఆమెను అభినందించారు.

టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల డైవింగ్‌లో అన్ని ఈవెంట్‌లలోనూ చైనా విజయం సాధించింది. వరుసగా విజయాలు సాధిస్తూ ఆదేశం సత్తా చాటుతోంది. పురుషుల 10 మీటర్ల ప్లాట్‌ఫాం ఈవెంట్ ఇంకా జరగలేదు.




