మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఈ రాశికి శని, గురువు, రాహువు వంటి ప్రధాన గ్రహాల అనుకూలత తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, రాశ్యధిపతి బుధుడు, శుక్రుడు, రవి గ్రహాల అనుకూలత బాగా పెరుగుతున్నందువల్ల కొత్త సంవత్సరంలో ద్వితీయార్థం నుంచి జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యయ స్థానంలో సంచారం చేస్తున్న గురువు మే 25 నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ద్వితీయార్థంలో ధన వృద్ధికి, పదోన్నతులకు, ఇంట్లో శుభకార్యాలకు బాగా అవకాశం ఉంది. మే 25 లోపు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు మే 18 తర్వాత నుంచి పరిష్కారం కావడం ప్రారంభిస్తాయి. మే 18 నుంచి రాహువు భాగ్య స్థానంలోకి, మార్చి 29 నుంచి శని దశమ స్థానంలోకి అడుగు పెడుతున్నందువల్ల విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. అయితే, పని భారం విపరీతంగా పెరిగి విశ్రాంతి కరవయ్యే అవకాశం ఉంది. తరచూ శివాలయానికి వెళ్లి అర్చన చేయించడం మంచిది. ఆర్థికంగా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఒకటి రెండు ముఖ్య మైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ప్రథమార్థంలో సామాన్యమైన ఉద్యోగం లభించినా, ద్వితీయార్థంలో మాత్రం ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభ సమాచారం అందుతుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి.