- Telugu News Photo Gallery Spiritual photos Unique Temples in India: do you know of a temple where alcohol and meat are offered as offerings
Unique Temples: ఈ దేవాలయాల్లో ప్రసాదాలు వెరీ వెరీ స్పెషల్.. దేవుళ్ళకు నైవేద్యంగా మద్యం, మాంసం, చేపలు, బిర్యానీ
హిందువులు దేవుడిని నమ్ముతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారు. అయితే దేవుడిని పూజించే విషయంలో ఒకొక్క ప్రాంతాల్లో ఒకొక్క రకమైన ఆచారాలు ఉంటాయి. పూజా విధానం, నైవేద్యంగా సమర్పించే ఆహార పదార్ధాలు ఒకొక్క దేవుడికి ఒకొక్క రకంగా ఉంటుంది. అదే విధంగా దేవాలయాల్లో దేవుళ్ళకు సమర్పించే ప్రసాదం కూడా రకరకాలుగా ఉంటుంది. అలా దేవుడికి నైవేద్యంగా సమర్పించే ఆహరాన్ని భక్తులకుప్రసాదంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెర పొంగలి, శనగలు వంటి రకరకాల ఆహార పదార్ధాలను ప్రసాదంగా ఇస్తారు. అయితే కొన్ని దేవాలయాల్లో మద్యం, మాంసం వంటి వాటిని దేవుడికి నైవేద్యంగా సమర్పించి.. వాటిని భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఏ దేవాలయాల్లో మద్యాన్ని ప్రసాదంగా ఇస్తారో తెలుసుకుందాం..
Updated on: Mar 18, 2025 | 8:00 AM

దేవాలయాల్లో దేవుళ్ళకు రకరకాల పూజలు నిర్వహిస్తారు. అక్కడి ఆచారాన్ని బట్టి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తుంటారు. తిరుమల, శ్రీశైలం, అయోధ్య వంటి అనేక పుణ్య క్షేత్రాల్లో మాత్రమే కాదు ఆలయ పరిసరాలలో కూడా మద్యం, మాంసం నిషేధం. అయితే మరోవైపు కొన్ని ఆలయాల్లో మద్యం, మాంసం నైవేద్యంగా దేవుళ్ళకు సమర్పిస్తారు. వాటిని ఎంతో భక్తితో ప్రసాదంగా స్వీకరిస్తారు. కాల భైరవుడికి, కొన్ని శక్తి ఆలయాల్లో మాంసం, మద్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.

తెలంగాణలోని చింతలకుంట ఆంజనేయ స్వామి వారికి మద్యం, మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. వాటిని తిరిగి భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. బహుశా ఈ ఒక్క హనుమాన్ ఆలయంలో మాత్రమే ఈ విధమైన ప్రసాదం ఉంటుంది.

ప్రపంచంలో అత్యంత పురాతన నగరం.. శివయ్య కొలువుండే క్షేత్రం వారణాసిలో విశ్వనాథుడు, అన్నపూర్ణ, విశాలాక్షి సహా అనేక ఆలయాలు ఉన్నాయి. ఆలాంటి ఆలయాల్లో ఒకటి బాబా బాతుక్ భైరవ ఆలయం. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ బాబా బాతుక్ భైరవ స్వామి దర్శనానికి వెళ్ళే భక్తులు పిల్లలైతే బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తారు. పెద్దలు మాంసం, మద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీలో ఉన్న కాల భైరవ ఆలయంలో దేవుడికి మందుని నైవేద్యంగా సమర్పిస్తారు. మందు మాత్రమే కాదు మాంసం, చేప వంటి వాటిని నైవేద్యంగా సమర్పిస్తారు. ఆల్కహాల్ ని దేవుడికి సమర్పించిన అనంతరం మిగిలిన దానిని భక్తులు తీసుకుంటారు. కాల భైరవ నాథ్ ఉజ్జయిని నగర సంరక్షకుడుగా నమ్మకం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని బద్రసేనన్ రాజు నిర్మించినట్లు నమ్మకం. శైవ సంప్రదాయంలోని ఎనిమిది భైరవులలో కాల భైరవ ప్రధానుడు. ఇక్కడ తాంత్రిక ఆరాధన జరుగుతుంది.

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఖబీస్ బాబా ఆలయం ఉంది. ఇక్కడ ఖబీస్ అనే సాధువు శివుడిని ప్రార్ధిస్తూ శివైఖ్యం చెందాడు. ఆయన శిష్యులు ఖబీస్ మరణించిన ప్రదేశంలో ఆలయం నిర్మించారు. ఈ ఆలయంలో భక్తులు ఆల్కహాల్ ను సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరతాయని నమ్మకం. ఈ ఆలయంలో ఉన్న విగ్రహం మీద రెండు చీలికలు ఉంటాయి. ఒకదాంట్లో భక్తులు మద్యాన్ని పోస్తారు. చివరగా మిగిలిన మద్యాన్ని ప్రసాదంగా భక్తులకు సమర్పిస్తారు.

తమిళనాడు తిరుమంగళలోని వడక్కంపట్టి గ్రామంలో ఉన్న మునీశ్వరుడి ఆలయంలో 'మటన్ బిర్యానీని ప్రసాదంగా పెడుతుంటారు. అక్కడ గత 85 ఏళ్లుగా ఇలా బిర్యనీని నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం జనవరి 25న మూడు రోజులు పాటు మునీశ్వరుడి ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో 2000కేజీల బాస్మతి రైస్, మటన్‌తో బిర్యానీ తయారుచేస్తారు. ఆరోజు ఆలయానికి వచ్చే భక్తులకు ఈ మటన్ బిర్యానీని ప్రసాదంగా అందజేస్తారు.

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న కాళీమాత ఆలయంలో విస్కీ, వైన్ ఇలా ఎన్నో రకాల లిక్కర్లు లను ప్రసాదంగా సమర్పిస్తారు. తర్వాత ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులకు విస్కీ, వైన్ ని ప్రసాదంగా అందిస్తారు.

కేరళ రాష్ట్రంలోని పరస్సినిక్కడవు మదప్పురం ఆలయంలో కూడా చేపలు, తాటి కల్లు, మాంసాన్ని , అల్కాహాలు(ఫుల్ లేదా ఆఫ్ బాటిల్) ను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. పూజ పూర్తీ అయ్యాక వీటినే భక్తులకు ప్రసాదాలుగా అందిస్తారు. అంతేకాదు కొబ్బరి ముక్కలను కూడా భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.

ఒడిశాలోని విమల ఆలయంలో అమ్మవారికి ప్రసాదంగా చేపలు, మటన్ నైవేద్యంగా నైవేద్యం పెడతారు. దుర్గా దేవి రూపంగా పరిగణించబడే విమల మాత, జగన్నాథ ఆలయ సముదాయం లోపల ఉంది. దీనిని శక్తిపీఠంగా భావిస్తారు.





























